Politics

పశువుల పాకలో పుట్టింది. బుల్లితెర మీద మెరిసింది. ఢిల్లీ గద్దెను ఎక్కింది.

smriti irani story

హోటల్లో కప్పులు కడిగిన అమ్మాయి క్యాబినెట్ మంత్రి అయ్యింది.. దిల్లీ వీధుల్లో తిరుగుతూ సౌందర్య ఉత్పత్తులు అమ్మిన అమ్మాయి.. అతి పిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా మారింది.. ఇవన్నీ ఎవరి గురించి చెబుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఆమే స్మృతీ ఇరానీ. కాఫీ కప్పులు కడిగిన అమ్మాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగేవరకూ ఆమె ప్రతి ఆలోచనా నిర్ణయాత్మకమైనదే.. ఒక సాధారణ యువతి కసి, పట్టుదలతో పనిచేస్తే ఎక్కడిదాకా వెళ్లచ్చో అందరికీ ఇట్టే అర్థమైపోతుంది. దేశ ప్రధాని దగ్గర నుంచి సామాన్య ప్రజానీకం వరకూ.. ప్రతివారినీ ప్రభావితం చేసిన శక్తి ఆమెది. కానీ ఆమె పుట్టింది పశువుల పాకలో. స్మృతి తండ్రి ఓ పంజాబీ.. ఆయన ఓ బెంగాలీ అమ్మాయిని ప్రేమించాడు. అయితే రెండు వైపుల వాళ్ళూ వాళ్ళ ప్రేమను ఒప్పుకోకపోవడంతో బయటకొచ్చి పెళ్ళిచేసుకుని ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు. దక్షిణ దిల్లీ శివార్లలో కాపురం పెట్టారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఒక పశువుల కొట్టాన్ని చూసుకునే పనికి కుదురుకున్నారు. స్మృతి అక్కడే జన్మించింది. ‘స్మృతి పుట్టగానే.. ఆడపిల్ల ఇంటికి భారం.. చంపేయండి’ అని బంధువులు స్మృతి తల్లికి సలహా ఇచ్చారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. స్మృతి తరువాత మరో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఒక పక్క చదువుకుంటూనే ఇంటికి పెద్ద కూతురైన కారణంగా, పేదరికం వల్ల కొన్ని కుటుంబ బాధ్యతలు మోయాల్ని వచ్చింది. పదో తరగతిలో ఉన్నప్పుడే చిన్న చిన్న ఉద్యోగాలు చేసేది స్మృతి. పదో తరగతి, ఆపై ఇంటర్మీడియట్ అరవై శాతం పైగా మార్కులతో పాసైనా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం వల్ల కళాశాలకు వెళ్ళడం మానేసి దూరవిద్యలో చదవడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులిద్దరూ పనికి వెళుతుండటంతో ఇంటి పనులన్నీ స్మృతి చేసేది. పదహారేళ్ళ వయసున్నప్పుడు దిల్లీలోని జన్‌పథ్ వీధుల్లో సౌందర్య సాధనాలను మార్కెటింగ్ చేసే ఉద్యోగం చేసింది. ఒక స్నేహితురాలి సలహాతో తన ఫొటోను ఎవరికీ తెలియకుండా మిస్ ఇండియా పోటీలకు పంపింది. అది మొదటి వడపోతలో ఎంపికైంది. కానీ తదుపరి పోటీల్లో ముంబై వెళ్ళాల్సి వచ్చింది. తల్లిదండ్రులను దానికి కావాల్సిన రెండు లక్షల రూపాయలకు అప్పుగా ఇవ్వమని కోరింది. ఆ డబ్బును నెమ్మదిగా తానే చెల్లిస్తానని తండ్రికి ప్రమాణం చేసింది. మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. పైగా మిస్ ఇండియా పోటీలకు వెళుతోందని తెలియగానే ఆశ్చర్యపోయారు. కానీ స్మృతి పట్టుబట్టడంతో తండ్రి రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చిచ్చాడు. ఆ డబ్బుతో ముంబై చేరింది స్మృతి. సొంతంగానే పోటీలకు తయారవడం మొదలుపెట్టింది. పోటీలో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చివరి ఐదుమందిలో చోటు