🕑 Published: October 24, 2026 at 06:50 PM CST
* అయ్యప్పలకు అమెరికన్ బాస్‌ల సంపూర్ణ మద్దతు
* స్వాములకు కార్యాలయాల్లో ప్రత్యేక వెసులుబాటు
* దీక్షలో ఉంటే రిమోట్‌గా పనిచేసే సౌలభ్యం
* అమెరికావ్యాప్తంగా 5వేలకు పైగా దీక్షాధారులు
* తీవ్రమైన వాతావరణంలో సైతం నిష్ఠగా పూజాధికాలు
* మేరీల్యాండ్, ఫ్లోరిడా ఆలయాల్లో 18 మెట్ల ఏర్పాటు
"హరివరాసనం...అరుణభాసురం...స్వామియే శరణం అయ్యప్ప" మంత్రం ఇప్పుడు అమెరికాలో కూడా గట్టిగా ధ్వనిస్తోంది. ఆ దేశంలోని ప్రవాస భారతీయులు తమ మూలాలు, ఆచారాలు మరిచిపోకుండా అమెరికా సంస్కృతి-సాంప్రదాయల నడుమ కఠినమైన అయ్యప్ప మాల దీక్షను నిష్ఠగా ఆచరిస్తున్నారు. 40రోజుల పాటు సాగే ఈ దీక్షను ప్రస్తుతం అమెరికావ్యాప్తంగా సుమారు 5000 మంది చేపట్టారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్ వంటి సాధారణ వాతావరణ రాష్ట్రాలతో పాటు న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, మేరీల్యాండ్, పెన్సిల్వేనియా వంటి మైనస్ డిగ్రీల చలి ఉండే రాష్ట్రాల్లో సైతం తీవ్రమైన వాతావరణాన్ని తట్టుకుంటూ అయ్యప్ప సేవలో ప్రవాసులు తరిస్తున్నారు.
నవంబరు 15 నుండి జనవరి 15 మధ్య అయ్యప్ప దీక్షాధారణకు ప్రవాసులు నడుం బిగిస్తారు. 90శాతం అయ్యప్పలు ఐటీ రంగానికి చెందినవారు ఉంటుండగా మిగిలిన శాతంలో వ్యాపారవేత్తలు, లాయర్లు, వైద్యులు, విద్యార్థులు, వృద్ధులు, చిన్నారులతో పాటు మహిళలు కూడా ఉంటున్నారు. ప్రతి రోజు చన్నీటి స్నానాలు, చెప్పులు లేకుండా నడవడం, నేలపై నిద్ర, బేస్మెంట్లలో పూజాగదులు, భజనలు వంటి వాటితో అయ్యప్పలు భారతదేశంలో కన్నా మిన్నగా పరాయిగడ్డపై భక్తి తత్పరతను ప్రదర్శిస్తున్నారు.
మేరీల్యాండ్‌లోని శివవిష్ణు ఆలయం, ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా అయ్యప్ప ఆలయాల్లో అయ్యప్పలు పెద్దసంఖ్యలో తమ దీక్షలు విరమిస్తున్నారు. మేరీల్యాండ్‌కు కెనడా నుండి కూడా అయ్యప్పలు వస్తున్నారు. ఈ రెండు ఆలయాల్లో శబరిమల తరహాలో 18మెట్లు నిర్మించడం ఇంతమంది భక్తులు రావడానికి కారణం అవుతోంది. అయ్యప్పల సీజన్లో ప్రతి వారాంతం సగటున 250మంది అయ్యప్పలు ఇరుముడికి ఈ ఆలయాలకు వస్తున్నారు. అమెరికా నలుమూలల నుండి దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు ప్రత్యేక బస్సుల్లో తమకు సమీపంలోని ఆయా ఆలయాలకు వచ్చి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 18మెట్లు ఎక్కి అయ్యప్ప దీక్ష విరమిస్తున్నారు. కొన్ని ప్రవాస బృందాలు ఇండియాలో ఇరుముడి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని శబరిమల వెళ్లి దీక్ష విరమిస్తున్నారు. వీరి సంఖ్య అమెరికాలో దీక్ష విరమించే వారితో పోలిస్తే చాలా తక్కువ.
