Food

ఇది విప్పపూల సీజన్…దాని ప్రత్యేకత ఏంటి?

Vippa Flowers And Their Specialities In Telugu-Food And Diet News

‘పుష్పవిలాపం’లో ఓ బాల తనను చెట్టు నుంచి వేరు చేస్తున్నందుకు పూబాల విలపిస్తుంది, విషాదగీతం ఆలపిస్తుంది. కానీ, చిరుగాలి సవ్వడికి చెట్టుమీది నుంచి రాలే ప్రతి ఇప్పపువ్వూ ఆనందంగా గోండుల వెదురుబుట్టలోకి వెళ్లిపోతుంది. ఆహారమై ఆకలి తీర్చబోతున్నందుకూ, పలారమై పిల్లల నోళ్లు తీపిచేయబోతున్నందుకూ, ఔషధ గుణాలతో అమ్మల చనుబాలను వృద్ధి చేస్తున్నందుకూ .. ఆ సంతోషానికి అనేక కారణాలు. తెల్లవారుజాము సమయంలో తాడ్వాయి అడవులకు వెళితే… ఆ పుష్ప విలాసాన్ని కళ్లారా చూడవచ్చు. ఇది పువ్వులు రాలే కాలం. గోండుల మొహాలు పువ్వుల్లా వికసించే కాలం. ఉదయంపూట నడుస్తుంటే, పాదాలకు మెత్తని పూలు తాకుతుంటాయి. తలపైకెత్తి చూస్తే దట్టంగా ఇప్పపూల చెట్లు… గొడుగులా అల్లుకొని! రాలిన పూలకు అంటిన మట్టిని సుతారంగా తుడిచి, జాగ్రత్తగా వెదురు బుట్టల్లోకి వేస్తుంటారు పిల్లలూ పెద్దలూ. అదో అందమైన దృశ్యం!
**ఆ పూవు అటవీ ప్రాంత ప్రజల బతుకుదెరువు. ఇప్పచెట్లకు ఓ జీవనచక్రం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకూ ఆకురాలే కాలం. ఆ సమయంలోనే ఘాటైన పరిమళంతో పూలు వికసిస్తుంటాయి. మార్చి నుంచి మూడు నెలల వరకూ పూలు రాలే కాలం. ఒక్కో చెట్టు నుంచీ సుమారు వంద కిలోల పూలు రాలతాయి. ప్రతి పువ్వునూ జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటారు గిరిజనులు. ఎందుకంటే, వాళ్ల బతుకంతా ఇప్పతోనే ముడిపడి ఉంటుంది. ఇప్పపూల సేకరణ కోసం తెల్లవారుజామునే అడవులకు బయల్దేరతారు గోండులు. పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి కోసం చూసినట్టు, రాలిపడే ఇప్పపూల కోసం ఎదురు చూస్తుంటారు. అలా, ఒక్కొక్కరు ఐదు నుంచి పది కిలోల వరకూ సేకరిస్తారు. సాయంత్రం బుట్టనిండా పూలతో తృప్తిగా ఇళ్లకు చేరుకుంటాం. వాటిని ఎండబెట్టి పుప్పొడి రేణువులు పోయేదాకా కర్రమొద్దులతో బాదుతారు. ఆ తర్వాత, చేటలతో చెరుగుతారు. గుమ్ముల్లో దాచుకుంటారు. ముందుజాగ్రత్తగా, వాటిలో కొన్ని వేపాకులు చల్లుతారు. దానివల్ల పువ్వు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఒకనాటి పువ్వు… ఇప్పుడు ఆహార పదార్థం.
**పువ్వుకే మనసు ఉంటే…
అందంగా పుట్టినందుకు కాదు, ఆహారమై కడుపు నింపుతున్నందుకే ఎక్కువ సంతోషిస్తుందేమో ఇప్పపువ్వు. ఏ కూరలూ లేనపుడు, నాన బెట్టిన బియ్యానికి ఇప్పపువ్వు కలిపి అన్నం వండుకుంటారు. నాలుకకు కాస్త తీపి తగిలితే బావుండునని అనిపించినప్పుడు బెల్లం కలిపి ఉండలుగా చేసుకొంటారు. ‘ఇవి మా జీవితం. మా ఆత్మ’ అంటూ ఆరబెట్టిన ఇప్పపూలను దోసిళ్లతో చూపుతుంది మోట్లగూడానికి చెందిన అలుగుమెల్లి రజిత.
