Movies

ఐటెం పాటలతో

kriti sanon kalank item song

‘కళంక్‌’ చిత్రం… భారీ తారాగణంతో తెరకెక్కడమే కాదు అందులో కొంతమంది అందాల నాయికలు ప్రత్యేక గీతాలతో మోత మోగిస్తున్నారు. ‘ఫస్ట్‌ క్లాస్‌..’ అంటూ వరుణ్‌ధావన్‌తో కలిసి స్టెప్పులేసి కేక పెట్టించింది కియారా అడ్వాణీ. ఈ పాటకి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మరో బాలీవుడ్‌ నాయిక కృతి సనన్‌ ఐటెమ్‌ పాటతో సందడి చేస్తోంది. ‘ఐరా గైరా…’ అంటూ సాగే ఈ గీతంలో వరుణ్‌ ధావన్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌తో కలసి కృతి వేసే స్టెప్పులు కిర్రాకు పుట్టిస్తున్నాయి. ఈ విషయాన్ని కృతి ట్విటర్‌లో పంచుకొంది. ‘ఈ పాట చాలా ప్రత్యేకమైంది. థియేటర్లో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’అని ట్వీటింది. మహేష్‌బాబు సరసన ‘1: నేనొక్కడినే’లో నటించి వెండితెర ఎంట్రీ ఇచ్చిన కృతి బాలీవుడ్‌లో వరస చిత్రాలతో దూసుకుపోతుంది. ఈ మధ్యే ‘లుకా చుప్పీ’తో విజయం అందుకుంది. ‘స్త్రీ’లో ప్రత్యేక గీతంలో ఆడిపాడిన ఈ నాయిక ‘కళంక్‌’లోని పాటతోనూ అదరగొట్టిందంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. వరుణ్‌ధావన్‌, ఆలియా భట్‌, సంజయ్‌ దత్‌, మాధురీ దీక్షిత్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్‌ వర్మన్‌ తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.