అనుకోకుండా ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తి ఆయన. అలాగని 80 లోక్‌సభ స్థానాలున్న పెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్ నుంచో, లేక 48 స్థానాలున్న మహారాష్ట్ర నుంచో గెలవలేదు. కేవలం 28 స్థానాలున్న ‘కర్ణాటక’ నుంచి గెలిచారాయన. అప్పట్లో జనతాదళ్ పార్టీ కర్ణాటకలో గెలిచిన స్థానాలు 16 మాత్రమే. అయితేనేం ‘కాలం’ కలిసొచ్చి ప్రధాని పీఠంపై దర్జాగా కూర్చున్నారీ వొక్కలిగ ముద్దుబిడ్డ. ఆయనే హరదనహళ్లి దొడ్డెగౌడ దేవేగౌడ.
**11 నెలలే అయినా..
1996 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో ఏ ఒక్క పార్టీ సీట్లు సాధించలేదు. కాంగ్రెస్-140, వాజ్‌పేయీ నేతృత్వంలోని భాజపా, మిత్రపక్షాలు 187, వామపక్షాలతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ సాధించిన సీట్లు 192. వాజ్‌పేయీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ.. విశ్వాస పరీక్షను నెగ్గలేకపోయారు. 13రోజుల్లోనే యునైటెడ్ ఫ్రంట్‌కు దారి చూపారు. అలాంటి పరిస్థితుల్లో అప్పటికప్పుడే తెరపైకి వచ్చిన దేవేగౌడ ప్రధాని పీఠాన్ని అలంకరించారు. అలా 1996 జూన్ 1న దేశానికి 11వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అధికారంలో ఉన్న 11 నెలల కాలంలోనే విప్లవాత్మక పథకాలు, చరిత్రాత్మక పనులకు శ్రీకారం చుట్టారు. జాతీయ వ్యవసాయ విధానం, పేదలకు గ్రీన్ కార్డు, కశ్మీరులో ఎన్నికలు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు, చైనాను సందర్శించి ఇరు దేశాల మధ్య సామరస్యాన్ని పెంపొందించే యత్నం, గోల్డెన్ కారిడార్ పేరిట దేశ నలుమూలలా రహదారులు, బంగ్లాదేశ్, భారత్‌ల మధ్య నలుగుతున్న నీటి సమస్యకు పరిష్కారం వంటివి ఆయన హయాంలోనే సాధ్యమయ్యాయి.
**స్వతంత్రంగానే తొలి అడుగు
దేవేగౌడ తల్లిదండ్రులకు రాజకీయ నేపథ్యం లేదు. వ్యవసాయమే వారి జీవనాధారం. అయినప్పటికీ దేవేగౌడ చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి గుత్తేదారుగా మారారు. హాసన్ జిల్లాలో అందరితో కలిసిమెలిసి తిరిగేవారు. అప్పట్లో కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ఎ.జి.రామచంద్రరాయ.. దేవేగౌడలో రాజకీయ నాయకుడి లక్షణాలను గుర్తించారు. ఆయనే తన రాజకీయ గురువని దేవేగౌడ ఇప్పటికీ చెబుతుంటారు. ఓ వైపు సివిల్ పనుల గుత్తేదారుగా ఉంటూనే కాంగ్రెస్‌లో సభ్యత్వం పొంది 1953 నుంచి 1962 వరకు కొనసాగారు. ఎన్నికైన, నామినేట్ అయిన శాసనసభ్యుల విషయంలో పార్టీ వివక్షను నేరుగా ప్రశ్నించి.. పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ అయ్యారు. దాంతో పార్టీ గుర్తు లేకున్నా ఎన్నికల్లో గెలిచి తీరుతానని ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే 1962లో తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కర్ణాటక కాంగ్రెస్.. కాంగ్రెస్(ఓ), కాంగ్రెస్(ఆర్)గా విడిపోగా దేవేగౌడ ‘ఓ’ తరఫున పోటీ చేసి గెలిచి ప్రతిపక్ష నేతగా శాసనసభలో అడుగుపెట్టారు. అనంతర కాలంలో ఇందిరా కాంగ్రెస్ చేస్తున్న నియంతృత్వ ధోరణిని ఆక్షేపిస్తూ రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతాదళ్‌లో పూర్తిస్థాయి రాజకీయ నేతగా ఎదిగారు. మతం ప్రాతిపదికన ఏర్పాటైన భాజపాను మాత్రం తొలి నుంచీ వ్యతిరేకిస్తూనే వచ్చారు. తానున్న జనతాపార్టీ అధ్యక్షుడు కె.హెచ్.పటేల్ భాజపా నేతృత్వంలోని ఎన్‌డీయేకు మద్దతు ఇవ్వడాన్ని దేవేగౌడ పూర్తిగా వ్యతిరేకించారు. ఆ క్రమంలోనే జనతాదళ్(సెక్యులర్)-జేడీఎస్‌కు శ్రీకారం చుట్టారు. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా దేవేగౌడ, కార్యదర్శిగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నియమితులయ్యారు.
