NRI-NRT

మాకొద్దు అమెరికా. మాకు ముద్దు ఆస్ట్రేలియా.

indian students prefer australia over america for higher studies

అమెరికా వీసాలు కఠినతరం అవుతుండటం.. అక్కడ నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ విద్యార్థులు ఇతర దేశాల వైపు చూస్తున్నారు. రెండేళ్ల నుంచి ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ తదితర దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు కన్సల్టెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాలూ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భాషాపరమైన సమస్యలు వస్తాయని ఇంత కాలం ఐరోపా దేశాలకు పెద్దగా వెళ్లని మనవాళ్లు చదువు కోసం ఇటీవల ఆ దేశాలపైనా ఆసక్తి చూపుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ వచ్చినప్పటి నుంచే ఆ దేశం వెళ్లే విద్యార్థుల చూపు ఆంగ్లం మాట్లాడే ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిల్యాండ్‌ లాంటి దేశాల వైపు మళ్లింది. 2017 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల్లో 5,53,400 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు ప్రకటించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గత ఏడాది జులై నాటికి 90 దేశాల్లో 7,52,725 మంది ఉన్నట్లు వెల్లడించింది. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాకు 23,832 మంది, కెనడాకు 24 వేల మంది, కజకిస్థాన్‌కు, 6,100, జర్మనీకి 1,568, ఫ్రాన్స్‌కు 1000… ఇలా పలు దేశాలకు వెళ్లే వారు వేల సంఖ్యలోనే పెరుగుతున్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) సైతం 2019లో కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌ దేశాలకు భారత్‌ విద్యార్థుల వలస పెరుగుతుందని అంచనా వేసింది. ఉద్యోగాల్లోకి అమెరికన్లనే తీసుకుంటామని.. నిపుణులను మాత్రం ఇతర దేశాల వారిని నియమించుకుంటామని.. గత రెండేళ్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతూ వస్తున్నారు. దీనికితోడు విదేశీ విద్యార్థులకు అమెరికా వీసాల జారీ కఠినతరమైంది. తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తులూ అధికమయ్యాయి. చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకోవడానికి గతంలో ఉన్నంత వెసులుబాటు ఇప్పుడు లేదు. ఈ కారణాలతో భారత విద్యార్థులు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు అమెరికా కాకుండా ప్రత్యామ్నాయ దేశాలు వెళ్తున్నారు. దాంతో కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిల్యాండ్‌తోపాటు యూరప్‌ దేశాలకు డిమాండ్‌ పెరుగుతున్నట్లు అధికార గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ప్రస్తుతం ప్రతి 100 దరఖాస్తుల్లో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాకు 20 శాతం, బ్రిటన్‌కు 18-19 శాతం ఉంటున్నాయని హైదరాబాద్‌కు చెందిన వాల్మీకి విదేశీ కన్సల్టెన్సీ ప్రతినిధి సబ తెలిపారు. మిగిలిన వారిలో సింగపూర్‌, యూరప్‌ దేశాలకు వెళ్లే వారుంటున్నారని చెప్పారు. మన విద్యార్థులు కేవలం చదువు కోసమే విదేశాలకు వెళ్లడం లేదని నిపుణులు చెబుతున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఆ ఖర్చు రాబట్టుకోవడం, ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడే అవకాశాలను ప్రధానంగా చూస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. అందుకే విద్యార్థి వీసా సులభంగా ఉన్న ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల వైపు ఆసక్తి చూపే వారు పెరుగుతున్నారు. ఆయా దేశాల్లో చదువు పూర్తయిన తర్వాత రెండేళ్లపాటు వర్క్‌ పర్మిట్‌ ఉంటుంది. మరోవైపు భాష విషయంలో సమస్య ఉంటుందని తెలిసినా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివేందుకు జర్మనీ వెళ్లేవారూ పెరుగుతున్నట్లు కన్సల్టెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికా కంటే కెనడాలో సుమారు 20 శాతం, బ్రిటన్‌లో 40, ఆస్ట్రేలియాలో 10, ఐర్లాండ్‌లో 60-70 శాతం వరకు ఫీజులు తక్కువని పేర్కొంటున్నారు.