WorldWonders

ఎల్బీనగర్‌లో పులిచర్మం అమ్ముతుండగా…

tiger skin seized in hyderabad

పులిని చంపి, చర్మాన్ని విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర వన్యప్రాణుల వేట గాళ్లను నలుగురిని ఎల్బీనగర్, మల్కాజిగిరి ఎస్వో టీ పోలీసులు అరెస్టుచేశారు. పులిచర్మం, నాలుగు పులిగోర్లు, కారును స్వాధీనం చేసుకుని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సోమవారం నేరేడ్‌మెట్ పరిధిలోని రాచకొండ కమిషనరేట్‌లో సీపీ మహేశ్‌భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. పులిచర్మానికి, గోర్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఒడిశాకు చెందిన బసుదేవ్ మస్తి (23), జగన్నాథ్ సిసా (19), బలిపంగి (26) విద్యుత్ తీగ సాయంతో బుచపున్ అడవిలో మాటువేసి, నీటి కోసం వచ్చిన మూడు సంవత్సరాల పులిని చంపారని తెలిపారు. చర్మం, గోర్లు తీసుకుని విశాఖపట్టణానికి చెందిన నాగోత్ భాను (24) కారులో ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారని చెప్పారు. వాటిని అమ్మేందుకు ఎల్బీనగర్ మయూరి హోటల్‌లో బసచేయగా, సమాచారం అందుకున్న ఎల్బీనగర్, మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు కొంటామని నమ్మించి వారిని అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. పులిని చంపినవారిని పట్టుకున్న పోలీసులకు రివార్డులు అందజేశారు. సమావేశంలో మల్కాజిగిరి అదనపు డీసీ పీ ఎస్వోటి సురేందర్‌రెడ్డి, అటవీశాఖ అధికారి శివయ్య, అటవీరేంజ్ అధికారులు రవీందర్‌రెడ్డి, రమేశ్, ఎల్బీనగర్ సీఐలు నవీన్‌కుమార్, అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు అవినాశ్, రత్నం, శ్రీశైలం పాల్గొన్నారు.