Agriculture

కూరగాయ విత్తనాల ధరలతో రైతులు విలవిల

Vegetable Seed Prices Driving Farmers Crazy In India

విత్తన రంగంలో ప్రైవేటు కంపెనీల అధిపత్యం పెరగడంతో కూరగాయల విత్తనాల ధరలకు రెక్కలొచ్చాయి. టమాటా, మిర్చి,బీర, సొర, బొప్పాయి, పండ్ల విత్తనాలు, ఆయిల్ సీడ్స్ అన్నింటి ధరలూ విపరీతంగా పెరిగియి.విత్తనాలు పండించే రైతుల నుంచి తక్కువ ధరకు కొని.. గ్రేడింగ్ చేసి రంగుల ప్యాకెట్లలో ఎక్కువ ధరలకు అమ్ముతున్నాయి కంపెనీలు. దీంతో విత్తనాలు పండించిన రైతులు నష్టాలపాలవుతుండగా… మార్కెట్ చేసుకున్న కంపెనీలు కోట్లు వెనకేసుకుంటున్నాయి.ప్రస్తుతం మార్కెట్లో టమాట హైబ్రీడ్ రకం విత్తనాలు కిలో రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతున్నాయి. పచ్చి మిర్చి హైబ్రీడ్ సీడ్స్ కిలో రూ.40 వేల నుంచి రూ. 60 వేలు అమ్ముతున్నారు. వంకాయ సీడ్స్ కిలో రూ.7 వేల నుంచి 10 వేల లోపు దొరుకుతున్నా యి. బీర, సోర, కాకరకాయ వంటి తీగ పంటల విత్తనాలు సాధారణ రకాలే కిలో రూ.4 వేలు, రూ.8 వేలు, రూ.15 వేల వరకు అమ్ముతున్నారు . పుచ్చకాయ కిలో రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు పలుకుతోంది. చై థాయ్ బొప్పాయి పేరుతో ఓ కంపెనీ కిలో 3లక్షల55 వేల వరకు సీడ్స్ అమ్ముతోంది. ఇంత ధర పెట్టి కొన్నా బాగున్నాయా .. అంటే విత్తనాల్లో 20 శాతం వైరస్ వస్తోందన్న ఆరోపణలున్నా యి.విత్తన చట్టం ప్రకారం విత్తనాల ఉత్పత్తి వ్యయానికి అమ్మకానికి 35 నుంచి 40 శాతం వ్యత్యాసం ఉండాలి. కానీ కొన్ని ప్రైవేటు కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నాయి. నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ల మత్తు లో జోగుతున్నారని విమర్శలున్నాయి. గతంలో మోనోశాంటో కంపెనీ పత్తి విత్తనాలు ప్యాకెట్ 16వందల 50 వసూలు చేసేది. కానీ ఉమ్మడి ఏపీ విత్తన చట్టాన్ని అమలు చేయడంతో దాని దోపిడీకి అడ్డుకట్టపడింది. ఇప్పుడు ఒక్కో ప్యాకెట్ రూ.450కు దొరుకుతోంది. ఇదే తరహాలో స్వదేశీ విత్తన కంపెనీల ధరలను తగ్గించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.గతంలో కూరగాయల రైతులకు విత్తనాల్లో సబ్సిడీ ఉండేది. ఎకరాకు 12వందల చొప్పున 5 ఎకరాల వరకు రూ.6 వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేది. రెండు మూడేళ్లుగా ఆ సబ్సిడీని ఇవ్వడం లేదని, పూర్తిగా ఎత్తేశారని రైతులు వాపోతున్నారు . రాష్ట్రం విత్తన భాండాగారం అంటున్నారు గానీ కూరగాయల విత్తనాలు మాత్రం విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా థాయ్ లాండ్ నుంచి భారీగా ఇంపోర్ట్ అవుతున్నట్లు తెలిస్తోంది. థాయ్ నుంచి బెంగళూరు.. అటు నుంచి హైదరాబాద్ కు.. అక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు మార్కెట్ చేస్తున్నారు. థాయ్ రకాలకు మార్కెట్లో డిమాండ్ ఉండటంతో అడ్డగోలుగా రేట్లు పెంచి అమ్ముతున్నారు .