NRI-NRT

తానాలో యువతకు ప్రాధాన్యం–భారీగా సేవా కార్యక్రమాలు-తాళ్ళూరితో TNI ప్రత్యేక ఇంటర్వ్యూ.

Will Expand TANA Services-TNI Special Interview With TANA President Jay Talluri - తానాలో యువతకు ప్రాధాన్యం–భారీగా సేవా కార్యక్రమాలు-తాళ్ళూరితో TNI ప్రత్యేక ఇంటర్వ్యూ.

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘం తానా నూతన అధ్యక్షుడిగా భద్రాచలానికి చెందిన తాళ్ళూరి జయశేఖర్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. తన హయాంలో వచ్చే రెండేళ్లలో తానా ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి TNIకు ఇచ్చిన ఇంటర్వ్యులో ఆయన వెల్లడించారు. తానాలో యువత కోసం ప్రత్యెక కార్యక్రమాలు చేపడుతున్నట్లు జయశేఖర్ తెలిపారు. ఒంగోలు, ఖమ్మంలో తానా ఆద్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం ప్రత్యెక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న నిరుద్యోగులైన తెలుగు యువతీ యువకులకు ఉపాధి కల్పించడంలో ప్రత్యెక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వారికి ఉపాధి చూపించడానికి ప్రత్యెక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికాలో తెలుగు నిరాశ్రయులకు న్యూయార్క్ లో నిర్మిస్తున్న ఇండియా హోం ద్వారా చేయూతనందిస్తామని తెలిపారు. తానాకు అమెరికాలో నూతన భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు.
**మరికొన్ని సేవా శిబిరాలు
ఇప్పటివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తానా ఆద్వర్యంలో ఉచిత క్యాన్సర్, కంటి వ్యాధుల నివారణ శిభిరాలను నిర్వహిస్తున్నామని వీటికి అదనంగా మరికొన్ని వ్యాధి నిరోధక శిభిరాలు నిర్వహిస్తామని దీనికోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రులతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. భారత్ బయోటెక్ చైర్మన్ ఎల్లా కృష్ణ మిలియన్ హెపటైటిస్ బీ వ్యాక్సిన్లు తానాకు విరాళంగా ఇస్తున్నారని వాటిని అమెరికాలోనూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. అమెరికాలో ఉన్న అన్ని తెలుగు సంఘాలు సమన్వయం చేసుకుని అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి ఇబ్బందులను తొలగించడానికి సమైక్యంగా కృషి చేస్తామని జయశేఖర్ తెలిపారు. వచ్చే తానా మహాసభలకు అన్ని తెలుగు సంఘాలను ఆహ్వానించి ఒక పూట వారికి కూడా సమయాన్ని కేటాయిస్తామని తెలిపారు. 2021లో తానా మహాసభలు న్యూజెర్సీ లేదా ఫిలడెల్ఫియాలో నిర్వహిస్తామని తెలిపారు. తానాలో ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా ఏర్పాటు చేస్తానని, తానా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉంటె సరిద్దిద్దుతానని తెలిపారు. తానాలో శాస్వతంగా పనిచేసే విధంగా ఒక మూడువేల మంది వాలంటీర్లను అమెరికా నలుమూలలా నియమించే విధంగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగువారికి ఏవిధమైన ఆపద వచ్చినా ఆదుకోవడానికి తానా ముందడుగులో ఉంటుందని జయశేఖర్ తెలిపారు. – కిలారు ముద్దుకృష్ణ.