ScienceAndTech

బబుల్ గమ్‌తో బాలిక సృష్టి

Dont throw away your chewing gum-People can create you again

ఎక్కడైనా నేరం జరిగినప్పుడు పోలీసులు ప్రతి అంగుళం జాగ్రత్తగా వెతుకుతారు. ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని ఆరా తీస్తారు. నిందితులకు సంబంధించిన చిన్న వస్తువు దొరికినా డీఎన్‌ఏ ఆధారంగా నిందితుణ్ని గుర్తిస్తారు. నేర నిర్థారణలోనే కాదు ఇతర వైద్య సంబంధ నిర్థారణ పరీక్షల్లోనూ డీఎన్ఏ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పడు ఆ ప్రస్తావన ఎందుకంటారా..? దాదాపు 5,700 ఏళ్ల క్రితం నమిలి ఉమ్మిన చూయింగమ్‌ వంటి పదార్థం మీద ఉన్న డీఎన్‌ఏ ఆధారంగా శాస్త్రవేత్తలు ఓ బాలిక జన్యుక్రమం మొత్తాన్ని పునః సృష్టించారు. డెన్మార్క్‌ చెందిన కొందరు శాస్త్రవేత్తలు లొల్లండ్‌ అనే ప్రాంతంలో పరిశోధనల్లో భాగంగా తవ్వకాలు ప్రారంభించారు. అలా వారు తవ్వుతుండగా నీరు లేని ఓ గుంతలో జంతువుల ఎముకలు, చెక్క ముక్క మధ్య చూయింగమ్‌ వంటి పదార్థం కనిపించింది. దానిపై డీఎన్‌ఏ ఆనవాళ్లు ఉండటంతో దాన్ని వారు భద్రంగా ల్యాబ్‌కు తీసుకెళ్లి పరిశోధనలు ప్రారంభించారు. ఆ డీఎన్‌ఏ సాయంతో వారు దాన్ని నమిలి ఉమ్మింది ఓ బాలిక అని గుర్తించారు. ఆమె 5,700 ఏళ్ల క్రితం జీవించి ఉంటుందని అంచనాకు వచ్చారు. అంతే కాకుండా వారు ఆమె జన్యువు మొత్తాన్ని పునఃసృష్టి చేశారు. ఆమె నల్లటి చర్మం, నల్లటి జుట్టు, నీలి రంగు కళ్లు ఉంటాయని అంచనాకు వచ్చి ఆమెకు లొలా అనే పేరు పెట్టారు. ఎముకలతో కాకుండా ఇతర పదార్థాల నుంచి ఓ వ్యక్తి జన్యువు మొత్తాన్ని పునః సృష్టించడం ఇదే మొదటిసారి అని నేచర్‌ కమ్యునికేషన్స్‌ అనే జర్నల్ తెలిపింది. శాస్త్రవేత్తలు అంతటితో ఆగకుండా టామ్‌ జోక్‌లాండ్‌ అనే చిత్రకారుడి సాయంతో ఆమె ఊహా చిత్రాన్ని గీయించారు.