Politics

మిజోరాం నుండి తొలి మహిళా అభ్యర్థిని

మిజోరాం నుండి తొలి మహిళా అభ్యర్థిని

ఈశాన్య రాష్ట్రమైన మిజోరం లోక్‌సభ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఒకే ఒక్క లోక్‌సభ స్థానం ఉంది. దానికి ఈసారి ఆరుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వారిలో 63 ఏళ్ల లాల్‌త్లమౌని ఒకరు. షెడ్యూల్డు తెగలకు కేటాయించిన ఈ నియోజకవర్గంలో ఐదుగురు పురుషులతో ఆమె పోటీపడుతున్నారు. ఏప్రిల్‌ 11న తొలిదశలోనే పోలింగ్‌ జరగనున్న ఈ స్థానంలో మొత్తం 7,84,399 మంది ఓటర్లున్నారు. మిజోరంలో పురుష ఓటర్లు 3,81,991 మంది ఉంటే, మహిళా ఓటర్లు 4,02,408 మంది ఉండటం విశేషం. అయినా మహిళలకు రాష్ట్రంలోని శాసన వ్యవస్థలో తగిన ప్రాతినిధ్యం లేదు. 2018 శాసనసభ ఎన్నికలలో 15 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిని గెలిపించాలని మిజో మహిళా సంక్షేమ సమాఖ్య విజ్ఞప్తి చేసినా, ఒక్కరూ గెలవలేదు. రాష్ట్రంలో లోక్‌సభకు పోటీపడే మొట్టమొదటి మహిళా అభ్యర్థి కావడంతో ఆమె సంతోషంతో పొంగిపోతున్నారు. దేవుడి నుంచి సందేశం అందిన తర్వాతే పోటీ చేయాలని తాను నిర్ణయించుకున్నానన్నారు. యూదులకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ నడుపుతూ ఆరుగురు మనవలు, మనవరాళ్లున్న లాల్‌త్లమౌని.. గతంలో ఒకసారి దక్షిణ అయిజోల్‌ శాసనసభ స్థానానికి కూడా పోటీపడ్డారు. అప్పట్లో ఆమెకు కేవలం 69 ఓట్లే వచ్చాయి.