కవి కుల దళాధిపతి - కవి దళ కులాధిపతి - TNI ప్రత్యేకం

🕑 Published: August 15, 2026 at 05:29 PM CST

అక్షరాల అర్థాలు, అంతరార్థాలు నిఘంటువుల్లో ఉండవు. ఉపాసనలో, ఔపోసనలో ఉంటాయి. వేటూరి సుందరరామమూర్తి తెలుగు భాష పూర్వోత్తరాలను ఔపోసన పట్టిన అక్షరోపాసకులు. కావేరీ తీరాన సంగీతం, గోదారి తీరాన సాహిత్యం ఉంటాయని నానుడి. సంగీతం-సాహిత్యం కలగలిసిన కృష్ణా తీరాన శబ్దోపాసకుల కుటుంబంలో జన్మించిన వేటూరి భావ సంపద, భాషా పాటవం కలగలిసిన తన సంగీత-సాహిత్య ప్రతిభా వరదల్లో ప్రేక్షకుల హృదయాలను ముంచెత్తారు. "అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే...కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే...ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను" అంటూనే పాటల రచనలో పుంభావ సరస్వతిగా విశ్వరూపం ప్రదర్శించారు. పాట నిర్మాణ వేగాన్ని, ఆలాపన రాగాన్ని, శ్రోతల యోగాన్ని, దర్శకనిర్మాతల భోగాన్ని ఉమ్మడిగా మూడున్నర దశాబ్దాల పాటు ఓలలాడించారు. "భారతనారీ చరిత" వర్ణనతో మొదలైన ఆయన పాటల ప్రయాణం సరికొత్త చరిత్ర లిఖించి "మధుర కథాభరితంగా" సాగిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

సినిమా పాట పరిమితులకి సాగర గంభీరత్వాన్ని అలంకరించి పాటల రచనపై లోతైన విశ్లేషణ చేసిన ఆయన కవి అడవిలో మృగరాజు అయితే సినీకవి బోనులో మృగరాజు అంటూ చమక్కులు విసిరినా.. పాటకు హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత బావమరిది నాలుగు ప్రధాన ప్రతిబంధకాలని సత్యవాక్కులు సెలవిచ్చారు. పాటలు ఎవరైనా రాయవచ్చు కానీ అవి ఎవరిపై చిత్రీకరిస్తున్నారు, ఎవరు అభినయిస్తున్నారనేది చాలా ముఖ్యమనేది ఆయన వాదన. పాటలో రెండే రసాలు. కరుణ, విషాదం. ప్రేమ కరుణ కిందకి వస్తుంది. విషాదంలో వేదాంతం, తత్త్వం వస్తాయని కుండబద్ధలు కొట్టారు. వేటూరి ప్రౌఢత్వాన్ని గుర్తించిన వారు ఒకవైపు అయితే ఆయనను బూతుకవిగా వెలకట్టినవారికి ఒకసారి గోదాట్లోకి దిగిన తర్వాత అన్నీ రాయాలి, లేదంటే చేతగానివాడనుకుంటారన్న ఆయన సమాధానం చెంపపెట్టు వంటిది. అందుకే ఆయన వామనవాతరం ఎత్తి తెలుగు పాటను అటు ఆకాశం దాటించారు. ఇటు పాతాళం లోతుల్లోకి చొప్పించారు. క్లాసికులు, మాసికులు, రసికులు..అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిపారు. సినిమా వంటి వాణిజ్య ప్రాధాన్య రంగంలోకి వచ్చాక స్వీయ అభిప్రాయలకు తిలోదకాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆత్మాభిమానం నిలబెట్టుకుంటూనే అద్భుత పాటలు సృష్టించవచ్చునని ఆయన నిరూపించారు. పాట రాసినవాడికి, చేసినవాడికి, పాడినవాడికి, వినేవాడికి ఆత్మసంతృప్తి కలగాలి. అందరికీ మనశ్శాంతి కలగాలి. మంచి పాట వింటే రోగాలు నయం కావాలనే ఆయన సదాశయానికి ఆయనకన్నా ఎత్తుపీట వేసినవారు లేరనేది వాస్తవం. రచయిత సంగీత దర్శకుడికి, సంగీతానికి, గాయకుడికి మాత్రమే కాదు తెరమీద కనిపించే ప్రతివిషయానికి అనుసంధానకర్త అని పదాలతో అర్థవంతమైన శబ్దసేతువులు నిర్మించి జనరంజకంగా రక్తికట్టించేవాడే నిజమైన రచయితని ఆయన మార్గనిర్దేశం చేశారు.

