DailyDose

నేటి పది ప్రధాన వార్తలు-10/30

Telugu Top Breaking News Of The Day - Oct 30 2019

1. ఇసుక వారోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వారోత్సవాల నిర్వహణ సిగ్గుచేటని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు కాదు.. ఇసుకాసురుల భరతం పట్టే వారోత్సవాలు జరపాలన్నారు. ఊరికో వైకాపా ఇసుకాసురుడు తయారయ్యాడని దుయ్యబట్టారు. ఇసుకాసురుల భరతం పడితేనే పేదలకు దీపావళి అని అన్నారు. ఇసుక కొరత వల్ల ఆరుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. ఇవన్నీ వైకాపా ప్రభుత్వ హత్యలేనన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
2. శ్రీశైలం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో 2.14 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఆనకట్ట 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 1.39 లక్షల క్యూసెక్కులను సాగర్‌కు వదులుతున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉండగా.. నీటి నిల్వ 214.36 టీఎంసీలుగా నమోదైంది.
3. ఇసుక కొరతపై నారా లోకేశ్‌ దీక్ష
రాష్ట్రంలో ఇసుక కొరతపై పోరాటాన్ని తెదేపా ఉద్ధృతం చేసింది. గుంటూరు కలెక్టరేట్‌ ముందు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దీక్షకు దిగారు. లోకేశ్‌కు సంఘీభావంగా తెదేపా నేతలు నక్కా ఆనంద్‌బాబు, గల్లా జయదేవ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించి వైకాపా నేతలు దొచుకుంటున్నారని నేతలు మండిపడ్డారు. కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ఆ మరణాలపై ముఖ్యమంత్రి జగన్‌ ఒక్కసారైనా సమీక్షించారా? అని నిలదీశారు.
4. ‘పేదరికం గురించి పుస్తకాల్లో నేర్చుకోలేదు
’‘పేదరికం అంటే ఏంటో పుస్తకాల్లో చదివి తెలుసుకోలేదు. రైల్వే ప్లాట్‌ఫాంపై ఛాయ్‌ అమ్ముతూ దాన్ని అనుభవించాను’ అని నాటి రోజులను గుర్తుచేసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని ఈ ఉదయం ఆయన భారత్‌కు పయనమయ్యారు. పర్యటనలో భాగంగా రియాద్‌లో జరిగిన ‘ఫ్యూచర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇనిషియేటివ్‌ 2019’ సదస్సులో పాల్గొన్న ప్రధాని.. ప్రశ్నోత్తరాల సమయంలో తన జీవితప్రయాణం గురించి చెప్పుకొచ్చారు.
5. వలస కూలీల మృతిపై మమత దిగ్భ్రాంతి
కశ్మీర్‌లో ఉగ్రవాదుల జరిపిన కాల్పుల్లో వలస కూలీలు మృతిచెందడంపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విచారం వ్యక్తం చేశారు. కూలీల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముర్షిదాబాద్‌కు చెందిన ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాల బాధను మాటలతో తీర్చలేం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారికి అన్ని విధాలా అండగా ఉంటాం’ అని దీదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.
6. 40 గ్రాముల బంగారాన్ని తిన్న ఎద్దు
కూరగాయల చెత్తతో కలిపి బయటపడేసిన బంగారాన్ని ఓ ఎద్దు తినేసిన ఘటన హరియాణాలోని సిర్సాలో చోటు చేసుకుంది. బాధితుడు జనక్‌రాజ్‌ కథనం ప్రకారం.. ఈ నెల 19న తన భార్య, కోడలు వారి నగలను వంటగదిలో ఓ గిన్నెలో భద్రపర్చారు. అనంతరం వారు కూరగాయలు తరిగి ఆ చెత్తను అదే గిన్నెలో వేశారు. దానిలో 40 గ్రాముల బంగారం ఉన్న విషయం మరిచిపోయి ఆ చెత్తను బయటపడేశారు. తరువాత నగల విషయం గుర్తుకు వచ్చి సీసీ కెమెరాలో పరిశీలించగా ఆ చెత్తను ఒక ఎద్దు తినేసినట్లు గుర్తించారు.
