Kids

ఆడంబరాలు చూపి గేలి చేయకూడదు

kids shouldnt show off to embarrass others

‘ఏంట్రా చింటూ, బంటీ! బుజ్జిని ఏడిపిస్తున్నారంట’ అడిగాడు తాతయ్య.
‘అవును తాతయ్యా. వాళ్ల దగ్గరున్న కేరమ్‌ బోర్డు, గేమింగ్‌ యాప్‌లను చూపించి అవి నా దగ్గర లేవని ఎగతాళి చేస్తున్నారు. నేను ఏడుస్తుంటే వాళ్లు నవ్వుతున్నారు.’ చెప్పింది బుజ్జి.
‘అలా చేయడం తప్పు కదరా పిల్లలూ. అలా చేసి ఏకంగా ఓ రాజే నవ్వుల పాలయ్యాడు. ఆ కథ చెబుతా వినండి’ అంటూ చెప్పడం మొదలెట్టాడు తాతయ్య.
ఈ కథ మహాభారతం అరణ్యపర్వంలో ఉంది. మహాభారతంలో దుర్యోధనుడి గురించి తెలుసుకదా. పాండవులంటే అతనికి చాలా కోపం. వాళ్లను పాచికల ఆటలో మాయచేసి ఓడించి అడవులకు పంపుతాడు.
పాండవులు తల్లి, భార్య సహా ద్వైతవనం అనేచోట నివాసం ఉంటారు. ఆ అడవుల్లో కూడా పాండవులంతా ఆనందంగా ఉన్నారని తెలుసుకుని దుర్యోధనుడు అసూయ పట్టలేకపోతాడు. పాండవులున్న ద్వైతవనానికి వెళ్లి వాళ్లకు తన హంగూ ఆర్భాటమూ చూపించి వాళ్లను బాధపెట్టాలని నిర్ణయించుకుంటాడు.
తోవలో ఉన్న ఆవులు, ఎద్దులను లెక్కించడానికి వెళుతున్నట్లు తండ్రి ధృతరాష్ట్రుడికి చెప్పి మందీ మార్బలంతో వనానికి బయల్దేరాడు. ద్వైతవనం ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.
దుర్యోధనుడి వెంట చాలామంది సేవకులు కూడా వెళ్లారు. తన సేవకులను పిలిచి ద్వైతవనం ప్రాంతంలో అందరూ హాయిగా ఆడుకోడానికి క్రీడా మండపాలను నిర్మించి రమ్మన్నాడు
దుర్యోధనుడు.
సమీపంలో ఉన్న పాండవులకు కనిపించేలా క్రీడాప్రాంగణాలను నిర్మించి తన గొప్పదనం చాటుకోవాలని, పాండవులు కుమిలిపోయేలా చేయాలన్నది దుర్యోధనుడి ఆలోచన.
అప్పటికే ద్వైతవనం సరస్సు ఒడ్డున ధర్మరాజు ఒక యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే అక్కడికి సమీపంలో గంధర్వులు కొందరు విహారానికి వచ్చారు.
దుర్యోధనుడి సేనలు క్రీడా మండపాలను నిర్మించబోతుంటే గంధర్వులు అడ్డుకున్నారు. దీంతో దుర్యోధనుడి సేనలు వారితో యుద్ధం చేశాయి. గంధర్వులు కౌరవ సేనలను ఓడించారు.
అప్పుడు దుర్యోధనుడే స్వయంగా యుద్ధానికి వచ్చి గంధర్వుల రాజైన చిత్రసేనుడి చేతిలో ఓడిపోయి, వారికి బందీగా చిక్కాడు. దీంతో భయపడిన దుర్యోధనుడు అదే వనంలో ఉన్న పాండవులను రక్షించమని వేడుకున్నాడు.
అప్పుడు పాండవులు వచ్చి గంధర్వులకు నచ్చజెప్పి శరణన్న దుర్యోధనుణ్ణి రక్షించారు.
‘చూశారా పిల్లలూ! పాండవులను బాధ పెట్టాలని ప్రయత్నించిన దుర్యోధనుడు ఎలా నవ్వులపాలయ్యాడో. ‘కాగల కార్యం గంధర్వులే తీర్చారు’ అనే నానుడికి మూలం ఈ సంఘటనే. మనం కూడా ఎవ్వరినీ ఏడిపించాలని అనుకోకూడదు. చేతనైతే సహాయం చేయాలి తప్ప మనకున్న డబ్బు, వస్తువులను చూపి వారిని చిన్నబుచ్చకూడదు.అర్థమైంది కదా.’ అన్నాడు తాతయ్య.
‘అర్థమైంది తాతయ్యా. మేమంతా ఇకపై అలాంటి పనులు చేయం. బుద్ధిగా ఉంటాం’ అన్నారు చింటూ బంటీ.