Kids

పిల్లలకు పొదుపు పాఠాలు చెప్పాలి

పిల్లలకు పొదుపు పాఠాలు చెప్పాలి

ఇప్పటి పిల్లలు.. అంతర్జాలాన్ని అవలీలగా వాడగలరు. ఎలాంటి కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకోగలరు. మరి ఈ ఆసక్తి డబ్బు విషయంలోనూ ఉందా? అనుమానమే కదూ! అన్ని విషయాల్లోనూ కనిపించే ఆసక్తిని చూసి మురిసిపోయే తల్లిదండ్రులు.. పిల్లలకు డబ్బు విషయాలు చెప్పడానికి మాత్రం వెనకడగు వేస్తారు. పిల్లల భవిష్యత్‌కు విద్య ఎంత ముఖ్యమో.. ఆర్థిక విజ్ఞానం కూడా అంతే అవసరం అని తల్లిదండ్రులు గమనించాలి. అప్పుడే వారు అన్నింటా విజయం సాధించగలరు. పిల్లలు ఏదైనా సరే స్వతహాగా నేర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. డబ్బు విషయంలో కూడా అంతే. కేవలం మాటలతో చెబితే వారికి ఏమాత్రం అర్థం కాదు. డబ్బుతో ముడిపడిన చిన్న చిన్న పనులు వారితోనే చేయించాలి. రూ.10, రూ.20 నోట్లను, కొన్ని నాణేలను వారి చేతికిచ్చి చిన్న చిన్న ఖర్చులకు చెల్లింపులు జరిపేలా చూడాలి. ఉదాహరణకు మీరు కిరాణా దుకాణానికి వెళ్తే.. అక్కడ అయిన ఖర్చును పిల్లలకు చెప్పి, అంత మొత్తమే ఇవ్వాలని చెప్పాలి. ఏదైనా వస్తువు కొనేముందు దాని ధరను ఎక్కడ ముద్రించి ఉంటుందో చూపించాలి. దానివల్ల వారికి డబ్బు ఎలా ఖర్చవుతుందో తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల వారికి డబ్బును ఖర్చు చేసే పద్ధతి తెలియడంతోపాటు, డబ్బు లెక్కలూ సులభంగా అర్థం అవుతాయి.

*** పొదుపు నేర్పుదాం!
డబ్బంటే ఖర్చులు ఒక్కటే కాదు కదా! పిల్లలకు పొదుపు చేయడమూ నేర్పాలి. ఖర్చు చేస్తున్నప్పుడు ఎంత డబ్బు మిగిల్చారో ఆ మొత్తాన్ని వారికి కేటాయించిన డిబ్బీలో వేసుకునేలా ప్రోత్సహించాలి. మూడేళ్ల వయసు నుంచే పొదుపు గురించి తెలిపే ప్రయత్నం జరగాలి. వయసు పెరుగుతున్న కొద్దీ చేతికి కొంత సొమ్ము ఇస్తూ.. అందులో కొంత ఖర్చు పెట్టుకునేలా, కొంత మిగిల్చుకుని దాచుకునేలా అలవాటు చేయాలి.