2002 ఇండియాటుడేలో ఉటంకించిన కథనం ప్రకారం వేటూరి 1956లో "ఆంధ్రప్రభ"లో 100 రూపాయిల అప్రెంటిస్‌గా జేరి 11ఏళ్ల అనతికాలంలోనే 1967లో 30 ఏళ్ల వయస్సులో "ఆంధ్రజనత"కు ఎడిటర్ అయ్యారు. 1962లో శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ఆవిష్కరణకు వచ్చిన నెహ్రూని ఇంటర్వ్యూ చేసే అరుదైన అవకాశం సంపాదించారు. 1974లో తొలి పాట రాసిన వేటూరి 2002 ఇండియాటుడే కథనం వచ్చేనాటికే 8000 పాటలు వ్రాశారు. శంకరుణ్ణి "అవధరించమని" వినమ్రంగా శాసించిన వేటూరి 2004లో తన 68వ ఏట "వంగతోట మలుపుకాడ" తిరిగి "ఆహాపురం మీదుగా అమలాపురం" వెళ్లి "కన్నెమనస్సును గిల్లొద్దని మన్మథరాజును" వేడుకొని మాస్ శ్రోతలను తోడ్కొని "యమునాతీరంలో" సేద తీరుతున్న క్లాస్ ప్రేక్షకుల వద్దకు చేర్చారు. తనకు తానే పోటీ అంటూ 72వ ఏట "వయస్సునామీ" సైతం సృష్టించి ఆహుతుల వయోతీరాలను మనోభారాలను అతలాకుతలం చేశారు.

వేటూరి పెదనాన్న ప్రభాకరశాస్త్రి "కవిసమ్రాట్" విశ్వనాథ సహాధ్యాయులు. అందుకే తాను విశ్వనాథ వారితో చనువుగా ఉండేవాడినని ఎన్నో విషయాల పట్ల విశ్వనాథ అవలీల సంభాషణా శక్తికి ముగ్ధుడినయ్యానని వేటూరి అనేవారు. తనకు మల్లాది రామకృష్ణశాస్త్రి, పింగళి నాగేంద్రరావు, ఆచార్య ఆత్రేయ గురువులని సగర్వంగా ప్రకటించుకున్న నిగర్వి ఆయన. 32 కలం పేర్లతో రచనలు చేసిన వేటూరి పలు ప్రైవేట్ ఆల్బమ్‌లకు సైతం నిర్మాతగా వ్యవహరించారు. కేవలం సాహితీవేత్తగానే గాక సంగీతంపై కూడా మంచి పట్టు కలిగిన బహుముఖప్రజ్ఞాశాలిగా వినుతికెక్కారు.

