Sports

రాజకీయాల్లో అదో రకమైన ఉత్తేజం ఉందబ్బా!

gambhir says he is new to politics but not to a game

తనకు రాజకీయాలు కొత్త అని, వివాదాలపై ఎలా ప్రతిస్పందించాలో తనకు ఒక్కోసారి అర్థం కావట్లేదని టీమిండియా మాజీ క్రికెటర్‌, తూర్పు దిల్లీ భాజపా అభ్యర్థి గౌతం గంభీర్‌ (38) అంటున్నారు. ఆయన పోటీకి అనర్హుడని, మధ్య‌ దిల్లీ పార్లమెంటు నియోజక వర్గంలోని రెండు చోట్ల నుంచి గంభీర్‌కు ఓటు హక్కు ఉందని ఆప్‌ నేత అతిషి ఆరోపించిన విషయం తెలిసిందే. కరోల్‌ బాఘ్‌, రాజేందర్ ‌నగర్‌ ప్రాంతాల నుంచి ఆయన పేరు ఓటరుగా నమోదై ఉందని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సోమవారం ఓ ఇంటర్వ్యూలో గంభీర్‌ ఈ విషయాలపై మాట్లాడుతూ… ‘ఇటువంటి పరిస్థితులు నాకు కొత్త. ఎలా స్పందించాలో నాకు తెలియదు. నా ముందు ఉన్న పరిస్థితులు చాలా తేలికగా ఎదుర్కోగలిగినవని నేనేం భావించట్లేదు. అయితే, సవాళ్లు స్వీకరించడానికి నేను సిద్ధం. నేను ఇప్పటికే మీడియా ముందు చాలా సార్లు స్పష్టం చేశాను. మేము సానుకూల రాజకీయాలు చేయాలనుకుంటున్నాం.. అభివృద్ధి కోసం పాటుపడాలని భావిస్తున్నాం. తప్పుడు హామీలు ఇవ్వడం కన్నా ఈ ప్రాథమిక విషయాలు పాటించడం చాలా ముఖ్యం’ అని తెలిపారు. ‘కేవలం ఒక నెల క్రితమే నేను భాజపాలో చేరాను. రాజకీయాల్లో నేను పూర్తిగా కొత్త వాడిని. క్రికెట్‌ కన్నా రాజకీయాల్లో చాలా భిన్నమైన సవాళ్లు ఉంటాయి. కానీ, ఇవి కూడా చాలా ఉత్తేజపూరితంగా ఉన్నాయి. క్రికెట్‌ ఆడే సమయంలో జట్టుకి విజయాన్ని గెలుపుని అందించి, ప్రజల్లో ఆనందాన్ని చూడాలని మేము భావిస్తాం. రాజకీయాల్లో ఉంటే ప్రజల జీవితాలను కూడా మార్చవచ్చు. ఇదే ఉద్దేశంతో నేను ఉన్నాను. దేశ భద్రత అంశాన్ని భాజపా ఎన్నికల నేపథ్యంలో వినియోగిస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. దేశ భద్రత అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది జాతీయ అజెండా లేదా ఎన్నికల అంశంగా ఎందుకు ఉండకూడదు? గతంలో భారత్‌లో దాడులు జరిగిన సమయంలో పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం మనకు వచ్చింది. అయినప్పటికీ ఆ పని చేయలేదు. ఉరీ, పుల్వామా ఉగ్రదాడులు జరిగిన తర్వాత ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నారు’ అని గంభీర్‌ వ్యాఖ్యానించారు.