NRI-NRT

గాంధీ ఆసుపత్రికి ఎలిజబెత్ కోడలు

sophie helen rhys-jones to visit gandhi hospital

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కోడలు సోఫీ హెలెన్‌ రైస్‌-జోన్స్‌ సోమవారం (ఈ నెల 29న) సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఈ మేరకు ఆసుపత్రి పాలనాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘క్వీన్‌ ఎలిజబెత్‌ డైమండ్‌ జూబ్లీ ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో చిన్నారుల కంటి శుక్లాలకు సంబంధించిన ఆర్‌ఓపీ (రెటినోపతి ఆఫ్‌ ప్రీమెచ్యూరిటీ) సేవలు అందిస్తున్నారు. ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 2015 నుంచి సుమారు 4,000 మంది చిన్నారులకు వైద్యాన్ని అందించారు. మన దేశంలో నాలుగు రాష్ట్రాల్లో ట్రస్ట్‌ సేవలను అందిస్తుండగా.. తెలంగాణలో గాంధీ, నిలోఫర్‌లతోపాటు నల్గొండ, సంగారెడ్డి కేంద్రాల్లో సేవలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ట్రస్ట్‌కు వైస్‌ ప్యాట్రన్‌ అయిన సోఫీ హెలెన్‌.. గాంధీ, నిలోఫర్‌లతోపాటు ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రిని సందర్శించనున్నారు. గాంధీలో అందుతున్న ఆర్‌ఓపీ సేవలను ఆమె పరిశీలించనున్నట్లు సంబంధిత వైద్యులు తెలిపారు.