Health

జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూల్లో కూడా క్యాన్సర్ కారకాలు

cancer-causing-agents-in-jj-shampoo-rajasthan

*** శాంపిల్స్‌ను పరీక్షించినట్లు రాజస్థాన్ డ్రగ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది.

అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్‌కు మరో షాక్ తగిలింది. ఆ సంస్థ తయారు చేసిన పౌడరే కాదు.. బేబీ షాంపూ కూడా నాణ్యత పరీక్షల్లో విఫలమైంది. రాజస్థాన్‌లో జరిపిన ఈ పరీక్షల్లో జాన్సన్ అండ్ జాన్సన్ షాంపూ భారత ప్రమాణాలను అందుకోలేకపోయింది. కొన్ని నెలల కిందటే జే అండ్ జే బేబీ పౌడర్‌లో ప్రమాదకర క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తేలిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ పరీక్షల్లో అలాంటిదేమీ లేదని తేలడంతో గత ఫిబ్రవరి నెలలోనే మళ్లీ ఈ పౌడర్ ఉత్పత్తిని సంస్థ ప్రారంభించింది. మార్చి 5న జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన రెండు బ్యాచ్‌ల నుంచి షాంపూలకు సంబంధించిన శాంపిల్స్‌ను పరీక్షించినట్లు రాజస్థాన్ డ్రగ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. అయితే ఆ షాంపూల్లో ప్రమాదకర పదార్థాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించింది. ఈ శాంపిల్స్‌లో ప్రమాదకర ఫార్మల్‌డిహైడ్ ఉన్నట్లు తేలింది. ఈ ఫార్మల్‌డిహైడ్‌ను భవన నిర్మాణ సామగ్రి తయారీలో ఉపయోగిస్తారు. అయితే ఈ ఫలితాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యంత కఠిన పరిస్థితుల్లో తమ ఉత్పత్తులకు నాణ్యత పరీక్షలు నిర్వహిస్తామని, తమ ఉత్పత్తులన్నీ పూర్తిగా సురక్షితమైనవేననీ జాన్సన్ అండ్ జాన్సన్ తెలిపింది.