Agriculture

ఈ ఏడాది బాగా తగ్గిన పత్తి దిగుబడి

cotton yield in india has fallen drastically

దేశీయంగా పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోవచ్చని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ (సీఐటీఐ) అంచనా వేస్తోంది. 2018-19 సీజన్‌లో పత్తి దిగుబడి 7.87 శాతం తగ్గి 343 లక్షల బేళ్లకు పరిమితంకావచ్చని భావిస్తున్నట్లు సీఐటీఐ చైర్మన్‌ సంజయ్‌ జైన్‌ వెల్లడించారు. 2018 సెప్టెంబరుతో ముగిసిన సీజన్‌లో పత్తి దిగుబడి 370 లక్షల బేళ్లుగా ఉంది. దేశవ్యాప్తంగా పత్తి పండించే ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొనటమే దిగుబడి తగ్గటానికి ప్రధాన కారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. గడచిన పన్నెండేళ్లలో సగటున పత్తి దిగుబడి కనిష్ఠంగా 348 లక్షల బేళ్లుగా ఉందన్నారు. పత్తి పండిస్తున్న ప్రాంతాల నుంచి వాస్తవిక గణాంకాలను తీసుకోవటం ద్వారా దిగుబడి గణాంకాలను రూపొందించినట్లు ఆయన చెప్పారు. కాగా ప్రస్తుత సీజన్‌లో పత్తి దిగుబడి 361 లక్షల బేళ్లుగా ఉంటుందని గత ఏడాది నవంబరులో కాటన్‌ అడ్వైజరీ బోర్డు అంచనా వేసింది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తన దగ్గర ఉన్న నిల్వలను విక్రయించితే పత్తి మార్కెట్లో నగదు లభ్యత పెరుగుతుందని ఆయన తెలిపారు. అయితే వచ్చే సీజన్‌కు సంబంధించి పత్తి దిగుబడి తగ్గితే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సీజన్‌లో గిట్టుబాటు ధర లభించటంతో మరింతమంది రైతులు పత్తి పంట వేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని, రుతుపవనాలు ఆశించిన స్థాయిలో పర్వాలేదని ఒకవేళ కరువు పరిస్థితి యథాతథంగా కొనసాగితే ఇబ్బందులు తలెత్తుతాయని జైన్‌ తెలిపారు. కాగా 2019-20లో అంతర్జాతీయంగా పత్తి దిగుబడి 6 శాతం పెరుగుతుందని అంతర్జాతీయ కాటన్‌ అడ్వైజరీ కమిటీ తన నివేదికలో వెల్లడించిందని ఆయన చెప్పారు. దిగుబడి పట్ల సానుకూల ధోరణులు ఉండటం, రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ఉంటాయని భారత వాతావరణ శాఖ ప్రకటించటంతో పత్తి ధరలు నిలకడగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు జైన్‌ వెల్లడించారు. గుజరాత్‌, మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ర్టాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనటంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోనుందని జైన్‌ తెలిపారు. దీంతో 2018-19 సీజన్‌కు సంబంధించి దిగుబడి అంచనాలను సవరించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అయితే దిగుబడి పట్ల తాము సానుకూల దృక్పథంతోనే ఉన్నామని, గత ఏడాది 40 లక్షలకు పైగా బేళ్లు నిల్వ ఉన్నాయన్నారు. ప్రస్తుత సీజన్‌ను 40 లక్షల బేళ్ల స్టాక్‌తో ప్రారంభించటంతో దిగుబడి కొద్దిగా తగ్గినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని జైన్‌ పేర్కొన్నారు.