🕑 Published: August 04, 2026 at 11:58 AM CST
"ఎదుటివాడి ఎత్తుకు నువ్వు వేసే పైఎత్తు యుద్ధం. నీ ఎత్తుకు నువ్వే పైఎత్తు వేస్తే అది ఆలోచన ." అలాంటి ఆలోచనలే సిలికానాంధ్ర ఆయుధమని ఆ సంస్థ వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్ ఆదివారం సాయంత్రం మిల్పిటస్‌లో ఏర్పాటు చేసిన రజతోత్సవ విజయోత్సవ సభలో ఉద్వేగభరితంగా ప్రకటించడం ఆ సంస్థ నిబద్ధతకు, శక్తియుక్తులకు, దార్శనికతకు నిదర్శనం. అమెరికాలో వలసవాదులపై మరీ ముఖ్యంగా ప్రవాస భారతీయ సమాజంపై చెలరేగుతున్న ఐక్య వ్యతిరేకతకు ఈ సంస్థ రజతోత్సవ వేడుకల్లో వ్యతిరేక దిశను చూపి వ్యష్టికి సమిష్టికి మధ్య చర్చాగోష్టికి చరమగీతం పాడిన తీరు శతధా సహస్రధా ముదావహం. మన ఆలోచనను మనమే ఒక్కో మెట్టు ఎక్కించుకోవాలని అప్పుడే అద్భుతాలు, ఆనందాలు సాధ్యపడతాయని ఆయన పలికిన సత్యవాక్కులు కేవలం సంస్థలకే కాదు మానవ మనుగడకు కూడా ఆచరణీయ సందేశాలు.
పాతికేళ్ల సిలికానాంధ్ర తెలుగు సాహితీ సాంస్కృతిక సాంప్రదాయ స్ఫూర్తి కలకి నిజానికి, ప్రకృతికి అద్భుతానికి, ద్వైతానికి అద్వైతానికి మధ్య గీతలు చెరిపిందనేది వాస్తవం. సంగీతం, నాట్యం, లయం, స్వరం, జనం, ధనం, పదం, శబ్దం, వర్ణం కాదేదీ మాతృభాష పట్టానికి అనర్హమంటూ మూడు గిన్నీస్‌లు కొల్లగొట్టి మొత్తం డజనుపైగా గిన్నీస్ రికార్డులతో తెలుగుతల్లికి తోమాలసేవ చేసిన ఆ సంస్థ విజయం నేడు అమెరికావ్యాప్తంగా జేజేలు అందుకోవడం సంతోషించవల్సిన సమయం. తమ అసూయాపరులను కూడా గర్వించేలా చేసిన వారి ప్రయత్నం అభినందనీయం. తమను తాము చెరకుగడలుగా మెలిగట్టి "పంచధారను" భావితరాలకు పంచుతున్న సిలికానాంధ్ర సైన్యం అసాధ్యాలను సుసాధ్యం చేసేందుకు దోహదపడుతోంది. మన అనే తపన తప్ప నా అనే భావన దరిచేరని వారి ఆలోచనే ఆ సంస్థను ప్రయోగాలకు పుట్టినిల్లుగా మార్చిందడంలో సందేహం లేదు. వీరంతా కర్మ సిద్ధాంతాన్ని నరనరాన ఒంటబట్టించుకున్నారు గనుకే వేదిక మీద తక్కువ వెనుక ఎక్కువగా చేయవల్సిందేదో చేసి ప్రతిఫలాన్ని ఆహుతుల జ్ఞాపకాల్లో వెతుక్కుంటున్నారు. కృష్ణుడు అంతటివాడు కూడా గీతోపదేశం చేసింది ధర్మస్థాపన కోసమే కదా? భగవంతుడికి కూడా కోరిక ఉంది కదా? సగటు మనిషి ఎంత?
ధనాకర్షణ తద్వారా జనాకర్షణ ఆపైన స్వోత్కర్ష నామావళితో మమ అనిపించే వేలాది సంస్థలకు...అక్షరమే ఆశయంగా ముందుగా నాణ్యమైన కార్యక్రమాలు..తద్వారా జనాకర్షణ..ఆపైన కుదిరితే ధనాకర్షణ అంటూ మహాయజ్ఞాల మౌలిక సూత్రాలను మార్చిన సిలికానాంధ్ర విజయాలు నీడను వెంటాడం మాని వెలుగు వైపు పయనించాలని చెప్తున్నాయి. మనిషి ఉన్నంత వరకు మనస్సు ఉంటుందని మనస్సు ఉన్నంత వరకు మాట ఉంటుందని మాట ఉన్నంత వరకు అక్షరం ఉంటుందని ఆ అక్షరం ఉన్నంత వరకు సిలికానాంధ్ర ఉంటుందని ఆనంద్ పేర్కొనడం వెలుగువైపు ఎలా పయనించాలో ఏమని ఆలోచించాలో విశదీకరిస్తోంది.