"నీ మిత్రుల గురించి చెప్పు నువ్వు ఎవరో చెప్తాను. నీ గురువులు ఎవరో చెప్పు నీ శక్తి చెప్తాను." పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్న భీష్ముడు ధర్మక్షేత్రంలో కృష్ణుడు చేత ఆయుధం పట్టించాడు. ద్రోణాచార్యుల వద్ద విద్యనభ్యసించిన సవ్యసాచి సంగ్రామంలో విజయపతాకం ఎగరేశాడు. కానీ "వేయిపడగల" విశ్వనాథ నీడలో శిష్యరికం చేసిన వేటూరికి అప్పుడెప్పుడో 1993లో "మాతృదేవోభవ"లో గీతానికి ఒక జాతీయ పురస్కారం ఇచ్చారు. ఒకే ఒక్కఠీ! పద్మాలు, భూషణాలు, రత్నాల జాడే లేదు. తెలుగు సినీపాటకు కావ్యగౌరవమే కాదు నంది గౌరవానికి నాంది కూడా వేటూరే. 1977లో "పంతులమ్మ" చిత్రంలోని "మానసవీణా మధుగీతం" పాటకు వేటూరి అందుకున్న నంది మొదటిది. ప్రభుత్వం సినీపాటకు నంది ఇవ్వడం కూడా అదే మొదటిది. అయినా ఆయన వ్రాసిన వేల కొలది అద్భుతమైన పాటలకు మరో జాతీయ పురస్కారం రాకపోవడానికి అడ్డంకులు ఏమిటి? కారణాలు ఏమిటి? అంటే ఇప్పుడు వేటూరికి ప్రతిభ లేదా? ఆయన వ్రాసిన పాటలకు అర్హత లేదా? లేక విశ్వనాథ, పింగళి, మల్లాది, ఆత్రేయ గురుతుల్యులు కాదా? అవార్డులే ప్రతిభకు కొలమానమైతే ఆ అవార్డులు సుందరయ్య కలాన్ని చూసి చిందరవ్వాలి. తమకు సార్థకత రాలేదని తలదించుకోవాలి. అవి చేరలేని తీరం వేటూరి. ఒకవేళ చేరినా అవి మోయలేని భారం వేటూరి. దీపానికి వత్తి పెట్టాలి, నూనె పోయాలి, బొట్టు పెట్టాలి, అగ్గిపుల్ల గీయాలి, వెలిగించాలి, దణ్ణం పెట్టాలి. కానీ సూర్యుడికి...?

వేటూరికి స్వదేశంలో సో కాల్డ్ పెద్ద పేద్ధ పురస్కారాలు రాకపోయినా ఆయన వద్ద శిష్యరికం చేసి ఆయన ఇప్పించిన అవకాశాల ద్వారా సినీరంగంలో నిలదొక్కుకున్న ఆయన శిష్యుడికి పరాయి దేశంలో ప్రఖ్యాత ఆస్కార్ వచ్చింది. ఆ ఆస్కార్ అందుకున్న శిష్యుడి నీడలోనే దర్శకధీరులు సైతం ఎదిగారు. ఇక ఆయన చేతుల మీదుగా తెలుగులో తన తొలి సినిమాకు సింగిల్ కార్డు వ్రాయించుకున్న మరో తమిళ సంగీత దర్శకుడికి సైతం ఇదే ఆస్కార్ అందింది. పునరుక్తిదోషం పట్టని ఆయన పాటలపై పరిశోధనలు చేసి పీహెచ్‌డీలు సంపాదించారంటే వ్యాసపీఠంపై ఆయన అధిరోహణ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే వేటూరిని ఆప్యాయంగా అందరూ గురువుగారు అనేది. ఆయన కింగ్ మేకర్. రాక రాక తనకు వచ్చిన ఆ ఒక్క జాతీయ అవార్డుకు కూడా 2006లో దడపుట్టించారాయన! తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వకపోతే జాతీయ పురస్కారాన్ని త్యజించడానికి సైతం వెనుకాడని ఆత్మాభిమానుడు మన వేటూరి సుందరరామమూర్తి. మన వీధులకు మనవారి పేర్లు పెట్టుకోవాలని, పరాయిభాష వ్యామోహపు జడత్వాన్ని వదిలితే గానీ తెలుగు మాధుర్యం అర్థం కాదని ఆక్షేపించడానికి వెనుకాడని భాషాప్రేమికుడు ఆయన. 1942లో పాటలు పాడటం ప్రారంభించిన లతా మంగేష్కర్‌కు 27ఏళ్ల అనంతరం 1969లో పద్మభూషణ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. గత నెలలో స్వర్గస్థురాలైన ప్రముఖ తెలుగు గాయనీమణి ఎస్.జానకి 1957లో కెరీర్ ప్రారంభించాక 2013లో అంటే 56ఏళ్లకు పద్మ పురస్కారం ప్రకటిస్తే దాన్ని సగర్వంగా తృణీకరించి తన స్థాయి అభిమానుల హృదయాల్లోనేనని చాటిచెప్పిన ధీశాలి ఆమె. వీరిరువురిని ఆదర్శంగా తీసుకుని అయినా తెలుగువారికి సముచిత గౌరవం కల్పించాలన్న గొంతుక బలపడాలి. అప్పుడే వారికి నిజమైన నివాళి.

