Devotional

ప్రారంభమైన దుర్గమ్మ బ్రహ్మోత్సవాలు

durga temple brahmotsavam begins

1.ప్రారంభమైన దుర్గమ్మ బ్రహ్మోత్సవాలు
ఇంద్రకీలాద్రిపై పసుపు కొట్టే కార్యక్రమంతో సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు. ఎనిమిది రోజులపాటు వివిధ రకాల వాహన సేవలతో వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలు. ఐదు రోజుల పాటు దుర్గా మల్లేశ్వర కళ్యాణ మహోత్సవం. పసుపు కొట్టే కార్యక్రమం లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మహిళలు.
2. యాదాద్రిలో భద్రత కట్టుదిట్టం
యాదాద్రి పుణ్యక్షేత్రంలో భద్రత పట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని ‘యాడా’ నిర్వాహకులు భావిస్తున్నారు. ఇటీవల కొందరు గర్భగుడిలోని స్వయంభువులను చిత్రీకరించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయగా..ఇందుకు బాధ్యులైన ఇద్దరిని పోలీసులు గుర్తించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మరోసారి అలాంటి సంఘటనలు జరగకుండా నిఘాను కట్టుదిట్టం చేయాలని ప్రాధికార సంస్థ, ఆలయ నిర్వాహకుల ఆలోచన. ఆలయ విస్తరణ పనుల్లో పాల్గొనే కార్మికులు, శిల్పకారులతో సహా సంబంధీకులు ఎవరైనా ఒకే మార్గం గుండా రాకపోకలు కొనసాగించేలా చేయనున్నారు. ఏ రోజుకు ఆ రోజు పనులపై నివేదికను అందజేయాలని స్తపతులను యాడా అధికారులు ఆదేశించారు. ఆదివారం క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన యాడా వైస్‌ఛైర్మన్‌ కిషన్‌రావు .. దేవస్థానం ఈవో గీతారెడ్డి, ఏసీపీ మనోహర్‌రెడ్డితో కలిసి ఆలయ పరిసరాలను సందర్శించారు.
3. తిరుమలలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం ఆదివారం వైభవంగా జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 11 వరకు శ్రీసీతారాములు, లక్ష్మణస్వామి, ఆంజనేయస్వామికి మందిరంలోని రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పండితులు వేద పారాయణం చేస్తుండగా పెద్దజీయంగార్‌ సమక్షంలో అర్చకులు తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 మధ్య శ్రీరామచంద్రుడుకి తిరువీధుల్లో హనుమంత వాహనసేవ ఘనంగా జరిగింది. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని బంగారు వాకిలి ఎదుట వైభవంగా నిర్వహించారు.
4కమనీయం.. సీతారాముల కల్యాణోత్సవం
భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా దేవదేవుడికి నీరాజనాలు పలికారు. శ్రీరామ నామాలను పఠిస్తూ కల్యాణాన్ని వీక్షించి తరించారు. ప్రతి దంపతులూ సీతారాముల్లా జీవించగలిగితే ధార్మికత వెల్లివిరిస్తుందని పండితులు చేసిన ప్రవచనాలు భక్తులను ఆనందడోలికల్లో తేలియాడించాయి. ఆదివారం కల్యాణానికి సంబంధించిన పూజలు మిథిలా మండపంలో వైభవోపేతంగా సాగాయి. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల అభిజిత్‌ లగ్నంలో కల్యాణం నిర్వహించారు. తిరు కల్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి విష్వక్సేనులవారి ఆరాధన చేశారు. పుణ్యాహ వచనం నిర్వహించి కల్యాణానికి ఉపయోగించే సామగ్రిని సంప్రోక్షణ చేశారు. రక్షా బంధనం నిర్వహించి సీతమ్మకు యోక్త్రధారణ చేశారు. సీతారాములకు రక్షా సూత్రాలను కట్టి స్వామి గృహస్థాశ్రమ సిద్ధి కోసం రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. తాంబూలాది సత్కారాలు చేసి కన్యావరణం నిర్వహించారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువు అని పెద్దలు నిర్ణయించి ఇరు వంశాల గోత్రాలను పఠించారు. కల్యాణ వైభవాన్ని చాటి చెప్పేలా చూర్ణికను పఠించి వేద మంత్రోచ్ఛారణ మార్మోగుతుండగా అభిజిత్‌ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాములశిరస్సుపై ఉంచడంతో జైశ్రీరామ్‌ అంటూ భక్తకోటి నీరాజనాలు పలికింది. మాంగల్య పూజలో సాధారణంగా రెండుసూత్రాలుంటాయి. భక్తరామదాసు తయారు చేయించిన పతకాన్ని కలిపి ధరింపజేయడం ఈ క్షేత్రం ఆచారం.
5. 17 నుంచి శ్రీవారికి వసంతోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఈనెల 17 నుంచి 19 వరకు వసంతోత్సవాలు తితిదే నిర్వహించనుంది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగుతూ వసంత మండపానికి వేంచేయనున్నారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేకం పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండో రోజు 18న ఉభయ దేవేరులతో కలిసి ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య స్వర్ణరథాన్ని అధిరోహించి తిరువీధుల్లో ఊరేగనున్నారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు 19న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారితో పాటు శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి మందిరానికి వేంచేయనున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం చేపడతారు. వసంతోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 17న సహస్రకలశాభిషేకం, 18న తిరుప్పావడ సేవ, 19న నిజపాద దర్శనం సేవలను రద్దు చేస్తున్నట్లు తితిదే తెలిపింది. 17 నుంచి 19 వరకు కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
