WorldWonders

ప్రేయసి ప్రోత్సాహం ప్రేరణ వెరసి ప్రథమం

kanishka kataria says his girlfriend is behind his win

అత్యంత ప్రతిష్ఠాత్మక సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో రాజస్థాన్‌కు చెందిన కనిష్క కటారియా మొదటిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. టాపర్‌గా నిలిచిన కటారియా ఎస్సీ కేటగిరీకి చెందినవారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. సివిల్స్‌లో గణితం ఆప్షనల్‌ సబ్జెక్టుగా తీసుకున్నారు. అయితే తన విజయం వెనకున్న వ్యక్తి గురించి కటారియా మీడియాకు వివరించారు. ‘ ఫలితాల్లో టాపర్‌గా నా పేరును చూసి తొలుత నాకు నమ్మశక్యం కాలేదు. ఎన్నో సార్లు నన్ను నేను గిల్లుకున్నాను.ఈ విషయంలో నేను నా తల్లిదండ్రులకు, సోదరికి ప్రత్యేకంగా నా ప్రేయసికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి.నైతికంగా ఆమె నా వెనకే ఉండి నన్ను నడిపించింది. ఈ విజయంలో సగం క్రెడిట్‌ ఆమెకే దక్కుతుంది. నేను మంచి పరిపాలకుడినని ప్రజలందరూ గుర్తించాలి. నా ధ్యేయం కూడా అదే’ అని తెలిపారు. శుక్రవారం విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో కటారియా తొలిస్థానంలో నిలవగా రెండో ర్యాంకును రాజస్థాన్‌కు చెందిన అక్షత్‌ జైన్‌ కైవసం చేసుకున్నారు. ఇక మహిళల్లో సృష్టి జయంత్‌ దేశ్‌ముఖ్‌ టాపర్‌గా నిలిచినా, ర్యాంకుపరంగా ఐదోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అగ్రస్థానంలో నిలిచిన 25 మందిలో 15 మంది పురుషులు, పదిమంది మహిళలు ఉన్నారు. 577 మంది పురుషులు, 182 మంది మహిళలు సహా మొత్తం 759 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్‌సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.