DailyDose

గోఎయిర్‌కు పైలట్ల కొరత-వాణిజ్యం-12/23

Go Air Short Of Pilots-Telugu Business News Roundup-12/23

* అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇన్ఫ్రాకు అనుకూలంగా ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌కు 2012లో రిలయన్స్‌ ఇన్ఫ్రా ఒక థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను నిర్మించింది. ఈ కాంట్రాక్టు విలువ రూ.3,750 కోట్లు. దీనికి సంబధించిన వివాదంపై ఇరు సంస్థలు ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి. దీనికి సంబంధించిన తీర్పును నేడు వెలువరించింది. ఈ తీర్పు అనుకూలంగా రావడంతో ఇప్పుడు దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ రిలయన్స్‌ ఇన్ఫ్రాకు రూ.1,250 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఆ కంపెనీ రిలయన్స్‌ ఇన్ఫ్రాకు రూ.896 కోట్లు చెల్లించింది. మరో రూ.354 కోట్లు విలువైన బ్యాంక్‌ గ్యారెంటీలను వాపస్‌ తీసుకొంది. ‘‘ఈ ఆర్బిట్రేషన్‌ అవార్డు కంపెనీకి ఉన్న న్యాయపరమైన హక్కును వెల్లడించింది. ఇన్ఫ్రా కంపెనీలు మెగా ప్రాజెక్టుల్లో పాల్గొనాలంటే వాటి వర్కింగ్‌ క్యాపిటల్‌ వివాదల్లో ఇరుక్కోకూడదు’’ అని రిలయన్స్‌ ఇన్ఫ్రా వెల్లడించింది. 2007లో అత్యల్ప బిడ్డర్‌గా అవతరించి రెండు 600 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ కాంట్రాక్టులను దక్కించుకొంది. దీని ప్రకారం 35-38నెలల్లో కంట్రాక్టును అప్పగించాల్సి ఉంటుంది. ఈ తీర్పు నేపథ్యంలో నేటి ఉదయం రిలయన్స్‌ ఇన్ఫ్రా షేర్లు 5 శాతం పెరిగి రూ.24.25ను చేరాయి.

* దేశీయ బడ్జెట్‌ విమానయాన సంస్థ గోఎయిర్‌ను సిబ్బంది కొరత కష్టాలు వెంటాడుతున్నాయి. విమాన, కాక్‌పిట్‌ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఈ సంస్థ సోమవారం 18 విమానాలు రద్దు చేసింది. ఈ మేరకు ఎయిర్‌లైన్‌ వర్గాలు వెల్లడించాయి. ముంబయి, గోవా, బెంగళూరు, దిల్లీ, శ్రీనగర్‌, జమ్ము, పట్నా, ఇండోర్‌, కోల్‌కతా నుంచి వెళ్లే 18 విమానాలను అర్ధంతరంగా రద్దు చేసినట్లు తెలిపాయి. మరోవైపు విమాన సర్వీసుల అంతరాయంపై గోఎయిర్‌ కూడా ప్రకటన చేసింది. అయితే ఇందుకు చాలా కారణాలను పేర్కొంది. ‘వాతావరణం సరిగ్గా లేకపోవడం, మంచు ప్రభావం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తదితర కారణాలతో గోఎయిర్‌ నెట్‌వర్క్‌లోని పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు సిబ్బంది డ్యూటీ నిబంధనలు కూడా సర్వీసులపై ప్రభావం చూపిస్తున్నాయి’ అని సంస్థ ఆ ప్రకటనలో తెలిపింది. అయితే ఎన్ని విమానాలు రద్దయ్యాయనే విషయాన్ని మాత్రం గోఎయిర్‌ అధికారికంగా వెల్లడించలేదు.

* నాసిక్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌లో కొత్తగా ఆక్సిజన్‌ పార్లర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల కోసం దీనిని రూపొందించారు. భారతీయ రైల్వేల భాగస్వామ్యంతో ఎయిరో గార్డ్‌ సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. దీనిపై ఎయిరోగార్డ్‌ కో ఫౌండర్‌ అమిత్‌ అమ్రిత్‌కర్‌ మాట్లాడుతూ ‘కాన్సెప్ట్‌ ఆఫ్‌ ఆక్సిజన్‌ పార్లర్‌ను నాసా సూచనల మేరకు ఏర్పాటు చేశాము. 1989లో నాసా కొన్ని మొక్కలను కనుగొంది. ఆ మొక్కలు సాధారణ చెట్ల కంటే ఐదురెట్లు హానికారక వాయువులను పీల్చేసుకుంటాయి. చాలా వరకు ఆ చెట్లను మేము ఇక్కడ నాటాము. ఇక్కడ 1500 మొక్కలు ఉన్నాయి. ఇవి నేరుగా, ప్రభావవంతంగా రైల్వే స్టేషన్లలో గాలిని శుభ్రపరుస్తాయి’’ అని తెలిపారు.

* రిలయన్స్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో ఒక దశలో 2.8శాతం వరకు కుంగాయి. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ 2 బిలియన్‌ డాలర్ల వరకు హరించుకుపోయింది. సౌదీ ఆరామ్‌కోతో డీల్‌కు సంబంధించి స్వల్ప సమస్యలు రావడంతో ఈ షేర్లు పడినట్లు భావిస్తున్నారు. ఉదయం 9.35 సమయంలో ఈ స్క్రిప్‌ 2.22శాతం తగ్గి రూ.1563 వద్ద ట్రేడవుతోంది.