Devotional

ఏప్రిల్ నెల రాశి ఫలాలు ఇవే

april 2019 rashifal

1. శ్రీరామ నవమి తర్వాత ఈ-టిక్కెట్ల విక్రయాలు
భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తుల కోసం కంప్యూటర్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ప్రింట్‌ చేసిన రశీదు పుస్తకాలను మనీ వాలిడ్‌ విభాగం పర్యవేక్షిస్తుండగా ఇందులో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయని తెలిసింది. ఇక నుంచి ఈ-టిక్కెట్‌లను కంప్యూటర్‌ ద్వారా అందించనున్నారు. శ్రీరామ నవమి తర్వాత ఈ పద్ధతి అమల్లోకి వస్తుందని అనుకుంటున్నారు. ఇంకా ఆలస్యమైతే వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించే వీలుంది. ఇందుకుగాను ఇప్పటికే అధికారులు కార్యాచరణ తయారు చేశారు. ఎక్కడెక్కడ ఎన్ని కంప్యూటర్లను అందుబాటులో ఉంచాలనేది చర్చిస్తున్నారు. ఆంజనేయస్వామి ఆలయం వెనుక వైపున, లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయం వద్ద, తూర్పు మెట్ల వద్ద కౌంటర్లు ఉండగా ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఈ పరిజ్ఞానం తప్పనిసరిగా తెలియాల్సి ఉంది. 2007 వరకు ఈ పద్ధతి అమలులో ఉండగా రాష్ట్రవ్యాప్తంగా దీన్ని ఆపేశారు. ప్రభుత్వ సూచనలతో పాటు దేవాదాయ శాఖ ఆదేశాలతో అన్ని కోవెళ్లలో మే 1 నుంచి ఈ-టిక్కెట్‌లను అమలు చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని గణేశ్‌ ఆలయంలో అంతర్జాల సేవలను ఉపయోగంలోకి తేవడంతో ఇది విజయవంతమైంది. రామాలయంలో వచ్చే నెల 1న గానీ లేదా ఆ వారాంతంలో గానీ కొత్త విధానం పాటించే దిశగా ఈవో రమేశ్‌బాబు చర్యలు చేపట్టారు. అర్చనలు, సుప్రభాతం, బంగారు పుష్పార్చన, సంధ్యా హారతి, బంగారు తులసి పూజలు వంటి వాటికి త్వరలో కంప్యూటర్‌ టిక్కెట్‌లను అందించనున్నారు. ప్రసాదాల విభాగంలో రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ఆర్టీసీలో వాడే టిమ్‌ తరహా మిషన్‌లను వాడాలని అనుకుంటున్నారు. ఇలాంటి కౌంటర్ల ద్వారా నెలకు సుమారు రూ.కోటి ఆదాయం వస్తుందని అంచనా. వసతి సదుపాయం కల్పన ద్వారా ఏడాదికి రూ.కోటి వస్తుండగా స్వైపింగ్‌ యంత్రాలను ఉపయోగించాలని భావిస్తున్నారు. దీన్ని కూడా భవిష్యత్తులో కంప్యూటరీకరించనున్నారు. రానున్న రోజుల్లో అన్ని విభాగాలను అంతర్జాలంతో అనుసంధానం చేసే దిశగా సమాలోచనలు చేస్తున్నారు. కొత్త విధానంలో పారదర్శకత వస్తుందని అనుకుంటున్నారు.
2. యాదాద్రిలో ‘ప్రహ్లాద చరిత్ర’
యాదాద్రి ఆలయంలో స్తంభోద్భవుడైన ఉగ్ర నరహరి- పరమ భక్తుడైన ప్రహ్లాదుడి చరిత్ర రూపకల్పనకు ‘యాడా’ సన్నాహాలు చేపట్టింది. ఈ రూపాలను 7 అడుగుల ఎత్తున, 70 అడుగుల వెడల్పుతో గర్భాలయ ద్వారంపై పొందుపరుస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక కళాకారులతో అనేక ఘట్టాల రూపకల్పన సాగిస్తున్నారు. వెండి కవచాలతో ప్రహ్లాదుడు, అతడితో తండ్రి హిరణ్యకశిపుడి వాదనలు..చిత్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఆ బాలభక్తుడిని హింసించే దృశ్యాలు, అతడి రక్షణ కోసం నారసింహుడు స్తంభం నుంచి ఉద్భవించే కళా నిర్మాణాలకు కూడా ఆలయ శిల్పి ఆనందసాయి కృషిచేస్తున్నారు.
3. తితిదే ఛైర్మన్‌ పుట్టా ఇంటిపై ఐటీ సోదాలు
కడప జిల్లా ప్రొద్దుటూరులో తిరుమల తిరుపతి దేవస్థానాల మాజీ ఛైర్మన్‌, మైదుకూరు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటిపై బుధవారం ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) అధికారులు సోదాలు నిర్వహించారు. కడప, ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఐటీ అధికారులు బృందంగా ఏర్పడి ప్రొద్దుటూరు వైఎంఆర్‌ కాలనీలోని సుధాకర్‌ యాదవ్‌ స్వగృహంపై తనిఖీలు జరిపారు.
4. రేపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవాటిక్కెట్లను తితిదే శుక్రవారం విడుదల చేయనుంది. జులై నెలకు సంబంధించి వివిధ ఆర్జిత సేవా టిక్కెట్లను www.tirumala.org వెబ్‌సైట్‌ ద్వారా ఉదయం పదింటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. శ్రీవారి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టిక్కెట్లను డిప్‌ విధానం కింద భక్తులను ఎంపిక చేయనుంది. విశేషపూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవాటిక్కెట్లు కరెంటు బుకింగ్‌ కింద వెంటనే కొనుగోలుకు అవకాశం ఉంటుంది. సేవాటిక్కెట్లన్నీ కలిపి దాదాపు 50 వేలకుపైగా విడుదల చేయనుంది.
