Politics

తెదేపాకు ఈడీ దడ

TDP Leaders Shivering On ED Attacks

రాజధాని పేరుతో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, మనీల్యాండరింగ్‌ వ్యవహారాల గుట్టుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేయడం టీడీపీ నేతలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నాయకులు బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేయడంపై సీఐడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తోందనే వార్తలు టీడీపీ శ్రేణుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరిపినా తమకు ఏమీకాదనే ధీమాతో మొన్నటివరకూ మాట్లాడిన సీనియర్‌ నాయకులు నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఉచ్చు బిగుస్తోందని తమ నాయకులకు అర్ధమైందని.. అందుకే కొందరు స్తబ్దుగా ఉంటున్నారని విజయవాడకు చెందిన ఒక టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించారు. స్వయంగా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్‌పై ఈడీ కేసు నమోదు చేసే వీలుందని తెలియడంతో రాబోయే రోజుల్లో మరీ ఆందోళనకర పరిస్థితులుంటాయని, అరెస్టులూ ఉంటాయని చర్చించుకుంటున్నారు. (చదవండి: చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు)
*అజ్ఞాతంలోకి ఇద్దరు మాజీ మంత్రులు?
మాజీ మంత్రులు పుల్లారావు, నారాయణలు అజ్ఞాతంలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అమరావతి ప్రాంతంలోని వెంకటపాలేనికి చెందిన ఒక దళిత మహిళ తన భూమిని మోసపూరితంగా కాజేశారని ఇచ్చిన ఫిర్యాదుతో వారిద్దరిపై ఛీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి పలు సెక్షన్లతో కేసులు నమోదవడంతో వారిద్దరూ మీడియా ముందుకే రావడంలేదని నాయకులు చర్చించుకుంటున్నారు. అరెస్టు భయంతో వారు ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నట్లు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కాగా, తెల్లకార్డుదారులను బినామీలుగా పెట్టుకుని 761.34 ఎకరాలను కొనుగోలు చేయడంపై విచారణ ముమ్మరంగా జరుగుతుండడంతో ఏ రోజు ఎవరి పేరు వినాల్సివస్తుందనే ఆందోళన నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, టీడీపీ బడా నేతలు జరిపిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పూర్తిగా సహకరించి దందా నడిపిన రాజధాని గ్రామాలకు చెందిన పలువురు స్థానిక నేతలు సైతం తాజా పరిణామాలతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. తమపై వచ్చే విమర్శలు, ఆరోపణలపై ఎప్పటికప్పుడు కౌంటర్‌ ఇచ్చే టీడీపీ నేతలు ఈ విషయంలో మాత్రం నోరు మెదపడంలేదు. తమకు అనుకూలమైన మీడియాలోనూ ఆ వార్తలు రాకుండా చంద్రబాబు కోటరీ ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
*జనం దృష్టి మళ్లించేందుకు ‘కియా’పై దుష్ప్రచారం
తమకు వ్యతిరేకంగా ఉన్న ఈ పరిణామాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు నిత్యం రకరకాల కొత్త పుకార్లు, అవాస్తవాలను వెలుగులోకి తెచ్చి ప్రచారం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కియా మోటార్స్‌ అనంతపురం నుంచి చెన్నైకి తరలిపోతోందనే ప్రచారాన్ని లేవనెత్తి హడావుడి చేయడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. ఒక వ్యూహం ప్రకారం ఆయన మీడియా మేనేజర్లు కియా తరలిపోతోందనే కథనాన్ని రాయించి దాన్ని తమ ఐటీ విభాగం ద్వారా సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయించారని విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాత స్వయంగా చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి అదే విషయం పై ఆరోపణలు గుప్పించారు. కియా యాజమాన్యం, తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రచారాన్ని ఖండించాయనే విషయాన్నీ చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకుని మాట్లాడడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పరిశ్రమలు తరలిపోతున్నాయని.. ఉన్నతాధికారులు సెలవులో వెళ్లిపోతున్నారని.. ఏదో జరిగిపోతోందనే పుకార్లను వ్యాపింపజేయడం, వాటిపై హడావుడి చేయడమే పనిగా చంద్రబాబు కొద్దిరోజులుగా పనిచేస్తున్న ట్లు విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. తన అవినీతి సామ్రాజ్యం గుట్టుపై ప్రజల్లో చర్చ జరక్కుండా చేసేందుకే పథకం ప్రకారం అవాస్తవాలను తెరపైకి తెచ్చి హడావుడి చేస్తున్నట్లు చెబుతున్నారు.