DailyDose

గ్లోబరీన ఘనకార్యం-తాజావార్తలు-04/26

60thousand bugs in globarena technologies software used during inter 2019 telangana resuls release

1. మీ సేవలకు లంచం!
అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రజలకు పౌరసేవలు, సంక్షేమ పథకాల లబ్ధిని అందించాల్సిన తెలంగాణ ‘మీసేవ’ కేంద్రాలు కొన్ని గాడి తప్పాయి. కొందరు దళారులు నిర్వాహకుల అవతారమెత్తి ప్రజలను దోచుకుంటున్నారు. మీసేవ కేంద్రాల్లో ఎ-కేటగిరీ సేవలకు రూ.35, బి-కేటగిరీ సేవలకు రూ.45 ఫీజు తీసుకోవాలి. అంతకు మించి అదనంగా తీసుకోవడానికి వీల్లేదు. కుల, ఆదాయ ధ్రువీకరణ దరఖాస్తు సమయంలో రూ.50 నుంచి రూ.80 వరకు తీసుకుంటున్నారు. రెండు పడక గదుల గృహాల దరఖాస్తు చేసేందుకు హైదరాబాద్‌లో ఒక్కొక్కరి నుంచి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేయడం గమనార్హం.

2. త్వరలో దిల్లీలో ధర్నా.
‘యాభై శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలనే డిమాండుతో రాజకీయ పార్టీలతో కలిసి త్వరలోనే దేశ రాజధానిలో ధర్నా చేస్తాం’ అని తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ‘స్వచ్ఛంద సంస్థలూ మాకు సహకరించేందుకు ముందుకొస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం తేవడానికి అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తామంటున్నాయి. కొవ్వొత్తుల ర్యాలీలూ చేస్తామంటున్నాయి’ అని వివరించారు. వీవీప్యాట్‌లపై దేశవ్యాప్తంగా ఉన్న మేధావులందరికీ లేఖలు రాయనున్నట్లు వెల్లడించారు.

3. మార్కులు పెరిగితే రుసుం వెనక్కి.
విద్యాశాఖ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఊరటనిచ్చే మరో నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ జవాబుపత్రాల పునఃపరిశీలనలో విద్యార్థులకు మార్కులు పెరిగితే వారు చెల్లించిన రుసుం వెనక్కి ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి నిర్ణయించారు. పరీక్ష తప్పినవారికి ఉచితంగా పునఃపరిశీలన జరపాలని ఇప్పటికే నిర్ణయించడం తెలిసిందే. ఇప్పటివరకు మార్కులు పెరిగినా రుసుం వెనక్కి ఇచ్చే విధానం లేదు. ఒక్కో జవాబుపత్రానికి రూ.600 చెల్లిస్తున్న విద్యార్థులు దానివల్ల నష్టపోతున్నారు.

4. కుమార్తెలకు ఉరేసి ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి.
సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలకు ఉరేసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘఘటన దుబ్బాక పురపాలిక పరిధిలోని లచ్చపేటలో చోటుచేసుకుంది. మృతులు రాజు(40), భవాని(9), లక్ష్మీ(5)గా గుర్తించారు. కాగా ఏడాది కిందట రాజు భార్య మృతి చెందింది. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

5. 60 వేల తప్పులు ?
గ్లోబరీనా టెక్నాలజీస్‌ సంస్థ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో తొలి నుంచి సమస్యలు ఉత్పన్నమవుతున్నా ఆ సంస్థ ప్రతినిధులు వాటిని సరిచేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అదే సమయంలో ఇంటర్‌బోర్డు అధికారులు పర్యవేక్షించకుండా నిర్లక్ష్యం చూపారు. మొత్తానికి ఇంటర్‌ ఫలితాల్లో సుమారు 60 వేల సమస్యలు వచ్చాయని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. అంటే అంత మంది మార్కుల మెమోల్లో తప్పులు దొర్లినట్లే. ఈ మేరకు తయారు చేసిన నివేదికను శుక్రవారం కమిటీ.. విద్యాశాఖకు అందజేయనుంది.

