DailyDose

రామవరప్పాడు వ్యాపారస్థుల ఆందోళన-వాణిజ్యం

Ramavarappadu business owners protest-Telugu business news roundup today

* కలెక్టర్ కార్యాలయం వద్ద రామవరప్పాడు వ్యాపారస్తుల ఆందోళనవ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన.లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా ఇండ్లకే పరిమితమైయ్యామంటూ ఆవేదన.రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాల‌ నిర్వహణకు అనుమతి ఇచ్చిన పడమట పోలీసులు అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం. రామవరప్పాడు ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చిన పట్టించుకోవడం లేదంటున్న వ్యాపారస్తులు.వెంటనే వ్యాపారాలు చేసుకునేందుకు అనునతి ఇవ్వాలంటూ కలెక్టర్ ఇంతియాజ్ క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పెట్టే పోస్టులు ఫేస్‌బుక్ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ మీద సొంత ఉద్యోగులే అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణమైంది. కంపెనీ ఎప్పుడూ నిర్వహించే ఆల్‌హ్యాండ్స్‌ సమావేశంలో వారి నుంచి నిరసన వ్యక్తం అయింది. ట్రంప్‌ పెట్టే కొన్ని పోస్టుల విషయంలో కంపెనీ విధానాలకు విరుద్ధంగా మార్క్ వ్యవహరిస్తున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ.

* దేశీయ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ లాభాల్లో ముగిశాయి. బ్యాంక్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్ల అండతో సూచీలు దూసుకెళ్లాయి. చివర్లో అమ్మకాల ఒత్తిడి ఎదురవ్వడంతో భారీ లాభాలకు అవకాశం లేకుండా పోయింది. నిఫ్టీ తిరిగి 10 వేల మార్కును అందుకుంది.

* ఎయిరేషియా ఇండియా పైలట్ల వేతనాల్లో సగటున 40 శాతం మేర మే, జూన్‌ నెలలకు కోత విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కు ఏప్రిల్‌లోనే 20 శాతం కోత విధించారు. ఎగ్జిక్యూటివ్‌లకు 7-17 శాతం కోత పడింది. అయితే రూ.50,000 వరకు వేతనం లభించే వారికి ఎటువంటి కోత విధించలేదు. సంస్థలో 2500 మంది సిబ్బంది ఉండగా, వారిలో 600 మంది పైలట్లు. విమానం నడిపినా, నడపకున్నా పైలట్లకు 70 గంటలకు వేతనం ఇచ్చేవారు. ఇప్పుడు 20 గంటలకు తగ్గించారు. అందువల్ల వేతన కోత తప్పడం లేదని ఒక పైలట్‌ వివరించారు.

* బజాజ్‌ ఆటో విక్రయాలు మే నెలలో 70 శాతం క్షీణించాయి. 2019 ఇదే నెలలో 4,19,235 వాహనాలను విక్రయించిన బజాజ్‌ ఈ మేలో 1,27,128 వాహనాలనే విక్రయించగలిగింది. దేశీయ విక్రయాలు 2,35,824 నుంచి 83 శాతం క్షీణించి 40,074 కు పరిమితమయ్యాయి. మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 3,65,068 నుంచి 69 శాతం తగ్గి, 1,12,798కు పరిమితమయ్యాయి. దేశీయంగా ద్విచక్ర వాహనాల విక్రయాలు 2,05,721 నుంచి 81 శాతం క్షీణించి 39,286గా నమోదయ్యాయి. మొత్తం వాణిజ్య వాహన విక్రయాలు 54,167 నుంచి 74 శాతం క్షీణించి 14,330కి పరిమితమయ్యాయి. దేశీయంగా వీటి విక్రయాలు 30,103 నుంచి ఏకంగా 97 శాతం క్షీణించి 788 వాహనాలకు పరిమితమయ్యాయి. మొత్తం ఎగుమతులు కూడా 1,83,411 నుంచి 53 శాతం తగ్గి, 87,054 వాహనాలుగా నమోదయ్యాయి.

* కరోనా నేపథ్యంలో జీఎమ్‌ఆర్‌ గ్రూప్‌ తన ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం వరకు కోత వేయనుందని సమాచారం. అత్యున్నత స్థాయి అధికారులకు కోత గరిష్ఠంగా ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘సవరింపుల్లో భాగంగా ఉద్యోగులపై కంపెనీ చేసే వ్యయాల్లో(కాస్ట్‌ టు కంపెనీ) మార్పులు మే వేతనం నుంచి చేశార’ని పీటీఐకి ఆ వర్గాలు తెలిపాయి. ‘ఉద్యోగుల వేతనాల్లో మార్పులు జరిగాయ’ని జీఎమ్‌ఆర్‌ గ్రూప్‌ ప్రతినిధి ధ్రువీకరించారు. ‘ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార పనితీరుతో అనుసంధానమయ్యే ప్రత్యేక వేరియబుల్‌ కాంపోనెంట్‌ను జతచేర్చామ’ని తెలిపారు.