* బాస్‌ల ఆశ్చర్యం...ఆపై ప్రోత్సాహం
అమెరికాలోని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో సూటు, బూటు, టై వంటి "డ్రస్ కోడ్" తప్పనిసరి. దీక్షలో ఉన్నప్పటికీ కార్యాలయానికి బూట్లతో వచ్చి తమ సీటు వద్ద వాటిని విడిచి ఉద్యోగం చేసి సాయంకాలం మళ్లీ వాటిని వేసుకుని వెళ్లేవారు కొందరైతే అసలు తీవ్రమైన చలిలో సైతం బూట్లు లేకుండా వచ్చేవారు మరికొందరు ఉంటున్నారు. నల్లటి కాటన్ దుస్తులు ధరించి, చెప్పులు లేకుండా, గడ్డం పెంచుకుని ఆఫీసులకి వెళ్లే ఉద్యోగుల మనోధైర్యాన్ని, ఆచారాల పట్ల వారికున్న మక్కువ, పట్టుదలను చూసి అమెరికన్ బాస్‌లు ఆశ్చర్యపడుతున్నప్పటికీ వారి మతవిశ్వసాలను గౌరవిస్తూ దీక్షలో ఉన్న అయ్యప్పలకు కావల్సిన వెసులుబాట్లు, అనుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. వర్జీనియా ప్రాంతంలోని ఫ్యానీమే, ఫ్రెడ్డిమాక్ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో పనిచేస్తున్న ప్రవాసులకు దీక్షలో ఉన్నంత కాలం రిమోట్‌గా పనిచేసే ప్రత్యేక సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
* శ్రీధర్ నూలి, వ్యాపారవేత్త, వర్జీనియా(హైదరాబాద్)
గత పాతికేళ్లుగా అమెరికాలో ఐటీ, హోటళ్ల రంగంలో వ్యాపారం చేస్తున్నాను. నా వద్ద పనిచేసే ఉద్యోగులు అందరికీ ఏ విధమైన ఆంక్షలు విధించకుండా హైందవ సాంప్రదాయాన్ని గౌరవించే కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాను. 1996లో తొలిసారిగా ఇండియాలో అయ్యప్ప దీక్ష తీసుకున్నాను. 1999లో అమెరికా వచ్చినప్పటికీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను. దీక్షలోని కఠిన నియమాలను తప్పకుండా పాటిస్తున్నాను. అమెరికాలో దీక్ష తీసుకున్నప్పటికీ ప్రతి ఏటా హైదరాబాద్‌లో ఇరుముడి కార్యక్రమం నిర్వహించి శబరిమల వెళ్లి దీక్ష విరమిస్తున్నాను. దైవత్వాన్ని ప్రచారం చేయడం, క్రమశిక్షణను పెంచుకోవడం, సంకల్ప శక్తిని అదుపులో ఉంచుకునేందుకు అయ్యప్ప దీక్ష తోడ్పడుతుంది. కొన్ని సార్లు కాస్కో వంటి ప్రధాన దుకాణాల్లో పాదరక్షలు తప్పనిసరి చేసినప్పుడు మా స్నేహితులతో ఆయా దుకాణాల నుండి కావల్సిన సామాగ్రి తెప్పించుకుంటాము. కార్యాలయాలకు వెళ్లే స్వాములు కొందరు ఎవరి కంట పడకుండా ఉండేందుకు తెల్లవారుజామునే వెళ్లి మధ్యాహ్నానికి వచ్చేస్తుంటారు. భోజనం కూడా ఇంటి నుండే తీసుకుని వెళ్లి, భోజన విరామ సమయంలో ఏకాంతంగా స్వామిధ్యానంలో డెస్క్ వద్దే భోజనం చేస్తారు. కొందరు పాకిస్థానీ మిత్రులు ప్రతి ఏటా మా అయ్యప్ప దీక్ష ఎలా జరిగిందని ఆసక్తిగా వాకబు చేస్తుంటారు.