7. రామ్‌ కొత్త సినిమా షురూ..!
రామ్‌ పోతినేని కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘రెడ్‌ (RED)’. ఈ చిత్రానికి కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్రవంతి మూవీస్‌ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలను అందిస్తున్నారు.
8. 40వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌
స్టాక్‌ మార్కెట్ల జోరు బుధవారం కూడా కొనసాగుతోంది. ఓ దశలో సెన్సెక్స్‌ 40వేల మార్క్‌ను దాటడం విశేషం. గత నెల కార్పొరేట్‌ పన్నును తగ్గించిన కేంద్రం తాజాగా మరిన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందన్న సంకేతాలతో మదుపర్లలో సెంటిమెంట్‌ను పెంచాయి. ఉదయం 11.23గంటల సమయంలో సెన్సెక్స్‌ 208 పాయింట్లు ఎగబాకి 40,039 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 11,842వద్ద ట్రేడవుతోంది. జులై తర్వాత సెన్సెక్స్‌ 40,000 మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం.
9. ప్రతిష్ఠాత్మక అవార్డును తిరస్కరించిన థెన్‌బర్గ్‌
పర్యావరణ మార్పులపై అశ్రద్ధ వహించడానికి ‘మీకెంత ధైర్యం’ అంటూ ప్రపంచ నేతల్ని ఐరాస వేదికగా కడిగిపారేసిన 16ఏళ్ల పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థెన్‌బర్గ్‌.. నాయకుల తీరుపై తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేసింది. 84దేశాలు సభ్యులుగా ఉన్న ‘నోర్డియాక్‌ కౌన్సిల్‌’ ప్రకటించిన ‘ఎన్విరాన్‌మెంటల్‌ అవార్డు’ని నిరాకరించింది. నాయకులు దృష్టి సారించాల్సింది అవార్డుపై కాదంటూ మరోసారి చురకలంటించే ప్రయత్నం చేసింది. ఈ అవార్డు కింద దాదాపు రూ.36లక్షల నగదు బహుమతి అందజేస్తుండటం గమనార్హం.
10. ముంబయి మునిగిపోనుందా..?
భారత ఆర్థిక రాజధాని ముంబయి మహానగరానికి పెను ముప్పు వాటిల్లనుందట. సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో 2050 నాటికి ముంబయిలో చాలా భాగం ‘తుడిచిపెట్టుకుపోయే’ ప్రమాదం ఉందని తాజాగా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. న్యూజెర్సీకి చెందిన క్లైమేట్‌ సెంట్రల్‌ అనే సైన్స్‌ ఆర్గనైజేషన్‌ తీర ప్రాంతాలపై పరిశోధనలు చేసి ‘నేచర్‌ కమ్యూనికేషన్స్‌’ పేరుతో కథనం ప్రచురించింది. ఈ అధ్యయనం ప్రకారం.. సముద్ర మట్టాలు నానాటికీ పెరుగుతుండటంతో 2050 నాటికి 150 మిలియన్ల ప్రజలు నివసిస్తున్న భూమి హై టైడ్‌ లైన్‌ కిందకు కుంగే ప్రమాదముందట.

###
1. సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలి:చాడ
సీఎం కేసీఆర్‌కు రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎప్పటికీ మరువలేనిదని చెప్పారు. సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘సకల జనభేరి’ సభలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. నిజాం హయాంలో ప్రభుత్వం పరిధిలోనే ఆర్టీసీ సంస్థ నడిచిందని గుర్తు చేశారు. ఇప్పటికే 15 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు.
2. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్‌ సమీక్ష
ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టుకు సమర్పించాల్సిన నివేదిక తదితర అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమీక్షకు మంత్రి పువ్వాడ అజయ్‌, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ అధికారులు హాజరయ్యారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ఈ సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించారు.
3. ‘కశ్మీర్‌లో విదేశీ ప్రతినిధులకు ఏం పని?’
