Health

చెవిలో నిత్యం జోరీగ శబ్దం వస్తోందా?

That Continuous Buzzing Sound In Ears And How To Tackle It

వయసు మీద పడుతున్న కొద్దీ లోపలి చెవిలో సూక్ష్మ కేశాలు దెబ్బతిని వినికిడిలోపం తలెత్తుతుంటుంది. కొందరికి శ్రవణనాడి దెబ్బతినటం వల్ల వినికిడి లోపం (హైటోన్‌ సెన్సోరీన్యూరల్‌ హియరింగ్‌ లాస్‌) రావొచ్చు. లోపలి చెవిలోకి శబ్దాలు సరిగా ప్రవేశించలేకపోవటం వల్ల కూడా వినికిడి లోపం (కండక్టివ్‌ హియరింగ్‌ లాస్‌) రావొచ్చు. వీరిలో కర్ణభేరి వెనకాల ఉండే మూడు ఎముకల్లో (స్టేప్స్‌) ఒకటి గట్టిపడి కంపించటం ఆగిపోతుంది. కారణమేదైనా గానీ వినికిడి లోపం మూలంగా కొన్నిసార్లు చెవుల్లో ఇతరత్రా శబ్దాలేవో వినబడుతున్నట్టు అనిపిస్తుంటుంది. మీది ఇలాంటి సమస్యగానే అనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటివారికి కర్ణభేరి మామూలుగానే ఉంటుంది. కొన్నిసార్లు జలుబు చేసినపుడు ముక్కుకూ చెవికీ మధ్యన ఉండే గొట్టం (యూస్టేషన్‌ ట్యూబ్‌) మూసుకుపోతుంటుంది. దీంతో కర్ణభేరి వెనకాల ద్రవం చేరుకుంటుంది. దీని వల్ల కూడా శబ్దాలు వినబడుతుండొచ్చు. నిజానికి గొట్టం మూసుకుపోవటం ఎక్కువరోజులుండదు. సుమారు 2-6 వారాల్లో ద్రవం ఎండిపోయి తిరిగి మామూలు స్థాయికి చేరుకుంటుంది. కానీ మీరు రెండేళ్లుగా శబ్దాలు వినబడుతున్నాయని అంటున్నారంటే ఇలాంటి సమస్యేమీ లేదనే అనిపిస్తోంది. ఏదేమైనా ఒకసారి పరీక్షించుకోవటం మంచిది. కర్ణభేరి మామూలుగా ఉంటే ద్రవమేమీ లేదనే అనుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా మధ్యచెవిలో ద్రవం ఎక్కువ రోజులుంటే దాన్ని మైక్రోస్కోపీ ద్వారా తొలగించి, చిన్న గొట్టాన్ని (వెంటిలేషన్‌ ట్యూబ్‌) పెట్టాల్సి వస్తుంది. ఆడియోగ్రామ్‌ పరీక్ష చేస్తే వినికిడి లోపమేమైనా ఉందా? ఉంటే అది కండక్టివ్‌ రకమా? నాడి దెబ్బతినటం వల్ల వచ్చిందా? అనేవి బయటపడతాయి. వినికిడిలోపానికి పెద్దగా మందులేవీ ఉండవు. మధ్య చెవి ఎముక గట్టిపడిపోవటం వల్ల వినికిడిలోపం తలెత్తితే సర్జరీతో (స్టేపిడెక్టమీ) సరిచేయొచ్చు. ఇందులో గట్టిపడి కదలకుండా ఉండిపోయిన ఎముకను తొలగించి దాని స్థానంలో కృత్రిమ పరికరాన్ని (టెఫ్లాన్‌ పిస్టన్‌) అమరుస్తారు. ఇది మూడో ఎముకలాగా పనిచేస్తుంది. ఇక నాడి దెబ్బతిని వినికిడిలోపం తలెత్తితే.. సమస్య ఒకవైపే ఉందా? రెండు వైపుల ఉందా? అనేది కీలకం. ఒక చెవి సరిగా వినబకపోతే ఎలాగోలా సర్దుకు రావొచ్చు. రెండు చెవుల్లోనూ సమస్య ఉంటే ఒక చెవిలో వినికిడి సాధనాన్ని అమర్చుకోవచ్చు. వినికిడిలోపం మరీ తీవ్రంగా ఉంటే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చాల్సి ఉంటుంది. నాడులు దెబ్బతినటం వల్ల ఒకవైపుననే వినికిడిలోపం ఉన్నట్టయితే ఎంఆర్‌ఐ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే శ్రవణనాడి మీద పుట్టుకొచ్చే మామూలు కణితులు కూడా కొన్నిసార్లు వినికిడి లోపంతోనే బయటపడుతుంటాయి. తల తిప్పటానికి దారితీసే మేనియర్స్‌ సమస్య ఉన్నవారిలోనూ కొన్నిసార్లు చెవిలో శబ్దాలు వస్తుండొచ్చు. కాబట్టి చెవి పరీక్ష, వినికిడి పరీక్ష చేసి సమస్య ఏంటన్నది కచ్చితంగా నిర్ధరించటం చాలా కీలకం. అప్పుడే సరైన చికిత్స చేయొచ్చు.