WorldWonders

ఆవులకు రక్షక్ తొడుగులు

Winter Coats For Cows In Ayodhya Uttar Pradesh India

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య మున్సిపల్‌ కార్పొరేషన్‌ వినూత్న నిర్ణయం తీసుకుంది. శీతాకాలం ప్రారంభమవడంతో నగరంలో ఉన్న ఆవులన్నింటినీ చలి నుంచి కాపాడేలా జూట్‌ రక్షక తొడుగులు(చలి కోట్లు) చేయించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాల్ని నగర మున్సిపల్‌ కమిషనర్‌ నీరజ్‌ శుక్లా వెల్లడించారు. ‘మేము ఆవులకు కోట్లను తెప్పించే పనిలో ఉన్నాం. మొదట బైసింగ్‌పూర్‌ గోశాలలోని వంద ఆవులకు వీటిని ఆర్డర్‌ చేశాం. అవి నవంబర్‌ ఆఖరులోపు వస్తాయి. ఆతర్వాత ఈ పథకాన్ని మూడు, నాలుగు దశల్లో అన్ని గోశాలల్లోని ఆవులకు అమలు చేస్తాం. ఒక్క ఆవు కోటు తయారీకి రూ.250 నుంచి 300 అవుతుంది’ అని తెలిపారు. ‘ఈ ఆవు కోట్లను మూడు పొరలతో తయారు చేయిస్తున్నాం. లోపల వైపు ఉండే పొరను ఆవుకు వెచ్చదనాన్ని ఇచ్చేలా మృదువుగా తయారు చేయమని కోరాం. ఆవులకు, ఎద్దులకు ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం. వీటితో పాటు గోశాలల్లో ఆవులకు చలి తగలకుండా భోగి మంటల ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు’ తెలిపారు. నగర మేయర్‌ రిషికేష్‌ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. తాము ఆవులకు సేవ చేయడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. అదేవిధంగా ఇతర గోశాలలను కూడా రాష్ట్రంలోనే ఉత్తమంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.