NRI-NRT

నాట్స్ 2019 సందర్భంగా ముగ్గుల పోటీలు

nats 2019 irving special muggula competition

అమెరికాలోని డాలస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆధ్వర్యంలో ఈ ఏడాది మే నెలలో అమెరికా తెలుగు సంబరాలు జరగనున్నాయి. సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ముందుస్తుగా నాట్స్‌ బృందం అనేక పోటీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 23న నాట్స్ డాలస్ విభాగం ముగ్గుల పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారు తమలోని సృజనాత్మకతను ముగ్గుల రూపంలో చూపించారనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా భవిష్యత్‌ తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ పేర్కొన్నారు. రానున్న నాట్స్‌ సంబరాల్లో తెలుగు కుటుంబాలవారు అందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు. ‘భాషే రమ్యం సేవే గమ్యం’ అనే నాట్స్‌ నినాదానికి దగ్గరగా ఉన్న సుందరమైన చిత్రాన్ని ముగ్గు రూపంలో ప్రదర్శించిన గాయత్రి ఆలూరు ఈ ముగ్గుల పోటీల్లో విజేతగా నిలిచారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రతిబింబిస్తూ సంతోషి విశ్వనాథుల వేసిన సుందరమైన ముగ్గు రెండో స్థానం దక్కించుకుంది. భారత జాతీయ పక్షి నెమలిని అందంగా తమ ముగ్గులో వేసి, ఆహుతుల మనసులు గెలిచిన శ్రీవాణి హనుమంతు మూడవ స్థానంలో నిలిచారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ విజేతగా గుర్తిస్తున్నట్లు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన జ్యోతి వనం, శ్రీలక్ష్మి మండిగ సంయుక్తంగా ప్రకటించారు. ఈ సంబరాల్లో భాగంగా మహిళల జీవన సమతుల్యత ప్రాముఖ్యతను వివరించేందుకుగాను వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు నారీ సదస్సు సమన్వయకర్త రాజేశ్వరి ఉదయగరి తన సందేశంలో పేర్కొన్నారు. నారీ సదస్సు సభ్య బృందం రాధ బండారు, గాయత్రి గిరి, లావణ్య ఇంగువ, వాణి ఐద, ప్రత్యూష మండువ, పద్మశ్రీ తోట ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించారు. నాట్స్‌ ఆధ్వర్యంలో తెలుగు సంబరాలను మే 24 నుంచి 26 వరకు డాలస్‌లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించేందుకుగాను ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబరాల నిర్వహణ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సంబరాల్లో భాగంగా ‘మనమంతా తెలుగు -మనసంతా వెలుగు’ ఇతివృత్తం ఆధారంగా మూడురోజుల పాటు కన్నుల పండువగా పలురకాల కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, ఎం.ఎం. కీరవాణి, గాయకుడు మనో ఆధ్వర్యంలో సంగీత కచేరీలు, ప్రత్యేక ఆకర్షణగా శివారెడ్డి మిమిక్రీ, ఉత్తమ సాహితీవేత్తలతో చర్చలు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబరాల కమిటీ వివరించింది. సంబరాల కమిటీ కన్వీనర్ కిశోర్ కంచెర్ల, కమిటీ సంయుక్త కన్వీనర్ విజయ శేఖర్ అన్నె, వైస్ కన్వీనర్స్ ఆది గెల్లి, ప్రేమ్ కలిదిండి, రాజేంద్ర మాదాల (కార్యదర్శి), బాపు నూతి (కోశాధికారి), మహేశ్ ఆదిభట్ల (సంయుక్త కార్యదర్శి), విజయ్‌వర్మ కొండ (క్రయవిక్రయ నిర్దేశకుడు), భాను లంక (ఆతిథ్యం నిర్దేశకుడు), కిషోర్ వీరగంధం (వ్యవహారాల నిర్దేశకుడు), రామిరెడ్డి బండి (కార్యక్రమ నిర్దేశకుడు), చినసత్యం వీర్నపు (టాంటెక్స్ అధ్యక్షుడు) తదితరులు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని మహిళలను అభినందించారు.