"ఆకాశ దేశాన, దిక్కరీంద్ర జిత హిమగిరీంద్ర సితకందరా నీలకంధరా, శిలవే అయితే పగిలిపో శివుడే అయితే రగిలిపో, గేయాలుగా మారే గీతాలు ఎన్నున్నా గాయాలు మాన్పేటి గానాలు మిన్నా, బ్రతుకంటే మృతికంటే చేదైన ఒక తీపి పాట, మృతిలో తలదాచుకున్న బ్రతుకు శృతిలో కలిపింది నిన్ను జతకు, ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా, కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుస్సు కన్నుల్లో మెరిసింది కన్నె సీతామనస్సు, జీవితమే ఒక ఆట సాహసమే పూబాట, నీ కందకు దురదైతే నా చేమకు సరదారా, కఠినమయినది ధర్మం కన్ను లేనిది న్యాయం మనసు లేనిది చట్టం మనిషి జన్మకిది ఖర్మం, ఆ దేవుడి పాపాలే లోకానికి పుణ్యమా ఆ దేవుడి బొమ్మను నే చేస్తే నేరమా, కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవ ఆయిన ద్రౌపది ఆక్రందనలో, రూప్ తేరా మస్తానా నీకు డేరా వస్తానా, హే చికితా కొమొస్తాస్, అడీస్ అబబ్బా అల్లం మురబ్బా, కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య, రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా, అందం హిందోళం అధరం తాంబూలం, స్వరరాగ గంగా ప్రవహమే, ఇదుగో తెల్లచీర అవిగో మల్లెపూలు, మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం, తస్సదియ్యా బీటు మీద అశ్శర్రభ్భా అంటుంటే చూసినోళ్లు అందరికీ శుభం కార్డు పడ్డట్టే, నడక కలిసిన నవరాత్రి సిగ్గు పడితే శివరాత్రి, అబ్బనీ తీయనీ దెబ్బ, జగతి సిగలో జాబిలమ్మకు వందనం, ఉరికే చిలకా నేడు కన్నీట తేనె కలిసె, మతమేల గతమేల మనసున్ననాడు హితమేదో తెలియాలి మనిషైనవాడు, కన్నీట కడగాలి కులమన్న పాపం మన రక్త సింధూర వర్ణాలు అరుణం గాయాల నీ తల్లికీ, రాజువయ్య మహరాజువయ్యా, చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కొట్టు కొట్టు కోకోనట్టు కట్టు కట్టు చీరకట్టు పావడాల పానిపట్టు ప్రాయసాల తేనేపట్టు, ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే..ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో, పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెన, ప్రతి నదికి మలుపులు తధ్యం బ్రతుకుల్లో బాధలు నిత్యం ఎద గాయం మాన్పును కాలం, స్నానానికి వేణ్ణీలవుతా అవి కాచే మంటనవుతా హృదయంలో నిన్నే నిలిపాలే నిదురించే కంట్లో నేనే పాపల్లే మేలుకుంటా కలలోనే గస్తీ కాస్తాలే, ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు రానప్పుడు, వరముల చిలకా స్వరముల చిలకా కరమున చిలుక కలదానా హిమగిరి చిలకా శివగిరి చిలకా మమతలు చిలుకా దిగి రావా, ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి, మైనా క్షణమైనా పలికిందే భాష ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ విధిరాత కన్నా లేదు వింత పాట, ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, అచ్చా అచ్చా వచ్చా వచ్చా, భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా, శ్రీ తుంబుర నారద నాదామృతం, గోరువంక వాలగానే గోపురానికి, శశివదనే శశివదనే, కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి పిచ్చండి నమ్మండి" ...ఇదంతా వేటూరేనండి!

