🕑 Published: June 04, 2026 at 07:54 AM CST
ఎన్‌ఆర్‌ఐ టీడీపీ స్కాట్లాండ్ ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం స్కాట్లాండ్‌లోని అప్ హాల్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎడిన్‌బర్గ్, అబెర్డీన్, గ్లాస్గో నగరాల నుండి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసులు హాజరై విజయవంతం చేశారు. కార్యక్రమం ప్రారంభంలో చిన్నారులు కేక్ కట్ చేసి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం పార్టీ ఆశయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్ధన్ వీడియో కాల్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ ప్రవాస తెలుగువారు పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న తిరునగరి ఫోన్ ద్వారా సమావేశంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు.
సభలో ఎన్‌ఆర్‌ఐలు కృష్ణ ప్రసాద్ పొట్లూరి, డాక్టర్ శ్రీకాంత్ లావు, రమేష్ గోల్కొండ, సురేష్ కన్నెగంటి, ప్రదీప్ వేజండ్ల, స్వాతి చిగురుపాటి తమ ప్రసంగాల ద్వారా పార్టీ బలోపేతానికి ప్రవాసుల సహకారం కొనసాగాలని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాలను వారు ప్రశంసించారు.
కార్యక్రమం ముగింపులో శ్రీమతి చైతన్య వింజం కృతజ్ఞతా ప్రసంగం చేసి, కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పాల్గొన్న వారందరికీ సంప్రదాయ తెలుగు రుచులతో కూడిన విందు ఏర్పాటు చేయగా, ప్రవాస తెలుగువారు ఆత్మీయంగా ముచ్చటించుకుంటూ కార్యక్రమాన్ని ఆనందంగా ముగించారు.
