Business

కీలక వడ్డీ రేట్లు తగ్గించనున్న ఆర్‌బీఐ

rbi interest rates drop 2019

వరుసగా రెండోసారీ కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ తగ్గించనుందని రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో పలువురు ప్రముఖులు అభిప్రాయడ్డారు. మంగళవారం ప్రారంభమైన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు చర్చించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో శక్తికాంత దాస్‌ ఆర్‌బీఐ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి దీనికి సంబంధించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. తొలి సమావేశంలోనే వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు విధానాల్లో కీలక మార్పులకు శక్తికాంతదాస్‌ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గుదల, వృద్ధి రేటు క్షీణతే ఇందుకు కారణంగా ఆర్‌బీఐ వర్గాలు పేర్కొన్నప్పటికీ.. అసలు కారణాలు వేరే ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే ఆర్‌బీఐ ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందని కొందరు ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానించారు. ‘‘వడ్డీ రేట్ల విషయంలో ఆర్‌బీఐపై కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందని తెలుసు. ఒకవేళ ఒత్తిడికి తలొగ్గి రేట్లను తగ్గించాల్సి వస్తే.. ఏప్రిల్‌లోనే ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికలకు కేవలం వారం రోజుల ముందు తీసుకునే నిర్ణయంతో వృద్ధి రేటు పెరిగి.. అది ఎన్నికలపై ప్రభావం చూపుతుందనేది ఆలోచించాల్సిన విషయం’’ అని ప్రముఖ ఆర్థికవేత్త ప్రకాశ్‌ సక్‌పాల్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ పార్టీలు ప్రకటిస్తున్న జనాకర్షక పథకాలతో ధరలపై భారం పడే అవకాశం ఉందని.. ఈ తరుణంలో ఆర్థిక విధానాలను మరింత సులభతరం చేయడం అంత శ్రేయస్కరం కాదని సర్వేలో పాల్గొన్న మరికొంత మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. 85శాతం మంది కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గిస్తుందని తెలిపారు. అలాగే రెపోరేటును 6శాతానికి తగ్గించి దాదాపు వచ్చే సంవత్సరం మధ్య కాలం వరకు అలాగే ఉంచే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. ఏడు నెలలుగా ద్రవ్యోల్బణ సూచీ ఆర్‌బీఐ లక్ష్యం 4శాతం కంటే దిగువన నమోదవుతూ వస్తోన్న విషయం తెలిసిందే. కానీ రేట్ల తగ్గింపుతో వినియోగదారులకు పెద్దగా లాభం ఉండకపోవచ్చునని మరో ఆర్థికవేత్త అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్ల తగ్గుదల ఫలితాల్ని బ్యాంకులు వినియోగదారులకు అందించడానికి సుముఖంగా లేవని.. ఈ నేపథ్యంలో రేట్ల కోత నిర్ణయం పెద్దగా లాభం చేకూర్చకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆర్‌బీఐ తీసుకోబోయే ప్రభుత్వ అనుకూల నిర్ణయం రూపాయి విలువ క్షీణతకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. గత రెండు త్రైమాసికాల్లో వృద్ధి రేటు ఊహించిన దాని కంటే తక్కువగా నమోదవడం గమనార్హం. ఇటీవల కీలక గణాంకాలను ప్రభుత్వం మార్చిందని ప్రతిపక్షాలతో పాటు పలువురు ఆర్థిక వేత్తలు ఆరోపించిన విషయం తెలిసిందే. అయినా సర్వేలో పాల్గొన్న సగం మందికిపైగా.. మోదీ నేతృత్వంలోని సుస్థిర ప్రభుత్వమే ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడడం గమనార్హం. ప్రత్యామ్నాయ విధానాల సూచన కంటే మోదీ ప్రభుత్వ విధానాలను విమర్శించడంలోనే ప్రతిపక్షాలు నిమగ్నమయ్యాయని.. ఈ నేపథ్యంలో వారి అధికారం భారత ఆర్థిక పరిస్థితులకు ఏమాత్రం మంచి చేయకపోవచ్చునని వ్యాఖ్యానించారు.