ఉత్తమ గురువు ప్రశ్నించాలి. ప్రతిభావంతుడైన శిష్యుడు ఆ ప్రశ్నలకు దీటైన సమాధానం ఇవ్వాలి. అందుకే "జీవనతరంగాల్లో" ఆత్రేయ ప్రశ్న "నవమాసాలు మోసెదొకరు నీతో కలిసి నడిచేదొకరు కాటికి నిన్ను మోసేదొకరు ఆపై నీతో నడిచేదెవ్వరుకు" ఆయన శిష్యుడైన వేటూరి అదే స్థాయిలో తిరుగుటపా పంపుతూ "నాటకాల జగతిలో జాతకాల జావళి కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలీ" అన్నారు. దేవుడి గురించి అన్నమయ్య చెప్పారు. మరి అన్నమయ్య గురించి ఎవరు చెప్తారనే ప్రశ్నకు కూడా వేటూరి కలమే "తెలుగుపదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపథం" అంటూ సమాధనం చెప్పింది.

అబ్బే!!! ఆయన మాటల్లో శబ్దం-అందం-ఛందం-ద్వంద్వం తప్ప ఆయన సమకాలీకుల మాదిరి ప్రశ్నల వారధిపై సరళమైన పాట ఉండదనే విమర్శలకు స్పందనగా తానూ అత్యంత సరళంగా ప్రశ్నిస్తానని కాకపోతే అలా ప్రశ్నిస్తే కుర్రకారు కర్చీఫులు, కాంతామణి కొంగుచివర్లు, కన్నీళ్లు కూడా తడిసిముద్దవుతాయని "రాలిపోయే పువ్వు" అతి సుకుమారంగా రాగాలూదుతూ నిరూపించింది. ఎక్కడైనా ఒక నిర్మాణ సంస్థకు, దర్శకుడికి, హీరోకి వ్యక్తిగత రచయితలు ఉండటం సహజం. కానీ తాతల నుండి మనవళ్ల వరకు, బాబాయిల నుండి అబ్బాయిల వరకు, మావయ్యల నుండి అల్లుళ్ల వరకు ఆయన పాట పాడని నటులు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆయన మనందరి వంశపారంపర్య ఆస్తి. తెలుగువారికే సొంతమైన ప్రశస్తి. మీటరుకు సరిపోకుండా ఒక్క అక్షరం ఉండని వేటూరి పాట లేని తమ సినిమాలు ఎప్పుడూ ఒక మీటరు కిందకే ఉంటాయని దర్శకులు స్వయంగా ప్రకటించుకున్నారంటే ఆయన లేని లోటు అవగతమవుతుంది. జానర్ ఏదైనా, బ్యానర్ ఏదైనా నవీన సృజనాత్మక సాహిత్యానికి మూలవిరాట్టు వేటూరి. అలతి అలతి పదాలతో నవరసాల వెలితి తీర్చిన రసపిపాసి వేటూరి.

అర్థం కావడం వేరు. అనుభూతికి రావడం వేరు. రెండింటికీ మధ్య అక్షరం అనే ఆయుధం ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. మేథస్సు కృత్రిమం అయిపోయి, మానవత్వం మరుగునపడిపోయి, మనిషి-మనస్సు-మమతానురాగాలు మాయమైపోయి, మాట మౌనమైపోయి రేపటి మీద దిగులుతో నేటి ఇరుసందెల నడుమ గుబులు మొదలైనప్పుడు బదులుగా వినపడే ఓంకారనాదం..వేటూరి పాట. అనుభూతిని అర్థానికి దగ్గర చేసే అక్షరాలు మూట. తెలుగు అక్షరమాల, వ్యాకరణం, కనీస మౌలిక సూత్రాలు ఒంటబట్టని నా లాంటి ఆంగ్ల మాధ్యమ ఉత్పత్తులైన వారెందరికో తెలుగు భాష పట్ల జిజ్ఞాస జ్వలింపజేసిన వేటూరి మనం జీవితంలో ఏమి సాధించామనే అనుమానం వచ్చినప్పుడల్లా "ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకు లాగ పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా" అని సాంత్వన ఇస్తూనే కోరుకున్నవన్నీ "చేరువైనా దూరమైనా ఆనందమేగా మహదానందమేగా పరమానందమేగా" అంటూ పాడుకోమని జీవనవేదాన్ని అందించారు. ఖండాలు దాటి ప్రవాసం వెళ్లిన వారందరికీ "నల్లనివన్నీ నీళ్లని తెల్లనివన్నీ పాలని" అనుకోవద్దంటూ "సూర్యూడల్లే సూదిగుచ్చి సుప్రభాతంలా" వినపడుతోన్న వేటూరి పాట నేడు పుస్తకాల రూపంలో పట్టు పరికిణి కట్టుకుని అమెరికాలో "తకిట తథిమి తకిట తథిమి తంధానా" ఆడటానికి సిద్ధమైన సందర్భంగా హర్షాతిరేకాలు మిన్నంటుతున్నాయి.

