WorldWonders

ఫూల్స్ డే చరిత్ర ఇది

ఫూల్స్ డే చరిత్ర ఇది

గత చరిత్రను, పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడపడానికే కొన్ని ఉత్సవాలను చేసుకుంటాం. అవే పుట్టినరోజు, పెళ్లిరోజు వంటివి.. సమాజానికి ఒక నిర్దేశ సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తుంటాం. అవే మాతృదినోత్సవం, పితృదినోత్సవం, స్నేహితుల దినోత్సవం, ప్రేమికుల దినోత్సవం.. వంటివి. ఇలాంటి కోవకు చెందిందే ఆల్ ఫూల్స్ డే కూడా..ఏప్రిల్ ఒకటిన ఎవరో ఒకరిని ఫూల్ చేస్తే ఎవరెస్ట్ ఎక్కినంతగా సంతోషిస్తుంటాం. మనకంటే పెద్దవాళ్లను ఫూల్ చేయడానికి పేటెంట్ ఉన్న రోజు ఇది. అందరినీ ఆటపట్టించడం, సరదాగా అబద్ధాలు చెప్పి ఏడిపించడం, వేళాకోళం చేయడం.. నిజమని నమ్మేస్తే.. ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ గేలిచేయడమే ఏప్రిల్ ఫస్ట్ ప్రత్యేకత. ప్రపంచమంతా సరదాగా అబద్ధాలు చెప్పుకునే పండుగ. ఆల్ ఫూల్స్ డే పేరుతో దీన్ని ప్రపంచమంతా అనేక దేశాల్లో సరదాగా జరుపుకొంటారు. ఎన్నో ఏళ్లుగా ఏప్రిల్ ఒకటిన ఫూల్స్ డేను జరుపుకుంటున్నా ఇప్పటికీ అతికినట్టు చెప్పే అబద్ధాల్ని అనుకోకుండానే నమ్మేస్తాం. జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేయడంలో మీడియా, ముఖ్యంగా బ్రిటన్ మీడియా చాలా ముందుంటుంది.పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్‌లో మార్చి 25 నుంచి ఏప్రిల్ ఫస్ట్ వరకు కొత్త సంవత్సర వేడుకలను జరుపుకునేవారు. నూతన సంవత్సర ఉత్సవాలు, వసంత కాలపు సంబరాలు పదిరోజుల పాటు ప్రజలు ఆనందంగా నిర్వహించుకునేవారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఒకరికి మరొకరు బహుమతులు ఇచ్చే ఆచారాన్ని పాటించేవారు. అయితే 1582లో గ్రెగేరియన్ కేలండర్ అమల్లోకి రావడంతో రాజైన చార్లెస్-9 కేలెండర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచార వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు జనరరి ఫస్టున కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొందరు మాత్రం మొదటి నుంచీ వస్తున్న ఆచారాన్ని మార్చడానికి ఇష్టపడక జరుపుకోలేదు. వాళ్ళు మాత్రం యథావిధిగా ఏప్రిల్ ఒకటి వరకు ఆగి ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. జనవరి ఫస్ట్‌న జరుపుకున్నవారు ఇది చూసి, ఏప్రిల్ ఫస్ట్‌న జరుపుకున్న వారిని ఫూల్స్ అని అంటూ గేలిచేసేవారు. వాళ్ళకి తెలీకుండా పేపర్ చేపల్ని వాళ్ళ వెనక భాగాన కట్టి ఆటపట్టించేవారు. అంతేకాకుండా వాళ్ళని గేలానికి చాలా తేలిగ్గా తెలివితక్కువతనంతో దొరికిపోయే చేపల కింద జమకట్టి, వాళ్ళని ఏప్రిల్ ఫిష్ అంటూ అల్లరి పెట్టేవారు. ఈ ఆటపట్టించే విధానం ఏప్రిల్ ఫూల్స్ డేగా మరో రెండు వందల ఏళ్ళకళ్లా అమెరికా, బ్రిటన్, స్కాట్లండ్ తదితర దేశాలకూ తెలిసిపోయింది. అలా అలా ఇది ప్రపంచమంతా పాకిపోయింది. ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్ వేసుకోవడం ఆనవాయితీగా మారింది. అది రానురాను ప్రాక్టికల్ జోక్స్ వేసుకునే స్థాయికి వెళ్ళింది. ఈ ప్రాక్టికల్ జోక్స్ మొదట్లో సున్నితంగా ఉన్నా, అప్పుడప్పుడూ కాస్త శ్రుతి మించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఆల్ ఫూల్స్ డే రోజున పత్రికలు కూడా పాఠకులతో మొదటిపేజీలో ఓ సంచలన వార్తవేసి ఫలానా పేజీ చూడండి అని రాసేవారు. నిజానికి ఆ నెంబరుగల పేజీ ఆ ప్రతికలో అసలు ఉండేదే కాదు. మీడియా ఇలా బొల్తా కొట్టించడం విదేశాల్లో ఎప్పటినుంచో ఉంది. ఈ సంప్రదాయాన్ని అక్కడి నుంచే దిగుమతి చేసుకున్నాం. మన పుట్టినరోజు వేడుకలను కేకు కోసి దీపాలు ఆర్పినట్లు.. అమెరికాలో జోరుూ స్కాగ్స్ అనే ప్రాక్టికల్ జోకర్.. 2000 సంవత్సరంలో పత్రికల్లో, న్యూయార్క్‌లో ఏప్రిల్ ఫూల్స్ డే పెరేడ్ 12 గంటలకు 59వ నంబరు వీధి నుంచి జరుగుతుందని ప్రకటన ఇచ్చాడు. ఆ పెరేడ్లో న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, సియాటిల్ పోలీసు శాఖలు శకట ప్రదర్శలో పాల్గొంటాయని చెప్పాడు. ఆ ప్రకటన చూసి నమ్మేసిన సీఎన్‌ఎన్ టీవీ చానల్, అది చిత్రీకరించడానికి తన ప్రతినిధులను పంపింది. తీరా అక్కడకు వెళ్ళాక తెలిసింది ఆ రోజు ఏప్రిల్ ఒకటని, జోరుూ ఏప్రిల్ ఫూల్ జోక్ పేల్చాడని.. ఇలాంటి కథనాలు ఎన్నో ఉన్నాయి. ఏదేమైనా సరదాగా, సంతోషంగా జరుపుకునే ఈ వేడుక మన దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా పాకిపోయింది.
****ఒక్కో దేశంలో ఒక్కోలా..
ఏప్రిల్ ఫూల్ రోజున అవతలివారిని ఏదో ఒక విషయంలో దారి మల్లించి వెధవాయిలను చేయడం సహజమే! కాకపోతే కొన్ని దేశాల్లో ఇదే ఆచారాన్ని కాస్త విభిన్నంగా పాటిస్తారు.
* ఫ్రాన్స్‌లో చేప ఆకారంలో ఉన్న కాగితాన్ని అవతలివారికి తెలియకుండా వీపుపై అంటిస్తారు. దీనే్న ఏప్రిల్ ఫిష్ అంటారు.
* పోర్చుగల్ దేశంలో ఒకరిపై ఒకరు పిండి చల్లుకుంటారు.
* డెన్మార్కులో ఏప్రిల్ ఒకటితో పాటు మే ఒకటిన కూడా అవతలివారిని వెర్రివెంగళాయిలను చేసే ప్రయత్నం చేస్తారు.
* ఐర్లాండులో ‘ఏప్రిల్ ఫూల్’ కోసం అనే ఉత్తరాన్ని కవరులో ఉంచి ఒకరినుంచి వేరొకరికి అందిస్తూ ఉంటారు.
* ఇంగ్లండులో ఏప్రిల్ ఒకటి మధ్యాహ్నం వరకే ఫూల్ చేయవచ్చు. ఆ తరువాత ఎవరినన్నా ఫూల్ చేయాలని ప్రయత్నిస్తే మనల్నే ఫూల్స్‌గా జతకడతారు.