Movies

ఆయన్ను ఒక్క ఛాన్స్ అడిగాను

alia requests rajamouli for one chance says she has no callsheet issues

బాలీవుడ్‌లో ఇప్పుడు ఆలియా భట్‌ హవా నడుస్తోంది. ఓ పక్క విజయాలు… మరో పక్క భారీ చిత్రాల్లో అవకాశాలతో ఆలియా జోరు మీదుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘బ్రహ్మాస్త్ర’, ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, ‘ఇన్‌షా అల్లా’ చిత్రాలున్నాయి. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, సల్మాన్‌ కథా నాయకుడిగా సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘ఇన్‌షా అల్లా’ చిత్రాల్లో నటించే అవకాశం తనకు వస్తుందని ఆలియా అస్సలు ఊహించలేదట. ‘‘ఇద్దరూ గొప్ప దర్శకులే. వాళ్లు చేసే పనిమీద ఎంతో ముందు చూపు ఉన్న దర్శకులు వాళ్లు. సృజనాత్మకత విషయంలో వాళ్లిద్దరి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేద’’ని ప్రశంసించింది ఆలియా. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’తో తొలిసారి తెలుగు తెరపై కనిపించనుంది ఆలియా. అందుకోసం తెలుగు కూడా నేర్చుకుంటోంది. ‘‘తెలుగు పాఠాలు కష్టంగానే ఉన్నా త్వరగానే నేర్చుకుంటున్నాన’’ని చెప్పిందామె. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అవకాశం తనకు ఎలా వచ్చిందో చెబుతూ.. ‘‘ఓ రోజు ఎయిర్‌పోర్ట్‌లో రాజమౌళి సార్‌ను కలిశాను. ‘మీరు తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ఎలాంటి పాత్ర ఇచ్చినా నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఓ అవకాశం ఇవ్వండి’ అని ఆయన్ని అడిగాను. అప్పటికి ఇంకా కథానాయికల ఎంపిక కూడా పూర్తి కాలేదు. నాకు కాల్షీట్లకు ఇబ్బంది ఉండదు. అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటా అని ఆయనతో చెప్పాను’’అంది ఆలియా.