ScienceAndTech

భారత సైన్యానికి “”ధనుష్””

dhanush joins indian army

‘బోఫోర్స్‌’తో ముడిపడిన రాజకీయాలు పక్కన పెడితే కార్గిల్‌ యుద్ధ సమయంలో హిమగిరుల మధ్య ఆ శతఘ్ని గర్జనలు శత్రవుల గుండెల్లో గుబులు పుట్టించాయి. 1980లో బోఫోర్స్‌ల రాక తర్వాత భారత్‌ ఆ స్థాయిలో మళ్లీ శతఘ్నులను ఎప్పుడూ కొనుగోలు చేయలేదనే చెప్పాలి. దీనికి రాజకీయ భయాలే కారణమనే విమర్శలు ఉన్నాయి. భారత సైన్యం 155ఎంఎం శతఘ్నుల కోరతను చాలా తీవ్రంగా ఎదుర్కొంది. యుద్ధపరిస్థితుల్లో ఏ ఆయుధాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. భౌగోళిక, వ్యూహాత్మక అవసరాలను బట్టి అవి మన సైన్యం ప్రాణాలను కాపాడతాయి. 980లో బోఫోర్స్‌ కొనుగోలు సమయంలో చేసుకొన్న ఒప్పందం ప్రకారం భారత్‌కు తొలివిడతగా 12,000 పేజీల సాంకేతిక పరిజ్ఞానం అందింది. అదే ఆ తర్వాత మనకు ఆధారంగా మారింది. అప్పట్లో బోఫోర్స్‌ వివాదం కావడంతో స్వీడన్‌ కంపెనీ 155×39 ఎంఎం సాంకేతికత అందలేదు. కానీ భారత సైన్యం అవసరాలు తీర్చేందుకు ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు, డీఆర్‌డీవో, డీజీక్యూఏ, డీపీఎస్‌యూ, భారత్‌ ఎలక్ట్రానిక్‌ లిమిటెడ్‌, సెయిల్‌తో పాటు పలు ప్రైవేటు సంస్థలు కలిసి తయారీని ప్రారంభించాయి. ధనుష్‌ ప్రాజెక్టు గన్స్‌క్యారేజ్‌ ఫ్యాక్టరీ(జీసీఎఫ్‌)కు దక్కింది. తొలి నమూనాను 2014లో తయారు చేశారు. మొత్తం 11 నమూనాలను 4,200 రౌండ్ల మేరకు పరీక్షించారు. వీటిల్లో ఆమోదం పొందిన మోడల్‌ శతఘ్నలు భారత్‌లోని భిన్న వాతావరణాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అందుకే అత్యంత చలిగా ఉండే లేహ్‌, సిక్కిం, వేడిగా ఉండే ప్రదేశాలైన బాలాసోర్‌, బబీన, ఝాన్సీ, థార్‌ ఎడారిలోని పోక్రాన్‌ రేంజిలో పరీక్షంచారు. దీనికోసం వాటిని 1600 కిలోమీటర్ల మేరకు తిప్పారు. ప్రపంచలో అత్యంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదించే శతఘ్నుల్లో ధనుష్‌ కూడా స్థానం పొందింది. ధనుష్‌ విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న బోఫోర్స్‌ కంటే మెరుగ్గా లక్ష్యాలను ఛేదిస్తోంది. 38 కిలోమీటర్లకు వరకు దీనికి దాడి చేసే సామర్థ్యం ఉంది. ఒక్కో ధనుష్‌ను రూ.14.50కోట్లకే తయారు చేస్తున్నారు. దీని ఒక్కో షెల్‌ ఖరీదు రూ.లక్షకు పైమాటే. ఈ శతఘ్నిలో ఉపయోగించి పరికరాల్లో 81శాతం భారత్‌లో తయారైనవవే. ఇది 2019 చివరి నాటికి 90శాతం భారతీయతను సంతరించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దీనిలో అత్యాధునిక శతఘ్నికి ఉండాల్సిన ఆటోలేయింగ్‌ సౌకర్యం, అత్యాధునికమైన పగలు, రాత్రి కూడా కాల్పులు జరపగల శక్తి ఉన్నాయి. దీనికి సెల్ఫ్‌ ప్రొపెల్షన్‌ వ్యవస్థ ఉంది. కొండలపై దీనిని అలవోకగా మోహరించవచ్చు. దీని రేంజిని కూడా అవసరాలకు తగినట్లు మార్చుకోవచ్చు. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డుకు ఇప్పటికే 114 ధనుష్‌ల కోసం ఆర్డరు లభించింది. మేకిన్‌ ఇండియా కింద భారత సైన్యానికి అందుతున్న తొలి శతఘ్ని ఇదే. నేడు తొలివిడత 155X45 ఎంఎంల ధనుష్‌లను సైన్యంలో చేర్చారు. దీంతో భారత సైన్యానికి అదనపు బలం చేకూరినట్లైంది. ఇప్పటికే దక్షిణ కొరియాకు చెందిన కె-9 వజ్రా, అమెరికాకు చెందిన ఎం-777లను కూడా సైన్యం కోసం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.