Politics

గ్లోబరీనా సూత్రధారి కేటీఆర్!

revanth slams ktr over globarena issue that lead to 20 inter students death in telangana

ఇంటర్‌ బోర్డు నిర్వహణ పూర్తిగా లోపభూయిష్ఠంగా ఉందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గ్లోబరీనా సంస్థకు టెండర్‌ ఇప్పించింది అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆరేనని ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సెంటర్‌ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ను కాదని ఓ ప్రైవేట్‌ సంస్థకు ఇంటర్‌ ఫలితాల బాధ్యతలు ఎలా అప్పగించారు. గతంలో ఒక్కో బాధ్యతను ఒక్కో విభాగానికి అప్పగించే వారు. ఇప్పుడు మాత్రం హాల్‌ టికెట్లు, ముద్రణ, ఫలితాల ప్రకటన అన్నింటినీ గ్లోబరీనాకు అప్పగించారు. ఫలితాల ప్రకటన సీజీజీ నిర్వహించినన్ని రోజులూ ఎలాంటి సమస్యలు రాలేదు. 2016లో ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీకేజీలో ఏం జరిగిందో వివరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ వ్యవహారంలో మూడేళ్లలో మీరెందుకు చర్యలు తీసుకోలేదు? ఆనాడు ఈ టెండర్‌ తీసుకున్నమ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ సంస్థపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎందుకు విజయారావును మీరు విచారించలేదు. విజయారావు అల్లుడు, కేటీఆర్‌ క్లాస్‌మెట్‌ అయిన ప్రద్యుమ్నను మీరు ఎన్నడూ ప్రశ్నించలేదు?. అక్కడ ఈ రకమైన తప్పిదాలకు పాల్పడి తప్పించుకున్నసంస్థ తిరిగి ఇంటర్‌ బోర్డు టెండర్లలో పాల్గొంది. టెండర్లలో పాల్గొన్నవి రెండే సంస్థలు.. ఒకటి మ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌, రెండోది గ్లోబరీనా. రెండు లక్షలకు తక్కువగా టెండర్‌ వేసిందని గ్లోబరీనాకు ఇంటర్‌ టెండర్లు అప్పగించారని ప్రభుత్వం చెబుతోంది. గతంలోనే మ్యాగ్నటిక్‌ సంస్థను ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ బోర్డులు నిషేధించాయి. నిషేధించిన సంస్థ టెండర్‌ ఎక్కువగా ఉందని.. గ్లోబరీనా సంస్థ టెండర్‌ తక్కువగా ఉందని చెబుతున్నారంటే.. ఇందులో మోసం జరిగిందని తెలుస్తోంది. 23 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన గ్లోబరీనా సంస్థ, మ్యాగ్నటిక్‌ సంస్థలు.. ఈ రెండూ కలిసి కాకినాడ జేఎన్‌టీయూను మోసం చేశాయి. వీరిద్దరూ వ్యాపార భాగస్వాములు. వీళ్లందరూ ఒక్కటే.. కంపెనీల పేరు మాత్రమే వేరు. ఇన్ని నియమనిబంధనలు ఉల్లంఘించి గ్లోబరీనా సంస్థకు టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు?’ అని రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.