5. శ్రీయాగం పరిసమాప్తం -పూర్ణాహుతికి హాజరైన నారా భువనేశ్వరి
రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని కాంక్షిస్తూ తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ చేపట్టిన మూడు రోజుల శ్రీయాగం బుధవారం పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. విజయవాడలోని కేజే గుప్తా కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న పూజల్లో ముఖ్యమంతి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పాల్గొని గోపూజ నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య ప్రసాద్‌ శర్మ నేతృత్వంలో 41 మంది రుత్విక్కులు యాగాన్ని జరిపించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావాలని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌ గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రత్నకుమారి, తెదేపా నేతలు పాల్గొన్నారు.
6. స్ఫూర్తిగా నిలిచిన తితిదే చిరుద్యోగి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి తితిదేలో పనిచేసే స్వీపరు వరలక్ష్మి రూ.6 లక్షల విలువ చేసే రెండు వెండి బిందెలను బుధవారం వితరణ చేశారు. శ్రీవారి అభిషేకం సేవకు ఉపయోగపడేలా బిందెలను తయారు చేయించారు. చిరుద్యోగి నెలవారీ జీతంలో పొదుపు చేసి.. స్వామివారికి బిందెలు వితరణ చేసి భక్తిని చాటుకున్నారు. శ్రీవారి ఆలయ మహద్వారం ఎదుట బిందెలను డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, బొక్కసం బాధ్యులు గురురాజారావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను పలువురు ప్రశంసించారు.
7.శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభం
ప్రముఖ శైవక్షెత్రమైన శ్రీశైల మహాక్షెత్రంలో బుధవారం ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో శ్రీరామచందమూర్తి ధర్మకర్తలు, ఆలయ అర్చకులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు ప్రారంభ పూజలు నిర్వహించారు. శ్రీ భ్రమరాంభికాదేవికి విశేష కుంకుమార్చనలు, నవావరణా ర్చ నలు, చండీ హోమాలు జరిగాయి. సాయంత్రం అగ్ని ప్రతిస్థాపన అంకురార్పణ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీభ్రమరంభ మల్లిఖార్జున స్వామీ వారల ఉత్సవమూర్తులను బ్రుంగివాహపై అసీనగావించి ఆలయంలో విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళవాయిద్యాలు, సాంస్కృతిక కళాకారుల సందడి నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. లక్షలాదిగా కన్నడ భక్తులు తరలివచ్చారు.
8. చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 4-విలియం క్రూక్స్
1818 : అమెరికా సంయుక్త రాష్ట్రాలు 13 చారలు మరియు 20 నక్షత్రాల జాతీయ జండాను నిర్ధారించింది.
1905 : గ్రా భూకంపం లో 20,000 మంది ప్రజలు మరణించారు.
1919 : సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త.మరణం (జననం . 1832).
1968 : అమెరికా కు చెందిన పాస్టర్, ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ మరణం (జ. 1929).
1975 : మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది.
1979 : ప్రముఖ భావకవి అబ్బూరి రామకృష్ణారావు మరణం (జ.1896).
9. రాజ్‌భవన్‌లో రేపు ఉగాది వేడుకలు
ఈ నెల 5వ తేదీన సాయంత్రం రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఉగాది వేడుకల్లో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 6న ఉదయం 10:30 గంటలకు రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే వికారి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పాల్గొననున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందుకు ప్రగతి భవన్‌ జనహితలో కాకుండా రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలను నిర్వహిస్తోంది.