* స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ రూపాయి పతనాన్ని నమోదు చేసుకున్నది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, దిగుమతిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో రూపాయి నాలుగు నెలల కనిష్ఠానికి జారుకున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.70.32 వద్ద ముగిసింది.
Ø ఫైనాన్స్, ఇంధన, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ ఒక్కరోజు 490 పాయింట్ల లాభాన్ని కూడగట్టుకుంది. నిఫ్టీ మళ్లీ కీలకమైన 11700 పాయింట్ల స్థాయి ఎగువకు చేరింది. ఏప్రిల్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు దగ్గరపడటంతో మదుపర్లు షార్ట్‌కవరింగ్ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో తమ వంతు సహకారం అందించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు దన్నుగా నిలిచాయి.
Ø హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఔషధ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైనాలో ఒక ఔషధాన్ని విక్రయించడానికి అనుమతి సంపాదించినట్లు తెలిసింది. రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ఔషధమైన క్లోపిడోగ్రెల్ జనరిక్ ఔషధానికి చైనా నియంత్రణ సంస్థ నుంచి డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి వచ్చినట్లు పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తోంది
Ø ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.1014.19 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2017-18 ఇదే త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ.446.13 కోట్లే కావడం గమనార్హం.
Ø రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద మూలధన నిల్వలు ఎంత మేర ఉండాలనే అంశాన్ని నిర్ణయించేందుకు ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ జూన్ కల్లా తన నివేదిక సమర్పించనుంది.
Ø కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్ట్ అసెట్ మేనేజ్‌మెంట్‌కు నాలుగు హోటళ్లు, ఇతర ఆస్తులు విక్రయించరాదంటూ హోటల్ లీలావెంచర్‌పై మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ నిషేధం విధించింది. బెంగళూరు, చెన్నై, దిల్లీ, ఉదయ్‌పూర్‌లలో ఉన్న తన 4 హోటళ్లు; ఇతర ఆస్తులను రూ.3950 కోట్లకు బ్రూక్‌ఫీల్డ్‌కు విక్రయిస్తున్నట్లు మార్చి 18న హోటల్ లీలా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Ø మొబైల్ టవర్ల వ్యాపారంలో తన పూర్తి వాటాను రూ.2,500 కోట్లకు విక్రయించడం కోసం అమెరికన్ టవర్ కార్పొరేషన్(ఏటీసీ)తో టాటా టెలీసర్వీసెస్ చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Ø భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) దక్షిణ మధ్య ప్రాంతీయ మేనేజర్‌గా మిని ఐప్ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రాంత పరిధిలోకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు వస్తాయి.
Ø వరుసగా రెండు నెలల పాటు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రిటర్నులు దాఖలు చేయని వారు, జూన్ 21 నుంచి వస్తు రవాణాకు ఇ-వే బిల్లులు జారీ చేయకుండా నిషేధం విధిస్తామని ఆర్థిక శాఖ హెచ్చరించింది.
Ø ప్రభుత్వ విభాగాల్లో, ప్రజా రవాణా సంస్థల్లో విద్యుత్ వాహనాల వినియోగం పెంచేందుకు అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు ఈఈఎస్‌ఎల్ కృషి చేస్తోంది. దేశంలో తొలి దశలో మొత్తం 5 లక్షల విద్యుత్ కార్లను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాలని జాతీయ ఇ-మొబిలిటీ ప్రోగ్రాం ఇన్ ఇండియా 2018ని ప్రారంభించాం
Ø నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డ్)ల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిష్క్రమించింది. వాటిల్లో ఉన్న మొత్తం వాటాలను వరుసగా రూ.1450 కోట్లు; రూ.20 కోట్లకు ప్రభుత్వానికి విక్రయించింది.
Ø ఫ్లాట్లపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రేటు తగ్గడంతో కొత్తగా ప్రారంభమవుతున్న నిర్మాణాలకు గిరాకీ పెరుగుతోందని స్థిరాస్తి అధ్యయన సంస్థ అనరాక్ వెల్లడించింది. అంతేకాకుండా నిర్మాణం పూర్తయి, నివాసానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లపై కొనుగోలుదార్లు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని పేర్కొంది. స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) అమల్లోకి రావడం, జీఎస్‌టీ రేట్లు తగ్గడంతో కొత్త నిర్మాణాలపై కొనుగోలుదార్లకు నమ్మకం పెరుగుతోందని తెలిపింది.
Ø ర్మనీ విలాస కార్ల దిగ్గజం ఆడి ఎస్‌యూవీ క్యూ7, సెడాన్ ఏ4 మోడళ్లలో కొత్త వేరియంట్లను భారత విపణిలోకి విడుదల చేసింది. ఆడి క్యూ7 లైఫ్‌స్టైల్ వేరియంట్ ధర రూ.75.82 లక్షలుగా, ఏ4 లైఫ్‌స్టైల్ వెర్షన్ ధర రూ.43.09 లక్షలు (ఎక్స్-షోరూమ్ దిల్లీ)గా నిర్ణయించారు.
Ø ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తున్న క్లెన్‌స్టా తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి తమ ఉత్పత్తులను విడుదల చేసింది. ‘నీటి అవసరం లేని స్నానం, షాంపూ’లకు రెండు రాష్ట్రాల నుంచీ గిరాకీ అధికంగా ఉందనీ, ఈ నేపథ్యంలోనే ఈ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని క్లెన్‌స్టా వ్యవస్థాపకుడు, సీఈఓ పునీత్ గుప్తా తెలిపారు. వీటిని జుట్టు, శరీరంపై స్ప్రే చేసుకొని, రుద్ది, తువ్వాలుతో తుడుచుకుంటే సరిపోతుందని హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో తెలిపారు.