Business

17వేలకోట్లకు పైగా లాభాలను ఆర్జించిన HDFC-BusinessNews-Apr 20 2024

17వేలకోట్లకు పైగా లాభాలను ఆర్జించిన HDFC-BusinessNews-Apr 20 2024

* దేశంలోనే అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC bank) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం చివరికి త్రైమాసికంలో బ్యాంకు ఏకీకృత ప్రాతిపదికన రూ.17,622.38 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.17,257.87 కోట్లతో లాభం 2.11 శాతం మేర పెరిగింది. స్టాండర్డ్‌లోన్‌ పద్ధతిలో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.16,372.54 కోట్ల నుంచి రూ.16,511.85 కోట్లకు పెరిగింది. పూర్తి సంవత్సరానికి రూ.64,060 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

* కేంద్రంలో భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే.. ఎన్నికల బాండ్ల పథకాన్ని (electoral bonds scheme) పునరుద్ధరిస్తామంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ‘‘సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు ఇచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని తాము తిరిగి అధికారంలోకి వస్తే.. మళ్లీ తీసుకువస్తామని కేంద్రమంత్రి సీతారామన్ ప్రకటించారు. ‘పే పీఎం స్కామ్’ కింద భాజపా రూ.4 లక్షల కోట్లు దోచుకున్న విషయం మనకు తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఆ దోపిడీని కొనసాగించాలనుకుంటున్నారు. ఈసారి ఎంత దోచుకుంటారో..? అందుకే ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి. అదృష్టవశాత్తూ ఈ అవినీతి దళం బయటకు వెళ్లిపోతుందని క్షేత్రస్థాయి నివేదికలు వెల్లడిస్తున్నాయి’’ అని కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌ విమర్శలు గుప్పించారు.

* టెస్లా చీఫ్ ఎలాన్‌మస్క్ (Elon Musk) భారత్ పర్యటన వాయిదా పడింది. విద్యుత్‌ కార్ల తయారీ సంస్థకు చెందిన అతి ముఖ్యమైన బాధ్యతల కారణంగా తన పర్యటన ఆలస్యమవుతోందని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. మీడియా కథనాల ప్రకారం.. ఆయన ఈ నెల 21, 22 తేదీల్లో మనదేశంలో పర్యటించాల్సి ఉంది. ఈ రెండు రోజుల ప్రణాళికలో ప్రధాని మోదీ-మస్క్‌ కీలక భేటీ కూడా ఒకటి. అనంతరం వారు పెట్టుబడుల గురించి ప్రకటన చేస్తారని అంతా భావించారు.

* పూర్తి స్థాయి విద్యుత్‌ ఎయిర్‌ ట్యాక్సీ సేవలను భారత్‌లో 2026లో ప్రారంభిస్తామని ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. ఇందుకోసం అమెరికా సంస్థ ఆర్చర్‌ ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్‌ట్యాక్సీతో దిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ నుంచి హరియాణాలోని గురుగ్రామ్‌కు కేవలం 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చని ప్రకటించింది. ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు ఆర్చర్‌ ఏవియేషన్‌ విద్యుత్తుతో నడిచే 200 ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ (ఇవీటీఓఎల్‌) విమానాలను సరఫరా చేయనుంది. ఇందులో పైలట్‌తో పాటు నలుగురు ప్రయాణించొచ్చు. ఇవి హెలీకాప్టర్‌ల మాదిరిగా పనిచేస్తాయి. కానీ తక్కువ శబ్దం, అధిక భద్రతను కలిగి ఉంటాయి. 200 ఇవీటీఓఎల్‌ల ధర దాదాపు బిలియన్‌ డాలర్లు (రూ.8,300 కోట్లు). దిల్లీతో పాటు ముంబయి, బెంగళూరుల్లో కూడా ఎయిర్‌ట్యాక్సీ సేవలను ప్రారంభించడానికి ఇంటర్‌గ్లోబ్‌, ఆర్చర్‌ ఏవియేషన్‌ సంయుక్త సంస్థ చూస్తోంది.

* ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారుల నగదు ఉపసంహరణ విషయంలో కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసే 68జే క్లెయిమ్‌ల అర్హత పరిమితిని రూ. 50,000 నుంచి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈపీఎఫ్‌వో కొత్త మార్పు ప్రకారం.. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇకపై రూ.1 లక్ష వరకూ ఉపసంహరించుకోవచ్చు. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా, ఆపరేషన్లు చేయించుకున్నా క్లెయిమ్‌ చేయొచ్చు. పక్షవాతం, టీబీ, క్షయ, క్యాన్సర్‌, గుండె సంబంధిత చికిత్స కోసం కూడా నగదు విత్‌డ్రాకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. లక్ష పరిమితికి లోబడి ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనంతోపాటు డీఏ లేదా ఈపీఎఫ్‌లో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఏది తక్కువైతే అంత వరకూ మాత్రమే ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. ఇందు కోసం ఎలాంటి మెడికల్‌ సర్టిఫికెట్లు లేకుండా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z