Business

టీసీస్‌పై కంప్యూటర్ సర్వీసెస్ కార్ప్ దావా

tcs faces lawsuit from csc over software theft

దేశీయ సాఫ్ట్‌వేర్‌ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీపై మరో కేసు దాఖలైంది. ఐదేళ్ల వ్యవధిలో వ్యాపార రహస్యాలను దొంగిలించిందనే అభియోగంపై దాఖలైన రెండో కేసు ఇది. అమెరికాకు చెందిన కంప్యూటర్‌ సర్వీస్‌ కార్ప్‌ ఈ ఆరోపణలు చేసింది. బీమా రంగానికి చెందిన సేవలు అందించే సాఫ్ట్‌వేర్‌ తయారీ కోసం అవాఛనీయ విధానంలో సోర్స్‌కోడ్‌ను దొంగిలించిందని పేర్కొంది. గత ఏడాది టీసీఎస్‌ ట్రాన్స్‌ అమెరికాకు బీమారంగ సేవల ప్లాట్‌ఫారమ్‌ తయారు చేసి ఇచ్చేందుకు జనవరిలో అంగీకరించింది. ఈ కాంట్రాక్టు విలువ రెండు బిలియన్‌ డాలర్లు. టీసీఎస్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద కాంట్రాక్టు. ఈ క్రమంలో టీసీఎస్‌ అక్రమంగా తమ సోర్స్‌కోడ్‌ను వాడుకొందని సీఎస్‌సీ ఆరోపించింది. దీనిపై టీసీఎస్‌ ప్రతినిధి మాట్లాడుతూ టీసీఎస్‌ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని తెలిపారు. కోర్టులో మా వాదనలను బలంగా వినిపిస్తామని పేర్కొన్నారు. ఈ కేసుపై అమెరికాలోని టెక్సాస్‌ న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. సీఎస్‌సీ తన వాన్టేజ్‌, సైబర్‌ లీఫ్‌ సాఫ్ట్‌వేర్లకు సంబంధించి ట్రాన్స్‌ అమెరికా అనుబంధ కంపెనీ అయిన మనీసర్వీస్‌ ఐఎన్‌సీకి లైసెన్స్‌ ఇచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లనే టీసీఎస్‌ దుర్వినియోగం చేసిందని సీఎస్‌సీ చెబుతోంది. 2014లో అమెరికాకు చెందిన ఎపిక్‌ సిస్టమ్స్‌ టీసీఎస్‌పై ఇటువంటి ఆరోపణలనే చేసింది. టీసీఎస్‌కు చెందిన ఉద్యోగి 6,000 పేజీల సమాచారాన్ని తస్కరించారని పేర్కొంది. ఈ కేసులో చివరికి 420 మిలియన్‌ డాలర్లను ఎపిక్‌ సిస్టమ్స్‌కు చెల్లించాలని తీర్పు వెలువడింది. దీనిపై టీసీఎస్‌ ప్రస్తుతం అప్పీలుకు వెళ్లేందుకు సిద్ధమైంది.