సంపాదించుకున్నా ‘మిస్ ఇండియా’ కిరీటం మాత్రం చేజారింది. అయినా ఆత్మవిశ్వాసాన్ని చేజార్చుకోలేదు. రెండు లక్షల రూపాయల అప్పు ఎలాగైనా తీర్చాలని అనుకుంటూ వివిధ ఉద్యోగాల కోసం ప్రయత్నించింది. ముంబైలోనే ఉంటూ మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెబితే తండ్రి ఒప్పుకోలేదు. ‘ముంబైని నమ్మలేం.. అక్కడ మోసపోతావు. ఇంటికి వచ్చి శుభ్రంగా పెళ్లి చేసుకో’ అంటూ నచ్చజెప్పాడు. కానీ అందుకు స్మృతి ఒప్పుకోలేదు. ‘నా జీవితం నా నిర్ణయాల ద్వారా ఓడిపోతేనే సంతృప్తిగా ఉంటుంది’ అని చెప్పి ముంబైలోనే ఉండిపోయింది. అలా ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా జెట్ ఎయిర్‌వేస్‌లో ఎయిర్ హోస్టెస్‌గా ప్రయత్నించినా ఆ ఉద్యోగం రాలేదు. బతుకుదెరువు కోసం బాంద్రాలోని మెక్ డొనాల్డ్స్‌ లో ఉద్యోగానికి చేరింది. అక్కడ టేబుళ్ళు, ఫ్లోర్లు శుభ్రం చేయడం నుంచి ఆర్డర్లను సప్లై చేయడం వరకు అన్ని పనులూ చేసింది. ఇది చేస్తూనే మోడలింగ్ అవకాశాల కోసం స్టూడియోలకు తిరుగుతూనే ఉంది. కొద్దిరోజుల తర్వాత ఓ శానిటరీ నాప్‌కిన్ ప్రకటనలో కనిపించే అవకాశం వచ్చింది. తర్వాత టీవీలో రెండు సినిమా కార్యక్రమాలకు యాంకరింగ్ చేసే అవకాశం లభించింది. ఈ కార్యక్రమాలను చూసిన శోభాకపూర్ స్మృతిని తన కూతురు ఏక్తాకపూర్‌కు పరిచయం చేసింది. దాంతో ఆమెకు ‘క్యోకీ సాస్ బీ కభీ బహూ థీ’ అనే సీరియల్‌లో తులసి అనే పాత్రకి ఎంపికైంది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక ఆ తరువాత అంతా చరిత్రే.. బుల్లితెర ప్రస్థానంలో ఈ సీరియల్ ఒక సంచలనం. తులసి విరాని పాత్రలో ఒదిగిపోయిన స్మృతి ప్రతి ఇంటికీ పరిచయమైంది. ఎనిమిదేళ్ళ పాటు ఆ సీరియల్లో తులసిగా కనిపించిన స్మృతి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టీవీ నటులకు అత్యుత్తమ అవార్డుగా భావించే ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును వరుసగా ఐదుసార్లు అందుకుని చరిత్ర సృష్టించింది స్మృతి. ఈ అవార్డును వరుసగా అందుకున్న ఏకైక వ్యక్తి స్మృతి ఇరానీనే.. తరువాత సొంతంగా ఉగ్రాన్య ప్రొడక్షన్స్ పేరుతోనిర్మాణ సంస్థ నెలకొల్పి టీవీ సీరియల్స్ నిర్మించింది. తనకంటే వయసులో చాలా పెద్దవాడైన చిన్ననాటి స్నేహితుడు జుబిన్ ఇరానీ అనే పార్శీ మతస్థుడిని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి స్మృతి మల్హోత్రా కాస్తా స్మృతి ఇరానీగా మారింది. స్మృతికి ఇద్దరు పిల్లలు.. అబ్బాయి జోహ్,్ర అమ్మాయి జోయిష్. మంత్రి అయ్యాక అందరు తల్లుల్లానే పిల్లలను స్కూల్లో చేర్పించడానికి తానూ ఇంటర్వ్యూను ఎదుర్కొంది స్మృతి. ఉన్నత చదువులు చదవకపోయినా స్మృతికి ఆరు భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంది. పంజాబీ, బెంగాలీ, అస్సామీ, మరాఠీ భాషలూ వచ్చు. సీరియల్లో స్టార్ స్టేటస్, సొంత నిర్మాణ సంస్థ, పెళ్లి.. ఇవన్నీ జరిగేటప్పటికి స్మృతి వయసు పాతికేళ్లే.. ఇంత చిన్నవయసులోనే ఇన్ని బాధ్యతలా? అని ఎవరైనా అడిగితే.. ‘పాతికేళ్లకే జీవితానికి సరిపడా కష్టాలు చూశాను. కాబట్టి నేను ఎన్ని బాధ్యతలైనా మోయగలను’ అని చెప్పేది స్మృతి. అలా చిన్నవయస్సులో రాజకీయాలపై ఇష్టంతో ఆ రంగంలోకి అడుగుపెట్టింది స్మృతి. స్మృతి తాతయ్య ఆరెస్సెస్‌లో పనిచేసేవాడు. తల్లి జనసంఘ్‌లో కార్యకర్తగా ఉండేది. స్మృతి కూడా చిన్నప్పటి నుంచే ఆరెస్సెస్‌లో సభ్యురాలు. నిర్మాతగా ఉన్నతస్థాయిలో ఉన్నప్పుడే రాజకీయరంగంలోకి అడుగుపెట్టింది. 