* భాస్కర్ రావూరి, ఐటీ ఉద్యోగి, వర్జీనియా(తూర్పుగోదావరి జిల్లా)
2018లో మొదటిసారి నేను ఇండియాలో అయ్యప్ప మాల వేసుకున్నాను. ఇండియాలో ఏడు సార్లు దీక్ష తీసుకున్నాను. ఎల్1 వీసాపై అమెజాన్‌కు పనిచేసేందుకు అమెరికాకు వచ్చాక తొలిసారిగా ఇక్కడ మాల వేసుకున్నాను. చెప్పులు కూడా లేకుండా నా వేషధారణ చూసిన మా అమెరికన్ బాస్ తొలుత ఆశ్చర్యపడినప్పటికీ నా పట్టుదల చూసి నన్ను ప్రోత్సహించింది. 20మైళ్ల దూరంలోని నా కార్యాలయాన్ని మా ఇంటి దగ్గర ఉన్న శాఖకు కూడా మార్చుకునే ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. సియాటెల్ అమెజాన్‌లో నా స్నేహితులు 14 మంది అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. అమెరికాలో కంపెనీల్లో మత వివక్షకు తావు లేదు. పని ముఖ్యం. మన బాధ్యత మనం నిజాయితీగా నిర్వహిస్తే ఎవరూ ఏ విధమైన అడ్డంకులు కల్పించరనడానికి అయ్యప్ప దీక్ష తీసుకుని కార్యాలయాలకు వెళ్లేవారిని చూస్తే స్పష్టమవుతుంది.
* డా. శ్రీనివాస్ కవుటూరి, సర్జికల్ ఆంకాలజిస్ట్, మిషిగన్(కంభంపాడు-ఎన్.టీ.ఆర్ జిల్లా)
2004లో నేను అమెరికాకు వచ్చాను. 2007 నుండి గత 18ఏళ్లుగా ప్రతి ఏటా అయ్యప్ప దీక్ష తీసుకుంటూ గురుస్వామిగా వ్యవహరిస్తున్నాను. అమెరికాలో వైద్యవృత్తిలో ఉన్నవారు ఎలా ఉండాలనే దానికి చాలా కఠిన నిబంధనలు ఉంటాయి. రోగులతో ప్రతినిత్యం పనిచేయాల్సి ఉండటంతో పాదరక్షలు ధరించడం, గోళ్లు తీసుకోవడం, ఆసుపత్రి దుస్తులు ధరించడం వంటివి తప్పనిసరి. అయ్యప్ప దీక్ష సందర్భంగా మెడలో ధరించే మాలలు మాత్రం ఖచ్చితంగా ధరిస్తాను. నేను సర్జరీ చేయడానికి వెళ్లినప్పుడు మెడలోని మాలల గురించి రోగులు కుతూహలంగా ప్రశ్నలు అడుగుతుంటారు. ఆసుపత్రిలో నా పని పూర్తి అయ్యాక ఇంటికి వెళ్లి మనస్ఫూర్తిగా పూజలు, భజనల్లో పాల్గొంటాను. ఆరోగ్యం సహకరిస్తేనే దీక్షలోని కఠిన నియమాలు పాటించమని, లేనిపక్షంలో వ్యక్తిగత వెసులుబాటు తీసుకోవచ్చునని, అంతిమంగా భగవంతుడి పట్ల భక్తి ప్రధానమని గురుస్వామిగా చెప్తుంటాను. పెద్దల కన్నా కూడా ప్రవాస చిన్నారులు చాలా పట్టుదలగా అయ్యప్ప దీక్ష చేపడుతున్నారు. తల్లిదండ్రుల కన్నా ఒక మెట్టు పైనే ఉంటున్నారు.


