DailyDose

CAAని అమలు చేసి తీరుతాం-తాజావార్తలు-12/19

CAA Will Be Implemented Says JP Naddah-Telugu Breaking News Roundup-12/19

* పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏని అమలు చేసి తీరుతామని, భవిష్యత్‌లో ఎన్‌ఆర్‌సీని కూడా తీసుకొస్తామని ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చిన సిక్కు శరణార్థులతో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విపక్షాలపై విమర్శలు గుప్పించారు.

* పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధానిలో ఓ వైపు పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండగా.. మరోవైపు కొన్ని చోట్ల హర్షాతిరేకాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ చట్టాన్ని స్వాగతించిన పాకిస్థాన్‌కు చెందిన హిందువులు నేడు రాజ్‌ఘాట్‌ వద్ద ర్యాలీ చేపట్టారు. మోదీ.. మోదీ అని నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మయాంక్‌ అనే నెటిజన్‌ ట్విటర్‌లో పోస్టు చేయగా.. దాన్ని పద్మశ్రీ గ్రహీత మోహన్‌దాస్‌ పై రీట్వీట్‌ చేశారు.

* ‘ఈ సారి ఐపీఎల్‌ వేలంలో మేం అత్యుత్తమ ఆటగాడిని దక్కించుకున్నాం..’ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ప్యాట్‌ కమిన్స్‌ను రూ.15.50 కోట్లకు కొనుగోలు చేసిన తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అన్న మాట. ఐపీఎల్‌లో 10 ఇన్నింగ్స్‌ల కన్నా ఎక్కువ అనుభవం లేని కమిన్స్‌ ఎందుకని ఈ సారి అత్యుత్తమ ఆటగాడు అయ్యాడు? ఈ ఏడాది అతడి ప్రదర్శన ఎలా ఉంది? అతడి కోసం వేలంలో ఎందుకంత పోటీ నెలకొంది? యువీ తర్వాత ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు ఎందుకు అమ్ముడయ్యాడో తెలుసా?

* మాజీ అధ్యక్షుడిపై వచ్చిన ఆరోపణలను విచారించటానికి పాక్‌ అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులు గల ప్రత్యేక కోర్టు బెంచిని ఏర్పాటుచేసింది. జస్టిస్‌ వకార్‌ అహ్మద్‌ సేథ్‌, జస్టిస్‌ షహీద్‌ కరీమ్‌, జస్టిస్‌ నజార్‌ అక్బర్‌లతో ఏర్పడిన ఈ ప్రత్యేక కోర్టు 167 పేజీల సుదీర్ఘ తీర్పును వెలువరించింది. దీనిలో ఆయనకు మరణశిక్ష అమలు కంటే ముందే ముషారఫ్‌ చనిపోతే ఏం చేయాలో కూడా చెప్పింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన శరీరాన్ని ఇస్లామాబాద్‌ లోని డి-చౌక్‌ వరకూ ఈడ్చుకెళ్లి అక్కడ మూడు రోజుల పాటు వేలాడదీయాలని తన తీర్పులో వివరించింది.

* తెలంగాణ హైకోర్టు చొరవతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో రెండేసి చొప్పున, మిగతా జిల్లాల్లో ఒక్కో ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.

* 2019 ‘టిక్‌టాక్‌ ఇండియా క్వీన్‌’గా అవతరించింది బాలీవుడ్‌ నటి జాక్విలీన్‌ ఫెర్నాండజ్‌. తాజాగా టిక్‌టాక్‌ రైవైండ్‌ 2019 ప్రచారంలో భాగంగా మొదటి యాభై కంటెంట్‌ వీడియోల జాబితా విడుదల చేసింది. అందులో బాలీవుడ్‌ నటి జాక్విలీన్‌ అత్యధిక ఫాలోవర్స్‌తో మొదటి స్థానం సంపాదించింది. 2019 ఇండియా టిక్‌టాక్‌ క్వీన్‌గా అవతరించింది. జాక్విలిన్‌ 9.5 మిలియన్ల ఫాలోవర్లతో బాలీవుడ్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

* అభివృద్ధి ఒకే ప్రాంతంలో ఉంటే ప్రాంతీయ విద్వేషాలు వచ్చే అవకాశం ఉందని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధాని అంశంలో తెదేపా అధినేత చంద్రబాబు వైఖరిని సొంతపార్టీ నేతలే వ్యతిరేకించే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన తెదేపా నేతలు సీఎం జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించడమే దీనికి నిదర్శనమన్నారు.

* ఆర్టీసీని నష్టాలబాట నుంచి బయటపడేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. కార్గో (సరకు రవాణా) సేవలపై ఇప్పటికే పలుమార్లు చర్చించిన అధికారులు.. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. సరకు రవాణా బస్సులను ఎరుపురంగులో తీర్చిదిద్దనున్నారు. కార్గో బస్సు డ్రైవర్‌, సిబ్బందికి ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ రూపకల్పన చేస్తున్నారు.

* ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సిద్దిపేట అదనపు డీసీపీ గోవిందు నర్సింహారెడ్డి భారీగానే ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ సోదాల్లో బయటపడింది. మహబూబ్‌నగర్‌, జహీరాబాద్‌, అయ్యవారిపల్లె, సిద్దిపేట, హైదరాబాద్‌లో నర్సింహారెడ్డి ఆయన బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు చేసిన అనిశా అధికారులు.. రూ.10 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. ఆయన నివాసంలో కిలోన్నర బంగారం, 5.33 లక్షల నగదు, బ్యాంకులో మరో 6.37 లక్షలు, గోల్కొండ సమీపంలో ఖరీదైన విల్లా, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో 20 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఈ సోదాల్లో తేలింది.