2003లో బీజేపీలో చేరింది. 2004 ఎన్నికల్లో దిల్లీలోని చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌పై పోటీ చేసినా నిరాశే ఎదురైంది. ఎన్నికల్లో ఓడిపోయినా గతంలో ఎప్పుడూలేని విధంగా బీజేపీకి ఓటుబ్యాంకు సంపాదించిపెట్టింది. ఆ ప్రతిభకు మెచ్చి తర్వాత ఆమెను మహారాష్ట్ర యువత విభాగానికి అధ్యక్షురాలిగా నియమించింది బీజేపీ నాయకత్వం. కొన్నాళ్ళకు బీజేపీ జాతీయ కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శిగా, అధ్యక్షరాలిగా ఎదిగింది. ఈ ప్రయాణంలో ప్రజల తరఫున ఆమె సాగించిన పోరాటాలు ఎన్నో.. అత్యాచార బాధితులు, మహిళల సమస్యల కోసం చేసిన పోరాటంలో అరెస్టయిన సందర్భాలు ఎన్నో.. తన వాగ్ధాటితో ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసి ‘మిసెస్ ఫైర్‌బ్రాండ్’గా పేరు తెచ్చుకుంది. సమస్యలను పరిష్కరించడంలో దిట్టగా పేరున్న స్మృతి తన కష్టపడేతత్త్వంతో పార్టీలో అంచెలంచెలుగా ఎదిగింది. బీజేపీ గోవా విభాగానికి రాజకీయ సలహాదారుగా కూడా పనిచేసింది. 2011లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టింది. 2014లో మోదీ ప్రభుత్వంలో మానవవనరుల శాఖకు మంత్రి అయ్యింది. పెద్దగా చదువుకోని మహిళకు అంత ఉన్నత పదవి ఏంటని ప్రత్యర్థులు విమర్శిస్తే ‘పెద్దగా చదువుకోలేదు కాబట్టే నాకు చదువు విలువ బాగా తెలుసు. అవకాశాలు రాకపోతే కలిగే బాధను అనుభవించా.. కాబట్టి విద్యార్థుల సమస్యలను నేను పరిష్కరించగలను. ఇంతకు ముందు ఆ పదవిలో పీహెచ్‌డీ వంటి ఉన్నత చదువులు చదివిన వాళ్లు పనిచేశారు. వాళ్ల పనితీరును చూశాక నేను పీహెచ్‌డీ చేయకపోవడమే మంచిదైంది’ అంటూ తనపై వచ్చిన విమర్శలను పదునైన మాటలతో తిప్పికొట్టింది. 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్‌పై పోటీచేసి ఓడిపోయింది. అయితే రాహుల్ మెజారిటీని తగ్గించడంతో అనూహ్యంగా విజయం సాధించింది. ఇక 2019 ఎన్నికల్లో రాహుల్‌ను ఓడించేందుకు బలమైన నేత అవసరమని భావించిన బీజేపీ.. స్మృతి ఇరానీని మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. రాజకీయాల్లోకి వచ్చాకే కాదు.. రాకముందు.. అంటే చిన్నప్పటి నుంచీ స్మృతి ఇంట్లోవాళ్లు వద్దన్న పనులే చేసింది. కానీ అనూహ్యంగా అన్నింటిలోనూ విజయం సాధించింది. అందుకే దేశ యువతకు ఇలా చెబుతోంది స్మృతి ఇరానీ.. ‘మీ మనసుకు నచ్చిన పని చేయండి. దాని వల్ల వచ్చే ఫలితాలకు మీరే బాధ్యత తీసుకోండి’. 2015లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం.. యువ అంతర్జాతీయ లీడర్‌గా భారత మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ ఎంపికయ్యారు. ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్‌లో వర్కర్ స్థాయి నుంచి దేశంలో టాప్ పొలిటీషియన్‌గా స్మృతి ఎదిగారని ఈ సందర్భంగా డబ్ల్యుఈఎఫ్ ప్రశంసించింది.