6. విచారణ కమిటీ నుంచి వైదొలగిన జస్టిస్‌ ఎన్వీ రమణ.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయిపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ నుంచి జస్టిస్‌ ఎన్వీ రమణ వైదొలగాలని నిర్ణయించారు. తాను ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యుడిలా ఉంటున్నానని, అందువల్ల విచారణ నిష్పాక్షికంగా జరగదేమోనని ఫిర్యాదుదారు జ్ఞఅనుమానం వ్యక్తంచేసిన నేపథ్యంలో ఆయన కమిటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంటున్నట్లు చెబుతూ సహచర న్యాయమూర్తులకు లేఖ రాశారు.

7. భాజపా గెలిస్తే.. రాహుల్‌దే బాధ్యత!
భాజపా తిరిగి అధికారంలోకి వస్తే.. అందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రమే బాధ్యులవుతారని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఆప్‌ మ్యానిఫెస్టో విడుదల సందర్భంగాను, అనంతరం విలేకరులతోను ఆయన మాట్లాడారు. పొత్తు విషయంలో కాంగ్రెస్‌పై కేజ్రీవాల్‌ విమర్శలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలన్న కోరికేమీ తమకు లేదని, అయితే దేశం కోసం ముందుకొచ్చి తమ స్థాయిలో ప్రయత్నించామన్నారు. ముందు అన్నిచోట్ల సీట్ల సర్దుబాటుకు కాంగ్రెస్‌ అంగీకరించిందని, తర్వాత దిల్లీ మినహా ఎక్కడా పొత్తు ఉండదని ప్రకటించిందన్నారు.

8. బలవంతుని శాసనం కాదు. అంతర్జాతీయ చట్టమే ముఖ్యం.
ప్రపంచ స్థితిగతులను బలవంతుని శాసనం నిర్ణయించకూడదని, అవి అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా నడిచే పరిస్థితులు మళ్లీ రావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అభిప్రాయపడ్డారు. ఆయన గురువారం ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో ముఖాముఖి చర్చలు జరిపారు. నగరానికి చేరువలోని ఓ ద్వీపంలో ఉన్న ఫార్‌ ఈస్ట్రన్‌ ఫెడరల్‌ యూనివర్సిటీ క్రీడల విభాగం భవనం ఇందుకు వేదికయింది. అమెరికా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి కలిసికట్టుగా పనిచేయాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చట్టమే చెల్లుబాటు కావాలని ఆకాంక్షించారు.

9. 39 దేశాలకు వీసా జారీని నిలిపేసిన శ్రీలంక.
ఈస్టర్‌ పర్వదినాన శ్రీలంకలో జరిగిన వరుసబాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో 39 దేశాలకు వీసా జారీని నిలిపివేసింది. ‘ శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్యా 39 దేశాలకు వీసా జారీ ప్రక్రియను నిలిపి వేశాం. భద్రతా చర్యల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నాం.కొన్ని రోజుల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇక్కడ జరిగిన వరుస దాడుల్లో నిందితులకు అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలున్నాయని విచారణలో వెల్లడైంది. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేలా మేం చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే వీసాల జారీని ఆపేశాం’ అని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి జాన్‌ అమరతుంగ వెల్లడించారు.

10. కోల్‌కతాపై రాజస్థాన్‌ విజయం.
ఐపీఎల్‌-12లో రాజస్థాన్‌కు నాలుగో విజయం. రియాన్‌ పరాగ్‌ (47), జోఫ్రా ఆర్చర్‌ (27 నాటౌట్‌) పోరాడడంతో గురువారం జరిగిన ఆసక్తికర పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ 3 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. దినేశ్‌ కార్తీక్‌ (97 నాటౌట్‌) విధ్వంసక విన్యాసాలతో మొదట కోల్‌కతా 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరుణ్‌ ఆరోన్‌ (2/20) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. పరాగ్‌, ఆర్చర్‌ల పోరాటంతో లక్ష్యాన్ని రాజస్థాన్‌… 19.2 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరోవైపు షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్లు అదరగొట్టారు. మిక్స్‌డ్‌ విభాగంలో రెండు స్వర్ణాలు కొల్లగొట్టారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మను బాకర్‌, సౌరభ్‌ చౌదరి జోడీ పసిడి సాధించగా.. ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో దివ్యాంశ్‌ పన్వర్‌, అంజుమ్‌ మౌద్గిల్‌ జంట స్వర్ణం ఖాతాలో వేసుకుంది…