నోటితో చెప్తే చెవులు వింటాయి. హృదయంతో చెప్తే హృదయం వింటుంది. కానీ ఆత్మసాక్షిగా చెప్తే ఏకత్వమే మిగులుతుందనే సిరివెన్నెల భాష్యాన్ని సిలికానాంధ్ర రజతోత్సవం ఎలా నిజం చేసిందనే సంఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. వేడుకలు జరిగిన ఓక్‌ల్యాండ్ ఎరీనా పార్కింగ్ బిల్లు $50వేల డాలర్లు(₹45లక్షలు) కాగా అమెరికన్ జాతీయురాలైన ఆ సంబంధిత విభాగ మేనేజర్‌తో జరిగే కార్యక్రమాల వైశిష్ఠ్యాన్ని, ఎందుకు చేస్తున్నమనే అంతరార్థాన్ని వివరించగా ఆ $50వేల డాలర్లను ఎరీనా రాయితీగా ఇచ్చిందని వెల్లడించి మాటకున్న విలువ ఎంత గొప్పదో చాటారు. మనస్సును తాకే మాటలతో ఆలోచన సైతం లొంగుతుందని నిరూపించారు. ఈ రజతోత్సవ వేడుకల్లో సాంకేతికత మొత్తాన్ని నడిపిన శ్వేతజాతీయులందరినీ ఆయన పేరుపేరునా గుర్తుచేసుకుని అభినందించారు. ఏరు దాటాక తెప్ప తగలెట్టేవారి మనోచీకటిని కాల్చడానికి ఈ ఉదాహరణే ఒక కాకడ హారతి.
కేవలం తెలుగుకు భారతీయతకు పట్టం కట్టాలని తాను అమెరికాలో 2001లో నాటిన విత్తనం నేడు ఖండాంతరాలలో శాఖోపశాఖలుగా విస్తరించి మన సంస్కృతి సాంప్రదాయల ఫలాలను భవిష్యత్ తరాల వారికి పుష్కళంగా ఇవ్వగలగడం తనకు సంతృప్తినిచ్చిందంటూనే సంస్థను ముందుకు తీసుకువెళ్లగలిగే తదుపరి నాయకత్వం గురించి కూడా ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు. సిలికానాంధ్ర సంస్థలో బాధ్యతలే తప్ప హక్కులు ఉండవని ఆయన ఖరాఖండీగా కుండబద్ధలు కొట్టారు. తాను స్థాపించినది కాబట్టి తనకు ప్రేమ ఉంటుంది కాబట్టే విజయాలు-పొగడ్తలకు అర్ఘ్యం ఇచ్చి విమర్శలు-అపవాదులను ఆచమనం చేశానని పేర్కొన్నారు. ఇది కేవలం బాధ్యతగా భావించి చేశానని తెలిపారు. బాధ్యత తీసుకున్నవాడే నాయకుడు కాగలుగుతాడని స్పష్టం చేశారు. అత్యంత కష్టతరమైన ఈ ఆలోచనా తీరు ఉన్నవారు ఎవరితోనైన తాను కలిసి పనిచేయడానికి సిద్ధమని, పక్కన నిలబడి తర్ఫీదు కూడా ఇస్తానని ప్రకటించారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న దాగుంది. తెర మీద కనిపించే చలనచిత్రంలో వచ్చే పాటకు తెర ముందు ఉన్న గాయకుల వస్త్ర రంగు ఎలా ఉండాలనే దాని నుండి, "దక్షయజ్ఞం"లో సతీదేవి రథంగా నిజమైన గుర్రపుబగ్గీని తీసుకురావడం, దాని రథసారధిగా వచ్చిన అమెరికన్ జాతీయుడిని కూడా సాంప్రదాయ భారతీయ నగలతో అలంకరించడం, దేశం కోసం చేస్తున్నామనే తెలియజెప్పేందుకు దేశరంగులనే అతిథుల భూజాలపైన కప్పి గౌరవించడం వరకు...చిన్న చిన్న విషయాలపై కూడా అతిసూక్ష్మ శ్రద్ధాసక్తులు పెట్టి చేసే కర్మసిద్ధాంతపరులు అప్పుడు కూడా ఉంటారా అనే ప్రశ్నకు "జగమంత కుటుంబం సిలికానాంధ్ర" అనే ఆలోచనే సమాధానం!!
తెలుగు భాష కొలనులో వికసించిన కార్యకర్తలనే తామరపూల నడుమ సిలికానాంధ్ర పడవపై తిరుగుతున్న బందరోడు-అందరోడు కూచిభొట్ల ఆనంద్..ఒడ్డున నిలబడి నింగిలో తారలు చూస్తున్న భావితరాలకు తారలు కాదు తామరలు చూడాలని కొలనులో దిగి కేరింతలు కొట్టాలని కోరుతున్నారు. తాను పడవ దిగి వెళ్లిపోయినా కొలనులో తామరలు అనుసంధానమై ఉంటాయని ఆయనకీ తెలుసు. కాకపోతే మరో నావికుడు, మరో చోదకుడు, మరో శ్రామికుడు, మరో భాషాప్రేమికుడు. అంతే! సిలికానాంధ్ర అనే తెలుగు సాహితీ సాంస్కృతిక సాంప్రదాయ మల్లె లతల స్ఫూర్తి సుగంధాలను దిగంతాలకు వ్యాప్తిచేసేందుకు గడిచిన రెండు దశాబ్దాలుగా వాటిపై నుండి మలయమారుతంగా వీస్తున్న మా అక్షరాలు కూడా శతమానోత్సవం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి!
Attendees: Padmabhushan Sudha Raghunathan, Gummadi Gopalakrishna et al.
---సుందరసుందరి
(sundarasundari@aol.com)





















