Editorials

నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం

నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం

ఏప్రియల్ 23మహాకవి షేక్స్ పియర్ వర్థంతి

ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు

‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో…కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో. ఓ మంచి పుస్తకం స్నేహితుడితో సమానం. ఓ మంచి పుస్తకం జీవితాన్ని మారుస్తుంది’ కందుకూరి ‍వీరేశలింగం పంతులు.

ప్రముఖ ఆంగ్ల రచయిత విలియం షేక్స్‌పియర్ వర్థంతి సందర్భంగా ప్రతిఏటా ఏప్రిల్ 23వ తేదీనాడు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహించాలని యునెస్కో 1995 లో నిర్ణయించింది

పుస్తక పఠనం ఒక వ్యసనం. పుస్తక పఠనం వలన మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది.

మేధస్సు సక్రమంగా పని చేసి ఆలోచనలు నియంత్రించేందుకు పఠనం దోహదం చేస్తుంది. అనవసర ఆలోచనల్ని నియంత్రించి శారీరక ఆరోగ్యం చేకూరుస్తుంది. ఒత్తిడి నుండి విముక్తి చెందాలంటే, రాత్రి పడుకోబోయే ముందు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు చదివడం మంచిది. గాడ నిద్ర పట్టి శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. అలాగే ఏకాగ్రత చేకూరి ఒంటరితనాన్ని దూరం చేస్తుంది.

ఎదిగే పిల్లలకు ఒక్కో వయస్సులో ఒక్కో తరహ పుస్తకం అవసరం. ప్రారంభంలో బోమ్మలు, కథల పుస్తకాలతో మొదలుపెట్టి ప్రపంచ నాగరికతలు, వింతలు, శాస్త్రవేత్తలు, పరికరాలు, సాహసగాథలు ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క కొత్త విషయాన్ని తెలియజేసే పుస్తకాలు చదివించాలి. అలా చదివించి పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి.

ఇంటర్‌నెట్‌ పుణ్యమా అని కనీసం వార్తాపత్రిక కూడా కొనుక్కోకుండా ఇంటర్‌నెట్‌లోనే అన్నీ ఫ్రీగా చదివేస్తున్నాం. కానీ దానితో పాటే రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. అదేపనిగా కూర్చుని ఇంటర్‌నెట్‌లో చదవడం వల్ల కళ్ళు పాడవడం, ఊబకాయం వంటి సమస్యలకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పైగా కంప్యూటర్‌పై చదవడం వల్ల ఊహాశక్తికి తావు ఉండదు, అదే పుస్తక పఠనం ద్వారా చిత్రాలను మనసులో ఊహించుకోగలం తద్వారా ఊహాశక్తి పెంపొందు తుందని పరిశోధకులు చెబుతున్నారు.

మన జీవితాల్లో పుస్తకం ఒక భాగం. ఒంటరిగా ప్రయాణిస్తున్నపుడో, ఏమీ తోచనపుడో పుస్తకం నేనున్నానంటూ మన చేతిలో ఒదిగిపోతుంది.
నేడు పుస్తకం ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. అంతర్జాలం (ఇంటర్నెట్) టివి చాలా వరకు పుస్తకం మనుగడను అడ్డుకుంటున్నాయి. ఎవరు ఇపుడు పుస్తకాన్ని కొని చదవడం లేదు. రీడర్ షిప్ గణనీయంగా పడిపోయింది.
ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న పుస్తక పతనావస్థను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని ( ఏప్రిల్ 23 న ) ప్రపంచ పుస్తక దినంగా జరుపుకోవాలని యు.ఎన్.ఓ ( యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ) తీర్మానించింది. ఈ రోజు ప్రపంచ పుస్తక దినం గా పరిగణించడానికి విభిన్న కధనాలున్నా చాలా మంది ఏకాభిప్రాయానికి వచ్చిన కొన్ని అంశాలు.
1.సెవాంతెస్, షేక్సిపియర్, ఇన్కా గర్సిలాసో, వేగా మొదలైన ప్రముఖ రచయితలు 1616 లో ఇదే రోజున మరణించారు.
2. అంతేకాదు జోసెఫ్ ప్లా, వ్లాదిమర్, మారిస్ ద్రువాం ఇలా ఇంకా చాలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజున మరణించడమో, జన్మించడమో జరగడం విశేషం.
3. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మదినాన్ని స్పెయిన్ లో జరుపుకుంటారు

ఇప్పటికీ స్పెయిన్ లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్ గా ఇస్తారు

