Kids

సెల్‌ఫోన్‌తో దొంగలను పట్టుకోవచ్చు

smartphones uses to catch thieves

ఎనిమిదో తరగతి చదివే గోపాల్‌ స్కూల్‌ బస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. గోపాల్‌కి కొంచెం దూరంలో, ఒకతను నింపాదిగా అటూ ఇటూ చూస్తూ, ఎవరూ తనను గమనించట్లేదనుకున్నాక నేలమీదకి చేతి రుమాలు జారవిడిచి ఏదో అందుకుని జేబులో పెట్టుకోవడం కనిపించింది. అంతే… క్షణం ఆలోచించకుండా తన జేబులోంచి సెల్‌ ఫోన్‌ తీసి అతని ఫొటో తీసి పెట్టుకున్నాడు. అతను వెళ్లిపోయాక కాసేపటికి ఒకాయన ఆటోలోంచి కంగారు పడుతూ దిగాడు. అక్కడంతా వెతకసాగాడు. గోపాల్‌ ఆయన దగ్గరకెళ్లి విషయం అడిగాడు. అడిగింది పిల్లాడైనా, సంకోచించకుండా ‘నా పేరు చంద్ర. ఇందాక ఇక్కడే ఆటో ఎక్కా, కొంత దూరం వెళ్లాక చూసుకుంటే పర్సు లేదు. అది ఇక్కడే పడి ఉంటుందని వెంటనే అదే ఆటోలో వెనక్కొచ్చేశా. అందులో నా జీతం డబ్బుతో పాటు, ముఖ్యమైన కార్డులున్నాయి.’ అంటూ పర్సు వెతుకుతూ ఏడుస్తూ చెప్పాడు. ఇదంతా విని గోపాల్‌ ‘అంకుల్‌ బాధపడకండి. ఇందాక ఒకతను అనుమానంగా కనిపిస్తే ఫొటో తీశా, బహుశా అతను తీసుకున్నది మీ పర్సు అయి ఉండొచ్చు’ అని చెప్పాడు. ఇద్దరూ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి జరిగింది చెప్పి గోపాల్‌ తీసిన ఫొటో చూపించారు. ‘ఈ వ్యక్తి ఓ చిల్లర దొంగ.. ఎక్కువసేపు కాలేదు కాబట్టి ఎక్కువ దూరం వెళ్లి ఉండడు’ అని ఇద్దరు కాన్‌స్టేబుల్స్‌కి ఆ వ్యక్తిని పట్టుకు రమ్మని పురమాయించాడు ఎస్సై.వెళ్లిన ఇద్దరు పోలీసులు పావుగంటలో ఆ వ్యక్తిని పట్టుకొచ్చారు. పర్సు తీసుకుని చంద్రకిచ్చారు. ‘ఫొటో తీయడం వల్లే ఈ పని సులువైంది’ అంటూ గోపాల్‌ని ఎస్సై ఎంతో మెచ్చుకున్నాడు. వెంటనే గోపాల్‌ తండ్రికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. ఆయన ‘గోపాల్‌ ఎప్పటి నుంచో ఫోన్‌ కొనివ్వమని అడుగుతున్నాడు. ఫోన్‌ కొనిస్తే మంచి ప్రవర్తనతో చక్కగా చదువుకునే గోపాల్‌ ఎక్కడ పాడైపోతాడో అని భయపడుతూనే ఫోన్‌ కొనిచ్చా. కానీ ఈ సంఘటనతో మా వాడిపై పూర్తి నమ్మకం కలిగింది’ అంటూ బదులిచ్చాడు. ‘మీరన్నది నిజమే ఆధునిక సాంకేతికతతో కొంతమంది చెడిపోతుంటే, మీ పిల్లాడి లాంటి వాళ్లు తమ అభివృద్ధి, సమాజం కోసం ఉపయోగిస్తారు. మీ ఇద్దరికీ థాంక్స్‌’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. గోపాల్‌ని స్కూలుకి తీసుకెళ్లి దింపి, గోపాల్‌ చేసిన పని గురించి ప్రిన్సిపల్‌కి తెలియజేయమని కాన్‌స్టేబుల్‌కి చెప్పి పంపించాడు ఎస్సై.