Business

UPI చెల్లింపుల వ్యవస్థలో మార్పులు-BusinessNews-Apr 17 2024

UPI చెల్లింపుల వ్యవస్థలో మార్పులు-BusinessNews-Apr 17 2024

* దేశీయంగా యూపీఐ (UPI) చెల్లింపుల వ్యవస్థలో ఫోన్‌పే, గూగుల్‌ పే ఆధిపత్యం కొనసాగుతోంది. నిన్న మొన్నటివరకు ఎంతోకొంత పోటీ ఇచ్చిన పేటీఎం.. ఆర్‌బీఐ ఆంక్షల మూలంగా పోటీలో వెనకబడింది. దీంతో యూపీఐ లావాదేవీల్లో విలువపరంగా ఈ రెండు సంస్థల వాటా 86 శాతానికి చేరుకుంది. వీటి గుత్తాధిపత్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈక్రమంలో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) రంగంలోకి దిగింది. వీటి ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లతో త్వరలో భేటీ కానుంది. యూపీఐ లావాదేవీల్లో గుత్తాదిపత్యంపై ఇటీవల ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తంచేసింది. పార్లమెంటరీ ప్యానెల్‌ సైతం ఇదే అంశాన్ని గతంలో లేవనెత్తింది. ఈనేపథ్యంలో ఎన్‌పీసీఐ ప్రతినిధులు క్రెడ్‌, ఫ్లిప్‌కార్ట్‌, జొమాటో, అమెజాన్‌, ఇతర ఫిన్‌టెక్‌ సంస్థలతో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎంను ఆహ్వానించలేదని ‘టెక్‌ క్రంచ్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది. తమ వేదికలపై యూపీఐ లావాదేవీల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే ఆయా సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది.

* డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌ కారణంగా కలిగే ప్రయోజనాలను భారత్‌ పొందలేకపోతోందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ (Raghuram Rajan) అన్నారు. యువతలో నైపుణ్యాల మెరుగుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశం మొత్తం జనాభాలో పనిచేయని వారితో పోలిస్తే పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాన్ని డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌గా పేర్కొంటారు.

* ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసం ఉద్దేశించినదే అయినా.. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా (EPF Withdraw) చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్‌ నుంచి కొంత మొత్తంలో నగదును ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి. తాజాగా ఇందులో ఈపీఎఫ్‌వో (EPFO) కీలక మార్పు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్‌ పరిమితిని ఈపీఎఫ్‌ఓ రెట్టింపు చేసింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్‌ఓ ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది. ‘‘పేరా 68జె కింద ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెంచుతున్నాం’’ అని వెల్లడించింది. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం ఈ పేరా కింద ఈపీఎఫ్‌ డబ్బులను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.

* అమెరికా (USA) రైతులకు ప్రయోజనం చేకూరేలా భారత్‌ తన మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ (Joe Biden) అడ్మినిస్ట్రేషన్‌లోని కీలక అధికారి తెలిపారు. కొన్ని డబ్ల్యూటీఓ వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా ఇది సాధ్యమైందని వెల్లడించారు. బైడెన్‌ వాణిజ్య విధాన రూపకల్పనపై ఏర్పాటైన హౌస్‌ కమిటీకి ఆ దేశ వాణిజ్య ప్రతినిధి కేథరీన్‌ టాయ్‌ ఈ విషయాన్ని మంగళవారం వివరించారు.

* వీడియో గేమింగ్ కంపెనీ, గ్రాండ్ థెఫ్ట్ ఆటో ఫ్రాంఛైజీ మేక‌ర్ టేక్ -టూ ఇంట‌రాక్టివ్ సాఫ్ట్‌వేర్ లేఆఫ్స్ ప్ర‌క‌టించింది. వ్య‌య నియంత్ర‌ణ‌, కంపెనీ కార్య‌క‌లాపాల క్ర‌మ‌బద్ధీక‌ర‌ణ‌లో భాగంగా భారీ పున‌ర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను వెల్ల‌డించింది. ఈ ప్ర‌ణాళిక‌ల‌లో భాగంగా కంపెనీ ఉద్యోగుల్లో 5 శాతం అంటే దాదాపు 600 మంది ఉద్యోగుల‌ను సాగ‌నంపుతోంది. కంపెనీ అభివృద్ధి చేస్తున్న ప‌లు ప్రాజెక్టుల‌ను నిలిపివేసింది.

* గోల్డ్‌ మార్కెట్‌ రోజుకో రికార్డుతో షేక్‌ చేస్తున్నది. మునుపెన్నడూ లేనివిధంగా బంగారం ధరలు సరికొత్త స్థాయిల్లో కదలాడుతున్నాయి మరి. మంగళవారం పుత్తడి విలువ ఏకంగా 74వేలపైకి చేరింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ 10 గ్రాములు ఆల్‌టైమ్‌ హైని తాకుతూ తొలిసారి రూ.74,130గా నమోదైంది. సోమవారం ముగింపుతో చూస్తే ఒక్కరోజే రూ.980 ఎగబాకింది. అంతకుముందు రోజూ రూ.600 ఎగబాకిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలో ఈ పెరుగుదల రూ.73,750గా ఉన్నది. కాగా, స్పాట్‌ మార్కెట్‌లో పన్నులతో కలుపుకొని మేలిమి బంగారం ధర తులం రూ.75,000 దాటడం గమనార్హం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z