ఇన్ని ప్రత్యేకతలున్న ఈ రోజును 1995 లో యునెస్కో ప్రపంచ పుస్తక దినం గా ప్రకటించడమే కాదు, ప్రపంచ పుస్తక మరియు కాపీ హక్కుల దినంగా కూడా జరపాలని నిశ్చయించింది. రచయితలను, ప్రచురణకర్తలను, పాఠకులను, ఉపాధ్యాయులను ఈ రోజున పురస్కారలతో గౌరవించాలని సూచించింది

పుస్తకాలను డిజిటలైజ్ చేయడం వలన రచయితకున్న కాపీ హక్కులు హరించిపోతున్నాయని, ప్రపంచ వ్యాప్తంగా గ్రంధచౌర్యం ప్రబలిపోతున్నదని, కాపీ హక్కుల పరిరక్షణ చర్యలు తక్షణం చేపట్టకపోతే పుస్తకం మనుగడ ప్రశ్నార్ధకంగా మారనుందని ఆందోళన చెందింది. అంతేకాదు యునెస్కో ఈ రోజుని ప్రపంచ పైరసీ వ్యతిరేక దినంగా కూడా ప్రకటించింది

యువత లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి కలిగేటట్లుగా కార్యక్రమాలను రూపొందించాలని స్వఛ్ఛంద సంస్థలను కోరింది. సమాజాన్ని ప్రభావితం చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సమసమాజ నిర్మాణానికి కృషిచేసిన రచనల గురించి రచయితల గురించి తెలుసుకోవలసిన బాధ్యత యువతకు ఉందని యునెస్కో అభిప్రాయ పడింది.

ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ దిశగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రపంచ వ్యాప్తంగా రచయితలకు, ప్రచురణకర్తలకు మనం సమర్పించే నిజమైన నివాళులని అభివర్ణించింది

యుకె లోను ఐర్లాండులోను ప్రపంచ పుస్తక దినం ఒక ఘనమైన వేడుకగా జరుపుకుంటారు. ఆన్ లైన్లో రచయితలు తమ రచనలను చదివి వినిపిస్తారు. పాఠశాలలలో పుస్తక పఠనా పోటీలు నిర్వహిస్తారు. వీటినే రీడథాన్ (Readathon) అనడం విశేషం

అమెరికాలోనైతే వేల కొలది ఇ-బుక్ లను నెట్ లో పెట్టి వాటిలో కొన్ని పుస్తకాల మీద బడి పిల్లలకు ఏక్సలరేటెడ్ రీడింగ్ అనే కాంపిటీషన్ పెడతారు.

కొన్ని దేశాలలో ఈ వేడుకను వేర్వేరు రోజుల్లో జరుపుకోవడం విశేషం. భారతదేశం లో ఈ వేడుకను జరుపుకుంటున్నట్లు దాఖలాలు లేవు. కానీ ప్రపంచంలో ఏదేశ వాసులు ఎక్కువసేపు పుస్తకాలు చదువుతారు అనే విషయంపై నిర్వహించిన సర్వేలో అందరికన్నా ఎక్కువసేపు పుస్తకాలు చదివేవారు భారతీయులేనని నిర్ధారించారు. ఇండియన్లు వారానికి సగటున 10.4 గంటలపాటు పుస్తకపఠనం చేస్తారని తేల్చింది. టీవీలు, సినిమాలు, ఇంటర్‌నెట్‌ వినియోగం.. మారుతున్న జీవనశైలి కారణంగా ఇటీవలికాలంలో మనలో పుస్తకపఠనంపై మోజు తగ్గిందనుకుంటున్నాంగానీ ఈ విషయంలో ఇప్పటికింకా మనమే టాప్‌. ఈ సంఖ్య మరింత పెరగాలని పుస్తకాలు చదవడంలో ఎప్పటికీ భారతీయులే అగ్రస్థానంలో ఉండాలని పుస్తక ప్రియులు కోరుకుంటున్నారు

ప్రపంచంలోని అన్ని భాషల్లోని పుస్తకాలు ఇపుడు డిజిటలైజ్ చేయబడుతున్నాయి. పురాణేతిహాసాలు, కధలు, నవలలు, కవిత ఒకటేమిటి అన్ని రకాల సాహితీ ప్రక్రియలను అంతర్జాలంలో పొందుపరచడం ఒక రకంగా ఇది ప్రపంచ సాహితీ సంపదను శాశ్వతంగా భద్రపరిచే ప్రక్రియ అయినప్పటికీ.. రచయిత కాపీ హక్కులను కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. పుస్తక పరిశ్రమపై ఆధారపడిన లక్షల మంది మనుగడని కోల్పోతున్నారు
క్రమేణా పుస్తకం కనుమరుగై పోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే.. ప్రపంచ పాఠకులారా పుస్తకాన్ని కొందాం. పుస్తకాన్ని బ్రతికించుకొందాం.