DailyDose

తెదేపా మాజీ ఎమెల్యే అరెస్ట్-నేరవార్తలు-10/18

Telugu Latest Crime News Today-TDP Ex-MLA Arrested-10/18

* శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన తెదేపా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల కొత్తూరు మండలం మాతలలో సామాజిక భవనానికి వైకాపాకు చెందిన రంగులు వేస్తుండటంతో వెంకటరమణతో పాటు పలువురు నిరసనకు దిగారు. ఆ సమయంలో తెదేపా నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బూరాడ నాగరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్‌ఛార్జ్‌ సీఐ రవిప్రసాద్‌ నేతృత్వంలో మాతల గ్రామానికి వెళ్లిన పోలీసులు.. కలమట వెంకటరమణ, అతని కుమారుడు సాగర్‌ సహా 17 మంది తెదేపా కార్యకర్తలను అరెస్ట్‌ చేసి కొత్తూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు.

* దేశంలోని మల్టీ బ్రాండ్ రిటైలర్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విషయంలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే అటువంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెచ్చరించారు. ‘ఈ-కామర్స్ సంస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. చట్టం ప్రకారం మల్టీ బ్రాండ్ రిటైల్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 49 శాతానికి మించకూడదు. దేశంలోని చిన్న వ్యాపారులు జీవనోపాధి కోల్పోకుండా వారికి బీజేపీ అండగా నిలబడుతుంది’ అని తెలిపారు.

* ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ ఆఫీసర్ నెహ్రూ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే నెహ్రూ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శవపరీక్ష నిమిత్తం నెహ్రూ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

* ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీకి ఎండిని నియమించాలన్న తమ ఆదేశాల్ని ప్రభుత్వం ఎందుకు ఉల్లంఘించిందంటూ.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనాన్ని వ్యక్తపరిచింది. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఆర్టీసీని చూసుకుంటున్నారని.. ఆ అధికారికి ఆర్టీసీ పై పూర్తి అవగాహన ఉందని అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. సీనియర్‌ అధికారి ఉన్నప్పుడు 14 రోజులుగా కొనసాగుతున్న సమ్మెను ఎందుకు నివారించలేకపోయారని కోర్టు ప్రశ్నించింది. వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అడిగింది. సీనియర్‌ అధికారి అయినప్పుడు అతడికి పూర్తిగా ఆర్టీసీ ఎండి పదవి బాధ్యతలను ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. ఇప్పటికిప్పుడు కొత్త‌ ఆర్టీసీ ఎండి ని నియమించడం వల్ల సమ్మె పరిష్కారం కాదని వెల్లడించింది. ఎండి ఉంటేనే కార్మికుల అవసరాలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నిధులు మంజూరయ్యేలా చూస్తారని.. ఆ విధంగా చేయకపోవడంతో సమ్మె తీవ్రతరమైందని పేర్కొంది. సమ్మెను ప్రభుత్వం నిలువరించలేకపోతే.. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. ప్రజలు శక్తివంతులని.. వారు ప్రభుత్వంపై తిరగబడితే ఎవరూ ఆపలేరని, భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. వాటిలో 20 డిమాండ్లు పూర్తిగా పరిష్కారమయ్యే డిమాండ్లేనని, మరి ప్రభుత్వం ఎందుకు వాటిని పరిష్కరించడంలో చొరవ చూపలేదని కోర్టు అడిగింది. దీనిపై విచారణ ఘాటుగా కొనసాగుతోంది. మొత్తం 45 డిమాండ్లను కోర్టు ముందు చదివారు. 

* చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్‌ఆర్‌ పురం మండలం కొత్తపల్లిమిట్ట బస్టాండు కూడలిలో శ్రీ బాలాజీ ఎలక్ట్రానిక్స్‌, ఎస్వీ ఎంటర్‌ప్రైజస్‌ షాపులలో (నిన్న) గురువారం రాత్రి చోరీ జరిగిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. స్థానిక కథనం మేరకు.. బాలాజీ ఎలక్ట్రానిక్స్‌ షాప్‌లో మొబైల్‌ ఫోన్లు, గోల్డ్‌ చైన్‌, డబ్బు సుమారు రూ.25,000 లకు పైగా చోరీ అయ్యాయి. మొత్తం సుమారు రూ.1,22,000 చోరీకి పాల్పడినట్లు షాపు యజమాని సోమశేఖర్‌ తెలిపారు. చోరీ అనంతరం సిసి కెమెరా ఫుటేజ్‌ హార్డ్‌ డిస్క్‌ నుండి 15 వ తేదీ మధ్యాహ్నం నుండి 18 వ తేదీ ఉదయం వరకు సిసి ఫుటేజ్‌ వివరాలను హార్డ్‌ డిస్క్‌ నుండి తొలగించారని చెప్పాడు. ఎస్వీ ఎంటర్‌ప్రైజస్‌ షాప్‌లో సుమారు రెండున్నర లక్షల రూపాయల డబ్బు, గోల్డ్‌ 13 గ్రాములు, 5 గ్రాముల సిల్వర్‌ కాయిన్‌ ల వంటివి సుమారు రూ.3,00,000 విలువైన వస్తువులు చోరీ అయినట్లు షాపు యజమాని తెలిపాడు. చికెన్‌ సెంటర్‌, సాయిరాం మెడికల్‌ షాపుల్లో.. కూడా దొంగలు చోరీకి ప్రయత్నించినట్లు స్థానిక ప్రజలు తెలిపారు.

* కల్కి ఆశ్రమంపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తీవ్ర ఆరోపణలు చేశారు. ఆశ్రమం పేరుతో కల్కి భగవాన్‌ అక్రమ ఆస్తులను కూడబెట్టారని అన్నారు. ప్రజా సంక్షేమం పేరుతో ఆయన రూ.కోట్లు దోచుకున్నారని చెప్పారు. ‘ ప్రభుత్వ భూములు ఆక్రమించారు. ఇసుక అక్రమ రవాణా చేశారు. హిందూ సంప్రదాయాలను దెబ్బతీసేలా కల్కి ఆశ్రమం పని చేస్తోంది. కల్కి ఆశ్రమంలో భగవాన్‌ తనయుడు లోకేశ్‌ దాసోజి ఒక పార్టీకి కొమ్ముకాశారు. ఆశ్రమం వెనుక ఉన్న నిజాలు బయటపెట్టాలి’ అని అన్నారు. కల్కి అలియాస్‌ విజయ్‌ కుమార్‌ బతికే ఉన్నారా? అనే దానిపైనా అనుమానాలున్నాయని, ఒక వేళ ఆయన బతికే ఉంటే ఫోటోలు ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన అన్నారు. కల్కి ఆశ్రమం ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు.

* తెలంగాణలో రేపు ఆర్టీసీ కార్మికుల పిలుపు మేరకు జరగనున్న బంద్ కు ఏపీ ఆర్టీసీ ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. రేపు ఆర్టీసీ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పలిశెట్టి దామోదర్ రావు, కో కన్వీనర్ సుందరయ్య  ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

* తన కూతురుకి తగిన వరుడిని వెతికిపెట్టనందుకు ఓ తండ్రి మ్యాట్రిమోనీ సంస్థపై వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. ఆ ఫోరం కూడా తండ్రికి అనుకూలంగా తీర్పు చేప్పింది. రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మొహాలికి చెందిన సురీందర్‌ పాల్‌ సింగ్‌ చాహల్‌  హరియాణలో వైద్యురాలిగా పని చేస్తున్న తన కుమార్తెకు తగిన వరుణ్ని చూడాల్సిందిగా ఓ మ్యాట్రిమోనీని సంప్రదించారు. అయితే 9 నెలలు కావస్తున్నప్పటికీ ఆ సంస్థ తగిన వ్యక్తిని ఎంపిక చేయకపోవడంతో విసుగు చెందిన సురీందర్‌.. జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరాన్ని ఆశ్రయించారు. ముందుగా రాసుకున్న ఒప్పందం ప్రకారం తనకు పరిహారం చెల్లించాలని కోరారు. ఒప్పంద పత్రాలను పరిశీలించిన ఫోరం..  ఫిర్యాదుదారుడికి మ్యాట్రిమోని సంస్థ 9 శాతం వడ్డీతో కలిపి రూ.50 వేలను చెల్లించాలని ఆదేశించింది. వీటితోపాటు ఇప్పటి వరకు అయిన ఖర్చుల మొత్తం రూ.12 వేలను కూడా తండ్రికి చెల్లించాలని పేర్కొంది.

* ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో హిందూ మహాసభ నేత కమలేష్ తివారీని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారంనాడు కాల్చిచంపారు. తీవ్రంగా గాయపడిన తివారీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. తొలి సమాచారం ప్రకారం, కాషాయం దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు దీపావళి కానుక ఇవ్వడానికి వచ్చామంటూ ఆయన కార్యాలయంలోకి ప్రవేశించారు. క్షణాల్లో ఆయనపై కాల్పులు జరిపి అక్కడ్నించి పరారయ్యారు. మహమ్మద్ ప్రవక్తపై ఇటీవల తివారీ చేసిన వ్యాఖ్యల కారణంగానే ఆయనపై దుండగలు కాల్పులు జరిపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలం నుంచి రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

* హైకోర్టును అమరావతి నుండి కర్నూలు కు తరలించాలనే ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ.. నర్సాపురం బార్‌ అసోసియేషన్‌వారి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ.. న్యాయవాదులంతా శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత నెల రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. దీనిపై ప్రభుత్యం స్పష్టమైన వివరణ ఇవ్వకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ.. న్యాయవాదులు నరసాపురం కోర్ట్‌ ఎదురుగ నిరసన చేపట్టారు.

* మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బస్సులో తాత్కాలిక మహిళా కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ప్రయాణికులను ఎక్కించుకోకుండా పథకం ప్రకారం లైంగిక దాడికి యత్నించాడు. అయితే.. ఆ మహిళా కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకుంది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. తాత్కాలిక డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

* యజమాని అక్రమంగా బావినీళ్లను తోడేస్తున్నారని  ఆరోపణ చేసారు. ముంబైలో కేసు కూడా నమోదు అయంది. బావిలో నీటిని అమ్ముకొని రూ.73 కోట్లు సొమ్ము చేసుకున్నారని,కేసు పెట్టిన వ్యక్తి యజమాని పైనే  ఆరోపించారు. అక్రమంగా బావి నీళ్లను తోడేసినందుకు రూ. 73 కోట్లు చెల్లించాలని,డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. వినటానికి నమ్మకం కలుగకపోయిన ఇది నిజమే.ఏదో తమ ఇంటి అవసరాల కోసం ఆ నీటిని తోడుకున్నారు, అనుకుంటే మనం పప్పులో  కాలు వేసినట్టే. అది కూడా ఒకటి లేదా రెండ్రోజులు కాదు.ఏకంగా 11 ఏళ్లపాటు ఇది కొనసాగింది. రెండు బావుల్లోని నీటిని తోడి, ట్యాంకర్ల  సహాయంతో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు నిందితుడు.

* మూడో రోజు బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ధర్మాడి సత్యం బృందం, ఇతర అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బోటును వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 50 అడుగుల లోతులో బోటు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే బోటుకు లంగర్ తట్టింది కానీ లాగే ప్రయత్నంలో వదిలేసినట్టు తెలుస్తోంది. కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ పర్యవేక్షణలో వెలికితీత పనులు కొనసాగుతున్నాయి

* విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం కరకపుట్టు వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. 3వేల కిలోల గంజాయిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు బస్సులో గంజాయి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.