Politics

అరుణ్‌జైట్లీ జీవిత యాత్ర ఇలా….

Arun Jaitleys Life History Collage And Pics

భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు తెలిపారు. 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ భాజపా విజయ ఢంకా మోగించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఇటీవల జైట్లీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన ఎయిమ్స్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1952 డిసెంబరు 28న మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రత్నప్రభ దంపతులకు అరుణ్‌ జైట్లీ జన్మించారు. తండ్రి న్యాయవాది. 1960 నుంచి 1969 మధ్య కాలంలో పాఠశాల చదువంతా దిల్లీలోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో సాగింది. 1973లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1977లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఇదే సమయంలో ఏబీవీపీ నిరసనకారుడిగా ఉన్నారు. 1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి యూనియన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1982 మే 24లో అరుణ్‌ జైట్లీకి సంగీత డోగ్రీతో వివాహం జరిగింది. న్యాయ విద్య పూర్తయ్యాక 1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు సహా, కొన్ని హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1990లో దిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌ హోదా లభించింది.

Image result for arun jaitley
1991 నుంచి జైట్లీ భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో జైట్లీకి కేబినెట్‌ హోదా దక్కింది. 2009 జూన్‌ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

Image result for arun jaitley
*19 నెలల జైలు శిక్ష అనుభవించిన జైట్లీ..
విద్యార్థిగా ఉన్నప్పుడే అరుణ్ జైట్లీ కళాశాలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న సమయంలో విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. జయప్రకాష్ నారాయణ్ విధానాలు నచ్చి ఆయన్ని రాజకీయ గురువుగా భావించేవారు. జైట్లీ పాలిటిక్స్‌లో అడుగుపెట్టేనాటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలు శిక్షను జైట్లీ అనుభవించారు. 1977లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి.. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు జైట్లీ లోక్ తంత్ర యువ మోర్చకి కన్వీనర్‌గా వ్యవహరించేవారు. 1977లో జైట్లీ ఏబీవీపీ ఢిల్లీ ప్రెసిడెంట్‌గానియమితులయ్యారు. 1980లో బీజేపీలోకి అడుగుపెట్టారు. అదే సంవత్సరం ఆయన ఢిల్లీ యూనిట్ యూత్ వింగ్‌కి సెక్రటరీగా నియమితులయ్యారు.

Image result for arun jaitley