ఆయనలా రాయాలనుకునే కవికుల ఆలోచనకు నాయకుడు, ఆ ఆలోచన సృష్టించే కవిదళ అక్షరానికి చోదకుడు - సుందరరాముడు. అందుకే ఆయన కవి కుల దళాధిపతి - కవి దళ కులాధిపతి. కాలాన్ని దాటిన ఆయన కలం కలకాలం రంజింపజేసే అద్భుత పాటలను అందించింది. నేడు వేటూరి సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో వేటూరి సమగ్ర సాహితీ సంకలనం విడుదల తెలుగు సాహితీ ప్రియులకు ఒక పండుగ రోజు. వేటూరి పాళీవైభవాన్ని ఒకే చోట చేర్చి ఆయన కథను ముందు తరాల వారికి అందించే ఈ ప్రయత్నం అభినందనీయం. తరాలు దాటిన సుందరరామమూర్తి కథ కూడా క్షణాలదే కదా! "వేణువై వచ్చి గాలినైపోయినా..గతించిపోని గాథ" వేటూరి. మూడు అక్షరాలు, ఆరుకాలాలు, వందేళ్లు. స్మరామి స్మరామి స్మరామీ. నమామి నమామి నమామీ!

---సుందరసుందరి(sundarasundari@aol.com)

(ఆగష్టు 16 ఆదివారం నాడు "యమహానగరి" డల్లాస్‌లో వేటూరి సాహిత్యాభిమాన సమితి ఆఫ్ అమెరికా మరియు శుభం ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేటూరి సుందరరామమూర్తి సాహితీ మహోత్సవంలో జొన్నవిత్తుల చేతుల మీదుగా వేటూరి సమగ్ర సాహితీ సంకలనం విడుదల సందర్భంగా)

📲 Join Our WhatsApp Channel
15వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న శోభారెడ్డి-ప్రసాద్‌రెడ్డిబర్డ్ ఆసుపత్రి డైరక్టర్ డా. గుడారు జగదీశ్‌కు టీటీడీ సన్మానంఫిలడెల్ఫియాలో రాజేంద్రప్రసాద్‌కు సన్మానంగుండ్లకమ్మ నదీమ తల్లి ఒడ్డున యాత్రకు శ్రీకారంరాష్ట్రపతి నుండి సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న గుమ్మడిహాంకాంగ్‌లో 27వ కార్గిల్ విజయదివస్సింగపూర్‌లో TCSS ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతరParis-France: ఐఫిల్ టవర్ వద్ద ఎన్నారై తెదేపా సమావేశంమలేషియాలో ఘనంగా MYTA బోనాలుCalifornia: AHUB Global Presents Its Vision To Bhattiబే-ఏరియా ప్రవాసులను నిరాశపరిచిన భట్టిRecap: తెలుగు వైభవానికి పట్టం కట్టిన ఆటా 19వ మహాసభలుఆలోచనే సిలికానాంధ్ర ఆయుధం - TNI ప్రత్యేకంTCSS సింగపూర్ అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్తమిషిగన్‌లో రుక్మిణి కల్యాణం2029లో టీడీపీ విజయమే లక్ష్యం-జర్మనీ ఎన్నారై తెదేపాఎస్.జానకికి డల్లాస్ అభిమానుల సంగీత నివాళిన్యూజెర్సీలో పర్యటించిన తెభాజపా అధ్యక్షుడు రామచందర్‌రావుసిలికానాంధ్ర సిగలో మరో మూడు గిన్నీస్ రికార్డులుహైదరాబాద్‌లో ₹20 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ భవన్-ఆటా వేడుకల్లో మంత్రి జూపల్లి
Previous Article Next Article