DailyDose

ఏపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి-రాజకీయం-11/20

Nallari Kiran Kumar Reddy To Take Over As AP Congress Chief-Telugu Politics-Nov 2019

* ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్ భేటీ అయ్యారు. మహారాష్ట్ర రైతు సమస్యలపై ప్రధానికి మూడు పేజీల లేఖ సమర్పించినట్లు పవార్ తెలిపారు. అయితే… మహారాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం చర్చనీయాంశమైంది.

* ఐఎన్‌ఎక్స్‌ మీడియా మనీలాండరింగ్‌ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం.. బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చిదంబర్‌ బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే చిదంబర్‌ బెయిల్‌ పిటిషన్‌పై వివరణ కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25 వరకు వివరణ ఇవ్వాలని కోర్టు ఈడీని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను 26వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఈడీ దర్యాప్తు చేస్తున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవలే తోసిపుచ్చింది. ఈ కేసులో ఆయన కీలక పాత్ర పోషించినట్టు కోర్టు అభిప్రాయపడింది.

* ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచాలని నిర్ణయించారు. అదీకూడా ఎలాగంటే.. మద్యం బాటిల్ ముట్టుకుంటేనే షాక్ కొట్టేలావుండాలన్నారు. ఇందుకోసం దరఖాస్తు రుసుం, లైసెన్స్ ఫీజులను భారీగా పెంచాలని ఆదేశించారు. ఈ విషయంలో సంబంధిత శాఖామంత్రికి ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చారు. బార్ల పాలసీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రస్తుతమున్న బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సంఖ్య తగ్గింపుతోపాటు మద్యం సరఫరా వేళలను కుదించాలని, బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 797 బార్లు ఉండగా, వీటిలో సగానికిపైగా తగ్గించాలని సీఎం సూచించారు.  అంతేకాకుండా, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలుకు కూడా చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. ‘మద్యం ముట్టుకుంటే షాక్‌ కొడుతుందన్న భావన ఉండాలి. అప్పుడే చాలామంది దానికి దూరం అవుతారు. ఇందుకు అనుగుణంగానే దరఖాస్తు రుసుములు, లైసెన్సు ఫీజులు ఉండాలి. అంతిమంగా మద్య నిషేధం దిశగా అడుగులు వేయాలన్న మౌలిక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి’ అని సీఎం జగన్ అధికారులకు  స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి అధికారులు సమాధానమిస్తూ, మద్యం పాలసీలో భాగంగా ఇప్పటికే 20 శాతం దుకాణాలను తగ్గించామని, బార్ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తామని చెప్పారు. బార్లలో ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం సరఫరాకు, రాత్రి 11 గంటల వరకూ ఆహారాన్ని అనుమతిస్తామని అధికారులు చెప్పారు. స్టార్‌హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యం విక్రయాలకు అనుమతిస్తామని చెప్పారు. అంతేకాకుండా, నాటుసారా, కల్తీ మద్యం తయారీ, మద్యం స్మగ్లింగ్‌ చేసివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలని సూచించారు. బార్‌ యజమానులు నియమాలు ఉల్లంఘిస్తే లైసెన్సు ఫీజుకు ఐదు రెట్లు జరిమానా విధించాలని సూచించారు. 

* ఎపి కాంగ్రెస్ చీఫ్ గా మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించాలన్న నిర్ణయానికి జాతీయ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి ఎపికి కిరణ్ కుమార్ రెడ్డి చివరి సిఎం అన్న విషయం విదితమే. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై ఎపి కాంగ్రేస్ ఇన్ ఛార్జి ఊమెన్ చాంది సోనియాకు ఓ నివేదికను ఇచ్చారు. పళ్లంరాజు, చింతామోహన్, శైలజానాథ్ తదితరులు ఎపి కాంగ్రెస్ చీఫ్ పదవికి పోటీ పడుతున్నారు. అయితే సుధీర్ఘ చర్చల అనంతరం కిరణ్ కుమార్ రెడ్డినే పిసిసి చీఫ్ గా నియమించాలన్న నిర్ణయానికి సోనియా వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కిరణ్ కుమార్ రెడ్డిని ఎపి కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ రెండుమూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించాయి.

* దేశ‌వ్యాప్తంగా ఎన్ఆర్‌సీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ ఆయ‌న రాజ్య‌స‌భ‌లో మాట్లాడారు. అస్సాంలో నిర్వ‌హించిన ఎన్ఆర్‌సీ త‌ర‌హాలోనే అన్ని రాష్ట్రాల్లో ఎన్ఆర్‌సీ చేప‌ట్ట‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. వివిధ మ‌తాల‌కు చెందిన వారు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైలవరం శాసనసభ్యుడు శ్రీ వసంతకృష్ణప్రసాద్ ప్రెస్ మీట్ కామెంట్స్…-దేవినేని ఉమా మీడియా సమావేశం చూడాలంటే ప్రజలకు అసహ్యం వేస్తుంది. మైలవరంలో ప్రజలు బుద్ది చెప్పిన ఉమాలో మార్పు రాలేదు. ఉమా ఇసుక మాఫియా కింగ్ అని చెప్పి చంద్రబాబు ఇసుక దీక్ష వేదిక మీద కూర్చోనివ్వలేదు. పోలవరం అనేది రాజశేఖర్ రెడ్డి కలలు పంట. 2018 కల్లా పోవవరం పూర్తి చేస్తామని ఉమా అసెంబ్లీ రాసుకోమన్నారు. పోలవరం 2018కి ఎక్కడ పూర్తి చేశారో ఉమా చెప్పాలి. మీరు చేసిన అవినీతి నచ్చక రివర్స్ టెండరింగ్ సీఎం పెట్టారు..వందలకోట్లు ఆదా అయింది. ఉమా వెకిలి చేష్టలు చూసి తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆరే ఉమా ఆడో మగో తెలియదన్నారు. ఇప్పుడు అదే నిజమవుతుంది. దేవినేని ఉమా పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఉండేది కాదు. దేవినేని ఉమా మంత్రులను పట్టుకొని సన్నాసి అని మాట్లాడడం సరికాదు.