6. కన్నులపండువగా శోభాయాత్ర
శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్రను కనుల పండువగా నిర్వహించారు. అప్పర్‌ ధూల్‌పేటలోని ఆకాశపురి హనుమాన్‌ ఆలయం నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు శోభాయాత్ర ప్రారంభమైంది. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ ఊరేగింపును ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ యాత్ర రెండు గంటల ఆలస్యంగా మొదలైంది. తొలుత వేలాదిగా పాల్గొన్న భక్తులకు దారి పొడవునా లక్షల మంది జతకలిశారు. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పాల్గొన్నారు.
7. శ్రీవారి సేవలో అనిల్‌ అంబానీ
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని రిలయన్స్‌ అడాగ్‌ గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో సతీమణి టీనా అంబానీ, తల్లి కోకిలా బెన్‌, కుమారులు అన్మోల్‌ అంబానీ, జై అన్షుల్‌ అంబానీతో కలిసి అనిల్‌ అంబానీ పాల్గొన్నారు. ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో శనివారం రాత్రి తిరుపతి చేరుకుని రహదారి మార్గంలో తిరుమలకు వచ్చి శ్రీకృష్ణ విశ్రాంతి సముదాయంలో బస చేశారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు.
8. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనం భక్తులకు 20 గంటల సమయం పడుతుంది300 రూ ప్రత్యేక ప్రవేశం కలిగినవారికి 2 నుండి 3 గంటల సమయం పడుతుంది.నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 86,173నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.06 కోట్లు.
9. చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 15
1452 : గణిత శాస్త్రజ్ఞుడు, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీత కళాకారుడు లియొనార్డో డావిన్సి జననం.(మరణం.1519)
1469 : భారత ఆధ్యాత్మిక గురువు, సిక్కుమత స్థాపకుడు గురునానక్ జననం.(మరణం . 1539)
1707 : లియొనార్డ్ ఆయిలర్, ప్రసిద్ధ స్విస్ గణిత శాస్త్రవేత్త జననం.(మరణం . 1783)
1865: అమెరికా పూర్వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ మరణం.(జననం.1909)
1925 : గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లా ను విడదీసి, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పరిచారు. అప్పటినుండి, గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా గా పేరు మార్చుకొంది
10. శుభమస్తు
తేది : 15, ఏప్రిల్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : దశమి
(నిన్న ఉదయం 9 గం॥ 35 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 7 గం॥ 7 ని॥ వరకు)
నక్షత్రం : ఆశ్లేష
(నిన్న ఉదయం 7 గం॥ 40 ని॥ నుంచి
ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 59 ని॥ వరకు)
యోగము : గండము
కరణం : గరజ
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 58 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 30 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 0 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 6 ని॥ వరకు)
గుళికలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 22 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 14 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 0 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 31 ని॥ లకు
సూర్యరాశి : మేషము
చంద్రరాశి : కర్కాటకము
11. వేణుగాన అలంకారంలో కోదండరాముడు
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం ఉదయం జగదభిరాముడు వేణుగానాలంకారంలో దర్శనమిచ్చారు. ఏకశిలానగరి వీధుల్లో పురుషోత్తముడి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి సీతారామలక్ష్మణమూర్తులను దర్శించుకున్నారు. రాత్రి హంస వాహనంపై కొలువుదీరిన స్వామి వారి ఊరేగింపు కనులపండువగా సాగింది. ఈ నెల 18న పౌర్ణమి వేళ రాత్రి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు తితిదే అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 60వేల మంది కూర్చుని జానకిరాముల పరిణయ ఘట్టాన్ని తిలకించేలా చలువ పందిళ్లు, గ్యాలరీలు, బారికేడ్లు నిర్మిస్తున్నారు. కల్యాణ వేదికను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.