*** బ్యాంకులు తోడుగా…
పిల్లల కోసం బ్యాంకులు ప్రత్యేకంగా ఖాతాలను అందిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటు, ప్రైవేటు బ్యాంకులు కూడా ఈ ఖాతాలను అందిస్తున్నాయి. అయితే, ఇందులో రెండు రకాల ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు పిల్లల వయసుతో నిమిత్తం లేకుండా ఖాతాలను అందిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వ్యక్తిగత బ్యాంకింగ్ సేవ‌ల విభాగంలో పెహ్లా క‌ద‌మ్‌, పెహ్లీ ఉడాన్ అనే రెండు ర‌కాల పొదుపు ఖాతాలు మైన‌ర్ పిల్లల కోసం ప్రారంభించిన‌ట్లు తెలిపింది. ఈ ఖాతాలు మీ చిన్న పిల్లలను మంచి ఆర్థిక భవిష్యత్‌ కోసం సిద్ధం చేయడంలో సహాయపడతాయి, అంతేకాకుండా డబ్బును త్వరగా ఆదా చేసే అలవాటును పెంచుతాయి. వీటిలో పర్సనల్ చెక్ బుక్‌, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం-కమ్-డెబిట్ కార్డు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. కొన్ని బ్యాంకుల్లో పదేళ్లలోపు పిల్లలకు కూడా ఖాతాలు ప్రారంభించే వెసులుబాటు ఉంది. 10 ఏళ్ల వయసు దాటి 18 ఏళ్లలోపు ఉన్నవారికి దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఖాతాలను ప్రారంభించే వెసులుబాటు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కిడ్స్‌ అడ్వాంటేజీ అకౌంట్‌; ఐసీఐసీఐ బ్యాంకు యంగ్‌ స్టార్స్‌ అకౌంట్‌; కొటక్‌ మహీంద్రా మై జూనియర్‌ అకౌంట్‌; యాక్సిస్‌ బ్యాంకు ఫ్యూచర్‌ స్టార్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ పేర్లతో ఖాతాలను అందిస్తున్నాయి. పేర్లు వేరైనా ఈ ఖాతాల పనితీరు అంతా ఒకే రీతిన ఉంటుంది. డెబిట్‌ కార్డు, చెక్‌ బుక్‌లను కూడా ఇస్తారు. అయితే, తల్లిదండ్రుల అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి. కనీస నిల్వ బ్యాంకులను బట్టి రూ.1000 నుంచి రూ.5 వేల వరకూ ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకుల్లో రూ.250 నుంచి రూ.500 వరకూ కనీస నిల్వ ఉంటుంది. మీకు వీలున్న బ్యాంకులో పిల్లల పేరుమీద ఖాతా ప్రారంభించండి. కొన్ని బ్యాంకులు పిల్లల ఖాతాలు ప్రారంభించగానే అందమైన కిడ్డీ బ్యాంకును అందిస్తాయి. దీనికి రహస్య తాళం ఉంటుంది. బ్యాంకు శాఖలోనే దీన్ని తెరవాలి. ప్రతి నెలా నిర్ణీత తేదీన ఖాతా ఉన్న బ్యాంకుకు మీ పిల్లలను తీసుకెళ్లి అప్పటివరకూ వారు దాచుకున్న మొత్తాన్ని ఖాతాలో జమ చేసేలా చూడాలి. దీనివల్ల బ్యాంకు గురించి అవగాహన పిల్లలకు పెంచినవారమవుతాం. డబ్బు దాచుకునేందుకు పిల్లలను కూడా ఉత్సాహం వస్తుంది. ఈ సమయంలో ఇది వీలు కాకపోవచ్చు. కాబట్టి మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు జరిపేలా చూసుకోవచ్చు.

*** ప్రోత్సాహాలు అందించండి…
పెరిగే పిల్లలకు స్వతహాగా సంపాదించాలనే ఆలోచన కల్పించాలి. దీనికోసం వారికి చిన్న చిన్న పనులు అప్పగించి, వాటిని పూర్తి చేసిన తర్వాత కొంత మొత్తం ఇవ్వండి. ఇది మరీ ఎక్కువగా ఉండకూడదు. పని చేస్తేనే డబ్బులు వస్తాయనే జ్ఞానం కల్పించడమే లక్ష్యంగా ఇది సాగాలి. చేసిన పని ప్రాధాన్యాన్ని బట్టి డబ్బు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం. మీ పిల్లలు ఈ పని చేస్తే ఇన్ని డబ్బులు ఇస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందే చెప్పకండి. కేవలం వారు ఆ పని చేసినందుకు మెచ్చుకోలుగా మాత్రమే మీరిచ్చే సొమ్ము ఉండాలి. పదేళ్లు దాటిన పిల్లలకు వారి అవసరాలకు ఎంత మొత్తం అవుతుందో లెక్క చూసుకోమని చెప్పాలి. ఆ మొత్తాన్ని అందించడం ద్వారా వారు వృథా ఖర్చులు చేయకుండా అడ్డుకట్ట వేయవచ్చు.

