DailyDose

భారీ ఎన్‌కౌంటర్…18మంది హతం-CrimeNews-Apr 16 2024

భారీ ఎన్‌కౌంటర్…18మంది హతం-CrimeNews-Apr 16 2024

* మరో 10 రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనుండగా.. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని కాంకేర్‌ (Kanker) జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ (Encounter) చోటుచేసుకుంది. ఛోటేబేథియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్‌రావు కూడా ఉన్నాడని, అతడి మీద రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు సమాచారం. బీఎస్‌ఎఫ్‌, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపడుతుండగా.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఛోటేబేథియా పీఎస్‌ పరిధిలోని హపటోలా అటవీ ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య ఎన్‌కౌంటర్‌ మొదలైందని బీఎస్‌ఎఫ్‌ తెలిపింది. ఘటనా స్థలంలో ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా.. కాంకేర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

* సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. 1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది. తోట త్రిమూర్తులు, మరో ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు.. వారికి జైలు శిక్ష, జరిమానా విధించింది. న్యాయస్థానం తీర్పుపై దళిత, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో కోర్టుల పట్ల నమ్మకం పెరిగిందని తెలిపాయి.

* నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి మండలం గౌరవరం గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుకవైపు నుంచి కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కావలి డివిజన్‌ పరిధిలోని జలదంచి మండలం చామదల గ్రామానికి చెందిన వారిగా భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.

* బాసర ఆర్జీయూకేటీలో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటికి వెళ్లిన విద్యార్థి పరీక్షల నిమిత్తం ఈనెల 12న తిరిగి విశ్వవిద్యాలయానికి వచ్చాడు. హాజరుశాతం తక్కువగా ఉందని అధికారులు అతడిని పరీక్షకు అనుమతించలేదు. తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి హాజరు శాతం తక్కువగా ఉందని.. ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. వారు రాకపోవడంతో విద్యార్థి హాస్టల్‌లోనే ఉన్నాడు. తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన కొద్దిసేపటికి ఉరేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన విద్యార్థులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్‌ ఆస్పత్రికి తరలించారు. సీఐ రాకేశ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z