****ఇప్ప గారెలు, జంతికలు …
ఇప్పపువ్వు అనగానే… సారా తయారు చేస్తారనేదే ఇప్పటి వరకూ ఉన్న ప్రచారం. అంతకుమించి, ఎన్నో వంటలు వండుకుంటారు గోండు మహిళలు. జొన్నపిండి ఉడక బెట్టి, అందులో ఇప్పపూలు కలిపి అంబలి చేస్తారు. వేయించి బజ్జీలు వేస్తారు. చిక్కుడు గింజలు, అలసందలు కలిపి ఉడికిస్తే… ఆ అంబలి అమృతమే! ఇప్ప కుడుములు (ఇడ్లీల్లాంటివి), జొన్న-ఇప్ప రొట్టె, గోంగూర-ఇప్ప పూల కూర, జొన్న-ఇప్ప సత్తుపిండి … ఇప్ప పడితే ఎండు గడ్డికైనా ఎక్కడలేని రుచి వస్తుంది. ఇప్పతో అరిసెలు, గారెలు, జంతికలు, మురుకులు కూడా చేసుకుంటారు. ఎర్ర జొన్న పిండి, బెల్లంతో చేసిన రెండు లడ్డూలు తింటే చాలు, రోజంతా భోజనమే అవసరం లేదు. ‘చక్కెర పాకానికి ఇప్పపూవు కలిపి జామ్‌, కేక్‌ తయారు చేస్తాం… ’ అని చెప్పింది ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరుకు చెందిన భాగుబాయి. వైవిధ్యమైన ఇప్ప వంటకాల తయారీలో ఆమె సిద్ధహస్తురాలు. ఉట్నూరులో ఆదివాసీ ఆహార కేంద్రం నిర్వహిస్తున్నదామె. అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే, రోజువారీ ఆహారంలో ఇప్పపూవు ఉండేలా చూసుకుంటారు గిరిజనులు. వారి నివాసాలు కూడా ఇప్పచెట్లకు దగ్గరలోనే ఉంటాయి. తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఇప్ప చెట్లు ఉన్నట్లు అంచనా. ఐదు లక్షల చెట్లంటే, ఐదు లక్షల జీవితాలే. ఇప్పసారాను నైవేద్యంగా కూడా పెడతారు. ఇప్ప అంటే గోండు దేవతలకు మహా ఇష్టమని అంటారు. మంచిచేసే పువ్వును ఏ దేవుడు మాత్రం ఇష్టపడడు!
***శానిటైజర్‌గా ఇప్పసారా!
‘ఆపిల్‌, మామిడి, ఎండు ద్రాక్షలతో పోలిస్తే ఇప్ప పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. శరీరానికి కావలసిన .. క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, బి-కాంప్లెక్స్‌, విటమిన్‌-సి ఇందులో అధికం. ఇవన్నీ వ్యాధినిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి. ఇప్ప పూలను దగ్గు, శ్వాసకోశ సమస్యల నివారణకు వాడతారు. ఇప్ప కాయలను పొడిచేసి పాలలో కలుపుకొని తాగుతారు బాలింతలు. దీనివల్ల చనుబాలు వృద్ధి అవుతాయని అంటారు. ‘ఇప్పసారా తయారీపై నిషేధం ఉంది. శుభకార్యాలప్పుడు అయిదు లీటర్ల వరకు తయారు చేసుకోవడానికి మాత్రం అనుమతి ఉంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో శానిటైజర్లు మారుమూల గిరిజన ప్రాంతాల్లో దొరకవు. కొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్‌ నిరోధానికి ఇప్పసారాను శానిటైజర్‌గా వాడుతున్నారు’ అంటారు ఆదిలాబాద్‌ జిల్లా కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎ.పోశాద్రి.
Vippa Flowers And Their Specialities In Telugu-Food And Diet News-ఇది విప్పపూల సీజన్...దాని ప్రత్యేకత ఏంటి?