DailyDose

నేటి గరంగరం తాజావార్తలు–04/11

xiaomi realme 3 pro

* ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియ‌ల్ మి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రియ‌ల్ మి 3 ప్రొ ను ఈ నెల 22వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. అలాగే ముందు భాగంలో 25 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను కూడా ఏర్పాటు చేశార‌ని స‌మాచారం. ఇక ఈ ఫోన్‌లో ప‌వ‌ర్‌పుల్ ప్రాసెస‌ర్‌, ర్యామ్‌ల‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. కాగా ఈ ఫోన్‌కు చెందిన పూర్తి స్థాయి స్పెసిఫికేష‌న్ల వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేదు. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు తెలుస్తాయి. ఇక ఈ ఫోన్‌ను ఢిల్లీ యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించ‌నున్న ఓ ఈవెంట్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.
*గన్నవరం మడిచర్లలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఓ కానిస్టేబుల్ జ్యోతి ప్రకాశ్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రచారం చేస్తున్నాడు. వైసీపీకి ఓటు వేయకపోతే కాల్చేస్తానని బెదిరిస్తూ.. ఓటర్లను దుర్భాషలాడాడు. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో కానిస్టేబుల్‌తో ఓటర్లకు క్షమాపణ చెప్పించారు. అనంతరం ఆయనను విధులను తప్పించారు.
*తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న చోట్ల ఈవీఎంలు పనిచేయకుండా చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆయన విజయవాడలోని మల్లికార్జునపేట పోలింగ్‌ కేంద్రం దగ్గర ధర్నాకు దిగారు. ఈవీఎంలు పనిచేయకపోవడం వెనుక వైసీపీబీజేపీ కుట్రని ఆయన ఆరోపించారు. కాగా బుద్దా వెంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతున్న అధికారులపైనా వారు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు. అంతేకాదు, వైసీపీ కార్యకర్తలు స్పీకర్‌ కోడెల చొక్కా చింపేశారు. ఆ సమయంలో ఆయనకు అడ్డుగా నిలిచిన గన్‌మెన్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో వాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
*పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యేటీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద బీభత్సం సృష్టించారు. స్థానిక ఎంపీటీసీ భర్తదళితుడు మట్టా రాజుపై ఇవాళ ఉదయం రౌడీషీటర్లతో కలిసి బుజ్జి దాడి చేశాడు. రాజును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తే.. అక్కడ కూడా ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత మాజీ డిప్యూటీ మేయర్‌ కిశోర్‌మాజీ కార్పొరేటర్‌ చందుపై దాడి చేశాడు. ఈ దాడులను పోలీసులు అడ్డుకోలేదని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. మొత్తానికి ఏలూరు అసెంబ్లీ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
*అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ నాయకులు రెచ్చిపోయారు. గుంతకల్‌ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మధుసూదన్‌ గుప్తా.. గుత్తిలోని ఓ పోలింగ్‌ బూత్‌లో బీభత్సం సృష్టించారు. పోలింగ్‌ బూత్‌లోని ఈవీఎంను ధ్వంసం చేశారు. అసెంబ్లీపార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను సరియైన క్రమంలో ప్రచురించకపోవడంతో ఎన్నికల సిబ్బందిపై గుప్తా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈవీఎంను నేలకేసి కొట్టారు. దీంతో ఈవీఎం పూర్తిగా ధ్వంసమైంది. అనంతరం మధుసూదన్‌ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో  అసెంబ్లీ స్థానాలకు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈనెల 8న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
*పార్లమెంటు ఎన్నికల నిర్వహణ విధుల్లో భాగంగా సత్తుపల్లికి చేరుకున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి బుధవారం గుండెపోటుతో మరణించారు. వైరాకు చెందిన ఎదునూరి నాగరాజు(35) మధిరలోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
*లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో ఓటుహక్కు వినియోగించుకుంటారు. ఉదయమే వారు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో ఆ గ్రామానికి వెళ్లి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలోని పోలింగ్‌ కేంద్రానికి చేరుకుంటారు, సీఎం కేసీఆర్‌, సతీమణి శోభ 2018 డిసెంబరు 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేశారు.రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తొలిసారిగా సొంత గ్రామానికి రానుండటం ప్రత్యేకత సంతరించుకుంటోంది. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఉదయం 9 గంటల ప్రాంతంలో సోమాజీగూడ ఎంఎస్‌ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద బూత్‌లో ఓటు వేస్తారు.
*విద్యుత్తు వ్యవస్థకు సంబంధించి యూపీలోని వారణాసిలో జరిగిన అఖిల భారత పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐపీఈఎఫ్‌) సమావేశంలో పలు తీర్మానాలు చేసినట్లు.. జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.రత్నాకర్‌రావు తెలిపారు.
* తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వేదిక అధ్యక్షుడు రఘుమారెడ్డి బుధవారం లేఖ రాశారు.
*కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని ఓ ఓటరుపై చేయి చేసుకున్నారు. నియోజకవర్గంలో వైకాపా కార్యకర్తలు నగదు పంపిణీ చేపట్టగా.. డబ్బుల విషయంలో కార్యకర్తలు, ఓటర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో అక్కడే ఉన్న కొడాలి నాని ఓటరుపై చేయి చేసుకున్నారు.
*ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల దరఖాస్తు గడువును ఈనెల 20వరకు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె.సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ఏప్రిల్‌ 21వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు.
*నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని స్వాతంత్య్ర సమరయోధులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం విజయవాడ గవర్నర్‌పేటలోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ సైనికోద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.బి.జి.బాబు, సీనియర్‌ సిటిజన్ల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేమూరి బాబూరావు, మోతుకూరి వెంకటేశ్వరరావు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణులను విడనాడాలని కోరారు.
*ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) అభ్యర్థుల కోసం పీజీ వైద్యవిద్య సీట్లలో 10% సీట్లను కేటాయిస్తూ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు బుధవారం ఎంసీఐ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతమున్న పీజీ సీట్లకు అదనంగా ఈ 10% సీట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.