*** చర్చల్లో భాగస్వామ్యం..
పిల్లల ముందు డబ్బు విషయాలు మాట్లాడటం చాలామందికి నచ్చదు. డబ్బు గురించి ఇప్పుడే చెబితే.. వారు పాడవుతారనీ అనుకుంటారు కొందరు. ఇవన్నీ గతం. పరిస్థితులు మారాయి. ఏది మంచి.. ఏది చెడు అని చెబితే అర్థం చేసుకుంటున్నారు నేటి తరం. పాఠశాలల్లో కూడా డబ్బుకు సంబంధించిన పాఠాలు నేర్పుతున్నారు. కాబట్టి, డబ్బుకు సంబంధించిన విషయాల గురించి నిరభ్యంతరంగా పిల్లల ముందు చర్చించవచ్చు. మీ కుటుంబ బడ్జెట్‌ రూపకల్పనలో వారినీ భాగస్వామిని చేయండి. అంటే పిల్లలకు ఆ నెలలో ఏం కావాలో అడగండి. బడ్జెట్‌ అనుమతిస్తే కొనివ్వండి. లేదంటే ఎందుకు కొనలేకపోతున్నామో వివరంగా చెప్పండి. అప్పుడే వారికి మీరు ఎలా కష్టపడుతుందీ డబ్బు విలువ ఏంటో తెలిసి వచ్చేది. ఇప్పుడు డబ్బు నిర్వహణకు సంబంధించి ఆన్‌లైన్‌లోనూ, మొబైల్‌ యాప్‌ల్లోనూ ఎన్నో వేదికలు ఉన్నాయి. వాటిని ఎలా వాడాలో పిల్లలకు నేర్పించాలి. మీ రోజువారీ ఖర్చులను ఒక కాగితం మీదా రాసి, తర్వాత పిల్లలను యాప్‌లో రాసేలా చూడాలి. దీనివల్ల వారికి భవిష్యత్‌లో డబ్బు నిర్వహణ ఎలా చేసుకోవాలో నేర్పించినట్లు అవుతుంది. అయితే, మీ బ్యాంకు ఖాతా, కార్డు వివరాలను మాత్రం పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి.

*** మీరూ జాగ్రత్తగా ఉండాలి…
డబ్బును మనం ఎలా ఖర్చు చేస్తున్నామన్న తీరు పిల్లలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులను అనుకరిస్తారు. కాబట్టి, పిల్లల ముందు ఖర్చు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకూ చిన్న నోట్లను అంటే రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను ఖర్చులకు వినియోగించాలి. అప్పుడు పిల్లలకు మనం తక్కువ ఖర్చు చేస్తున్నామనే భావన కలుగుతుంది. వారూ అలాగే చేయడానికి అలవాటుపడతారు. మీరు నిర్లక్ష్యంగా ఖర్చు చేస్తే.. పిల్లల్లోనూ అదే ధోరణి వచ్చే ప్రమాదం ఉంది.

*** ఎందుకో చెప్పాలి
* ఎందుకోసం పొదుపు చేస్తున్నామో పిల్లలకు వివరించలేకపోతే వారిలో ఉత్సాహం ఉండదు. అందుకే లక్ష్యాన్ని నిర్దేశించాలి. వారు చేస్తున్న పొదుపు వారి ఖర్చుల కోసమే అని వివరించాలి. పాఠశాల నుంచి విహార యాత్రలు, మిత్రులకు పుట్టిన రోజు బహుమతులు ఇవ్వడం, నచ్చిన ఆట వస్తువు కొనడం ఇలా ఏదో ఒక లక్ష్యంతో వారిని పొదుపు చేసేలా ప్రోత్సహించాలి.
* వారి వయసును బట్టి మెల్లగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆదాయ పన్ను గురించి చెప్పవచ్చు.
* పొదుపు నేర్పే క్రమంలో వారు మరీ పొదుపరులు కాకుండా జాగ్రత్తపడాలి.
* పిల్లల చదువులను, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రారంభించాలి. పీపీఎఫ్‌, మ్యూచువల్‌ ఫండ్లను ఇందుకోసం పరిశీలించవచ్చు.
* పిల్లల భవిష్యత్‌కు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ రాకుండా మీ పేరుపై తగిన మొత్తానికి జీవిత బీమా ఉండేలా చూసుకోండి.