* ఇప్పటి వరకూ పౌరసత్వ సవరణ చట్టం అమలుకు సంబంధించి తలెత్తిన అల్లర్లతో అట్టుడికిన జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం పరిసరాల్లో హృదయాన్ని కదిలించే ఒక సంఘటన జరిగింది. ఈ విద్యా సంస్థ గేటు వెలుపల ముస్లిములు నమాజ్‌ చేస్తుండగా, వారికి రక్షణగా ఇతర మతాలకు చెందిన వారు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ మధ్యాహ్నం జరిగిన ఈ ఉదాత్త సంఘటనకు సంబంధించిన వీడియోలు కేవలం కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్‌ను, లైక్‌లను సొంతం చేసుకున్నాయి.

* 2020 ఐపీఎల్‌ వేలం ప్రారంభమైంది. ఇప్పటి వరకు అమ్ముడుపోయిన 10 మంది ఆటగాళ్లలో ఆస్ట్రేలియా వైస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ అత్యధిక ధర పలికాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్ అతడిని రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. అతడి తర్వాత ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ రెండో అత్యధిక ధర పలికాడు. కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ అతడి కోసం రూ.10.75 కోట్లు వెచ్చించింది. ఇక దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్‌మోరిస్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.10 కోట్లకు తీసుకుంది.

* విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోందని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. దీంతో ఆ ప్రాంతం పెట్టుబడులకు మరింత అనుకూలంగా మారుతుందని అన్నారు. హైదరాబాద్‌ తాజ్‌కృష్ణ హోటల్‌లో నిర్వహించిన భారత్‌-అమెరికా రక్షణరంగ సంబంధాల సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీకి సుదీర్ఘ తీరప్రాంతం ఉండటం రక్షణరంగ పెట్టుబడులకు కలిసొచ్చే అంశమన్నారు.

* పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్త నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఒక వీడియో వైరల్‌గా మారింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 2003లో రాజ్యసభ చర్చలో ఈ చట్టానికి అనుకూలంగా మాట్లాడిన క్లిప్‌ను భాజపా తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఈ వీడియోలో మన్మోహన్‌ పాకిస్థాన్‌, ఆఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించటానికి మద్దతుగా ప్రసంగించారు. ప్రస్తుత చట్టం అదే చేసిందని భాజపా క్యాప్షన్‌ ఇచ్చింది.

* ప్రభుత్వం తన వైఖరిని మార్చకొని ఇకనైనా రాజధాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. రైతులు, ప్రజలు అంతా జగన్ ప్రకటనతో మానసిక ఆందోళనలో ఉన్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో చేసిన మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి గ్రామాల్లో రైతులు ఆందోళనలకు దిగారని ఆయన చెప్పారు.

* టాటా గ్రూప్‌ ఉద్యోగులందరూ వ్యాపారాలపై దృష్టి సారించాలని, వాటాదారుల సంక్షేమం కోసం పాటుపడాలని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ సూచించారు. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఆయన నియామకం చట్టవ్యతిరేకమని నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఉద్యోగులకు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై న్యాయపరమైన చర్యలను కంపెనీ చూసుకుంటుందన్నారు. గతంలో కంటే కంపెనీని మరింత బలోపేతం చేయాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా ఉద్యోగులందరూ వ్యాపారాలపైనా, వాటాదారుల సంక్షేమంపైనా దృష్టిసారించాలన్నారు.

* అంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ల నివేదికలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని చెప్పింది. ఇసుక తవ్వకాలపై అధ్యయనం, చర్యలపై నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. లేదంటే రూ.100 కోట్ల జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది.

* పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ, స్వరాజ్ అభియాన్‌ అధినేత యోగేంద్ర యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ మండిపడ్డారు. ‘రామచంద్ర గుహ, యోగేంద్ర యాదవ్‌ వంటి ప్రశ్నించే మనస్తత్వం ఉన్న వ్యక్తులు అరెస్టు చేయడం ద్వారా సత్యాగ్రహ జ్వాలలను ఆర్పాలని ప్రభుత్వం మూర్ఖంగా ప్రయత్నిస్తోంది’ అని కమల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

* సమత హత్యాచార కేసుకు సంబంధించి ఆదిలాబాద్‌ జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో రోజువారీ విచారణ కొనసాగుతోంది. నిందితుల తరఫు న్యాయవాది రహీం డిశ్చార్జి పిటిషన్‌ వేశారు. నిందితులతో మాట్లాడేందుకు కోర్టు ఆయనకు అనుమతిచ్చింది. మరోవైపు ఈ కేసులో నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని వారు కోర్టుకు తెలిపారు. అనంతరం కేసు విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

* దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో కాస్త ఊగిసలాట ధోరణి కనిపించినా ముగిసే సమయానికి లాభాలను అందుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 115 పాయింట్లు లాభపడి 41,673 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 12,259 వద్ద స్థిరపడింది. నిన్న ఎన్‌సీఎల్‌ఏటీ సైరస్‌ మిస్త్రీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం టాటా గ్రూప్స్‌ షేర్లపై ప్రభావం చూపింది.

* ‘అర్జున్‌రెడ్డి’లో తనదైన నటనతో యువతను కట్టిపడేసిన కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. అయితే, తాను జీవితంలో ఒక్కటి మాత్రం ఎప్పటికీ చేయలేనని చెబుతున్నారు. ఇంతకీ దేని గురించనుకుంటున్నారు.. వరుణ్‌ ధావన్‌.. శ్రద్ధాకపూర్‌, ప్రభుదేవా కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డి’. రెమో డిసౌజా దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను అభిమానులతో పంచుకుంటూ వరుణ్‌ధావన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు విజయ్‌ దేవర కొండ.