***మహాకూటమిలో కీలక నేత
భాజపాను ఓడించాలన్న లక్ష్యంతో దేవేగౌడ కర్ణాటకలో కాంగ్రెస్‌తో జతకట్టారు. తన కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని భాజపా వ్యతిరేక శక్తుల కూటమికి వేదికగా మార్చుకున్నారు. బీఎస్పీ, ఆర్జేడీ, తెదేపా, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే ఇలా దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించి మహాకూటమికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి కూటమిలో ఎటువంటి అభిప్రాయ భేదాలు తలెత్తినా తానున్నానంటూ పరిష్కారం చూపుతున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలే తన చివరి ప్రత్యక్ష ఎన్నికలు అంటూ ఇటీవల ప్రకటించారు.
***వివాదాలు
జేడీఎస్ ఆవిర్భావం నుంచీ కుటుంబ సభ్యులకే దేవేగౌడ ప్రాధాన్యం ఇస్తున్నారు. గౌడ కుటుంబ రాజకీయాలను భరించలేక ఎందరో కీలక నేతలు పార్టీని వీడారు. అలాంటి వారిలో కర్ణాటక కాంగ్రెస్‌లోని కీలక నేత సిద్ధరామయ్య ఒకరు. భూమి పుత్రుడు అని చెప్పుకుంటూ సొంత జిల్లాలో రూ.వేల కోట్లు కూడబెట్టారని ఇప్పటికీ ప్రతిపక్షాలు దేవేగౌడను విమర్శిస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే సమావేశాల్లో ఆయన కునుకు తీయడంపై విమర్శలు, చతురోక్తులకు కొదవే లేదు.
***ఏ కష్టమొచ్చినా యాగం చేయాల్సిందే
ఎలాంటి చిక్కులు ఉత్పన్నమైనా దేవేగౌడ చిక్కమగళూరులోని శారదాపీఠానికి వెళ్లిపోతారు. అక్కడ 12 రోజులపాటు అతిరుద్ర మహాయాగం చేయిస్తారు. అందుకు ఏర్పాట్లన్నీ రెండో కుమారుడు, ప్రస్తుత రాష్ట్ర మంత్రి రేవణ్ణ చూసుకుంటారు. ఇక తన ప్రతి పుట్టిన రోజున దేవేగౌడ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి వస్తే తప్పకుండా చేతిలో నిమ్మకాయ ఉంచుకుంటారు. దేవేగౌడతోపాటు ఆయన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి, ఇతర కుటుంబసభ్యులకు కూడా భక్తి ఎక్కువే.
పేరు : హరదనహళ్లి దొడ్డెగౌడ దేవేగౌడ
పుట్టిన తేదీ : 18 మే 1933, హరదనహళ్లి
తల్లిదండ్రులు : దొడ్డెగౌడ, దేవమ్మ(రైతులు)
విద్యార్హత : డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, హాసన్
సంతానం : కుమారులు నలుగురు, కుమార్తెలు ఇద్దరు. కుమారుల్లో ఒకరు కర్ణాటక సీఎం కుమారస్వామి, మరొకరు హెచ్.డి.రేవణ్ణ (మంత్రి)
రాజకీయ వారసులు : కుమారస్వామి (ముఖ్యమంత్రి), హెచ్.డి.రేవణ్ణ (మంత్రి), అనిత (కుమారస్వామి సతీమణి)ఎమ్మెల్యే, మనవళ్లు- నిఖిల్ కుమారస్వామి, ప్రజ్వల్ రేవణ్ణ (ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు)
ముఖ్యమంత్రి పదవి : 11డిసెంబరు 1994 నుంచి 31మే 1996 వరకు
ప్రధాని పదవి : 01-06-1996 నుంచి 27-04-1997 వరకు
ప్రస్తుతం పోటీ చేస్తున్న స్థానం తుమకూరు
సంకీర్ణ రాజకీయాలకు ఆద్యుడు
Related tags :