ScienceAndTech

భారత సంతతి విద్యార్థి నమూనాకు నాసా ఆమోదం

nasa accepts indian origin researcher keshav raghavans cubesat

భారత సంతతికి చెందిన అమెరికా విద్యార్థి కేశవ్ రాఘవన్ (21) నేతృత్వంలోని బృందం రూపొందించిన క్యూబ్‌శాట్‌ను (కాస్మిక్ కిరణాలను గుర్తించేందుకు ఉద్దేశించిన చిన్న ఉపగ్రహం) అంతరిక్షంలోకి పంపేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎంపికచేసింది. యేల్ అండర్‌గ్రాడ్యుయేట్ ఏరోస్పేస్ అసోసియేషన్ (వైయూఏఏ)కు చెందిన రాఘవన్ బృందంతోపాటు మరో 15 బృందాలు అభివృద్ధి చేసిన క్యూబ్‌శాట్‌లను కూడా నాసా నింగిలోకి పంపనుంది. 2020, 2021, 2022లో ప్రయోగించ తలపెట్టిన పలు మిషన్‌లతోపాటు వీటిని రోదసిలోకి పంపనుంది. అమెరికాలో పీహెచ్‌డీ అందుకున్న తొలి ఆఫ్రికన్ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఏ బౌచెట్ పేరు మీద తాము అభివృద్ధి చేసిన క్యూబ్‌శాట్‌కు బీఎల్‌ఏఎస్-బ్లాస్ట్ (బౌచెట్ లో-ఎర్త్ ఆల్ఫా/బీటా స్పేస్ టెలిస్కోప్) అని రాఘవన్ బృందం నామకరణం చేసింది. సాధారణంగా క్యూబ్‌శాట్ ప్రాజెక్టుకు దాదాపు 30 వేల డాలర్లు అవసరమవుతాయని, తాము 13 వేల నుంచి 20 వేల డాలర్ల వ్యయంతోనే బ్లాస్ట్‌ను అభివృద్ధి చేశామని వైయూఏఏ ఉపాధ్యక్షుడు ఆండ్య్రూ క్రిజీవోజ్ తెలిపారు. క్యూబ్‌శాట్ కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత, సుదూర సూపర్‌నోవా నుంచి భూమివైపు ప్రయాణిస్తున్న కణాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుందని రాఘవన్ వివరించారు.