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో భాజపా-శివసేన మధ్య వివాదం మరింత ముదురుతోంది. భాజపాపై శివసేన తాజాగా విమర్శల వర్షం కురిపించింది. 28 మంది ఐరోపా ప్రతినిధుల బృందం కశ్మీర్‌లో పర్యటిస్తున్న విషయమై ప్రశ్నించింది. సేన పత్రిక ‘సామ్నా’లో ఈ మేరకు కథనం రాసింది.‘కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను సమీక్షించడానికి 28 మందితో కూడిన ఐరోపా ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. కశ్మీర్‌ అంశం మన దేశ అంతర్గత వ్యవహారమైనప్పుడు ఇక్కడ వారికేం పని?’ అని ప్రశ్నించింది.
4. బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం?
ఇటీవల నల్లధనాన్ని పసిడి రూపంలో దాచుకుంటున్న నేపథ్యంలో ఆ బంగారాన్ని బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత పరిమాణానికి మించి బంగారం ఉంటే తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
5. ఈఆర్‌సీ ఛైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జునరెడ్డి ప్రమాణం
రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ) ఛైర్మన్‌గా జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్‌, సీఎం జస్టిస్‌ నాగార్జునరెడ్డిని శాలువాతో సత్కరించారు.
6. పాక్‌లో గురునానక్‌ స్మారక నాణేల విడుదల
గురునానక్‌దేవ్‌ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌ నానక్‌ స్మారక నాణేలను బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఫొటోలను ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘గురునానక్‌ జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేలను పాక్‌ విడుదల చేసింది’ అని పేర్కొన్నారు.
7. చినజీయర్‌ స్వామిని కలిసిన ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా పలు డిమాండ్లపై గత 26 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు బుధవారం చినజీయర్‌ స్వామిని కలిశారు. రాజేంద్రనగర్‌, మహేశ్వరం ఆర్టీసీ డిపోలకు చెందిన కార్మికులు బుధవారం ముచ్చింతల్‌లోని ఆయన ఆశ్రమానికి వెళ్లి తమ సమస్యలను విన్నవించుకున్నారు. తమ డిమాండ్లు న్యాయమైనవైనప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
8. శివసేనతో విభేదాలు తొలగిపోతాయి
మహారాష్ట్రలో భాజపా శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ మరోసారి ఎన్నికయ్యారు. విధాన్‌ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన 105 మంది భాజపా ఎమ్మెల్యేలు ఫడణవీస్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఫడణవీస్‌ మాట్లాడుతూ.. మిత్రపక్షంతో ఏర్పడిన భేదాభిప్రాయాలు త్వరలోనే తొలగిపోతాయని, మరోసారి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.
9. ‘షకిబ్‌ కెప్టెన్సీలో 2023 ప్రపంచకప్‌ ఆడతాం’
షకిబ్‌ అల్‌ హసన్‌ సారథ్యంలోనే 2023 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడతామని బంగ్లాదేశ్‌ పేసర్‌ మష్రఫె మోర్తాజా పేర్కొన్నాడు. ఓ బుకీ తనని సంప్రదించిన విషయాన్ని షకిబ్‌ అల్‌ హసన్‌ ఐసీసీ అవినీతి నిరోధక శాఖ దృష్టికి తీసుకురానందున మంగళవారం అతడిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐసీసీ అధికారులు ఇటీవల జరిపిన విచారణలో షకిబ్‌ తన నేరాన్ని అంగీకరించడంతో ఏడాది పాటు సస్పెన్షన్‌ మినహాయింపు ఇచ్చింది.
10. రెండో రోజూ.. మార్కెట్‌ పరుగులు
పన్ను సంస్కరణల అంచనాలు, కొనుగోళ్ల అండతో దేశీయ మార్కెట్లలో బుధవారం కూడా లాభాల జోరు కొనసాగింది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కేంద్రం మరిన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించే అవకాశం ఉందన్న సంకేతాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 220 పాయింట్లు ఎగబాకి 40,052 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 11,844 వద్ద స్థిరపడ్డాయి.
###