DailyDose

జగన్…మీ ఊరు వస్తా…10వేల మందితో సభ పెడతా-తాజావార్తలు

Telugu Breaking News - Raghurama Says He Will Come To Pulivendula And Arrange A Meeting

* ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వ తీరుపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో అమరావతి భూముల అంశంపై సీబీఐ విచారణ జరపాలని దిల్లీలో ధర్నా చేశారు కానీ, అంతర్వేది ఘటనపై ఫ్లకార్డులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై దాడి చేస్తూ గాంధీ విగ్రహం వద్ద రచ్చ చేశారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చే హక్కు శాసనసభకు లేదన్న కనీస అవగాహన కూడా వైకాపా ప్రభుత్వానికి లేదని విమర్శించారు. న్యాయవ్యవస్థ వల్లే ప్రజలు అన్యాయం బారినపడకుండా బతుకుతున్నారని అన్నారు. ‘‘గత ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం వేయడం హాస్యాస్పదంగా ఉంది. మంత్రివర్గ ఉపసంఘం తర్వాత సిట్‌ ఏర్పాటు చేస్తే దానిపై కోర్టు స్టే ఇచ్చింది. మన ప్రభుత్వం కూడా భవిష్యత్తులో మాజీ ప్రభుత్వం అవుతుంది. అలా అని గత ప్రభుత్వ నిర్ణయాలను కొత్త ప్రభుత్వం సమీక్షించుకుంటూ పోతే ఎలా? న్యాయవ్యవస్థను తప్పుబట్టడం సరికాదు.. గౌరవించడం నేర్చుకోవాలి. న్యాయవ్యవస్థపై జరుగుతున్న దాడిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నా. సంస్కారహీనంగా మాట్లాడటం నాకు రాదు. నా మీద చెయ్యి వేస్తే నాకు రక్షణ కల్పించే వారు ఉన్నారు. నా నియోజకవర్గానికే కాదు.. పులివెందులకు కూడా వెళ్తా. కరోనా తగ్గాక అక్కడ పది వేల మందితో సభ పెడతా. భయపడే వ్యక్తిని కాదు. అమరావతి భూముల అంశంలో పునఃసమీక్ష కుదరదని హైకోర్టు చెప్పడం శుభపరిణామం’’ అని రఘురామ కృష్ణరాజు అన్నారు.

* గుజరాత్‌లోని కడిలో పూర్తిగా మహిళలు నిర్వహించే డెలివరీ స్టేషన్‌ను ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా నెలకొల్పింది. దేశంలో ఇటువంటి కేంద్రం రెండోది కావడం గమనార్హం. దేశ కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కంపెనీ తీసుకుంటోన్న చర్యల్లో ఇది భాగమని అమెజాన్‌ వెల్లడించింది. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌కు కడి 50 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామ జనాభా 80,000 మందిగా ఉంది. 2016లో కంపెనీ మొట్టమొదటి మహిళా డెలివరీ స్టేషన్‌ను చెన్నైలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి ఈ కేంద్రం కోసం 8 మంది మహిళలను కంపెనీ నియమించింది. వీరి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు 2-5 కి.మీ దూరంలో అసోసియేట్లు ప్యాకేజీలను డెలివరీ చేయడంలో సాయం కోసం ఈ నంబర్‌ను సంప్రదించే సౌలభ్యం ఉంది.

* టాటా గ్రూప్‌ షేర్లను తనఖా పెట్టడం ద్వారా నిధుల సమీకరించడానికి మిస్త్రీ కుటుంబం చేస్తున్న ప్రయత్నాలను అక్రమంగా అడ్డుకున్నందుకు టాటా సన్స్‌, బోర్డు సభ్యులు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ లీగల్‌ నోటీసులు పంపింది. టాటాసన్స్‌ నుంచి మిస్త్రీ ఉద్వాసనతో 2016 అక్టోబరు నుంచి టాటాలతో షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. టాటా సన్స్‌లో ఎస్‌బీ గ్రూప్‌నకు దాదాపు 18.37 శాతం వాటా ఉంది. స్టెర్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌, సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తరఫున ఎస్‌పీ గ్రూప్‌ లాయర్లు దేశాయ్‌, దివాన్‌జీలు సెప్టెంబరు 15న లీగల్‌ నోటీసు పంపారు. మూడు రోజుల్లోగా దీనిపై స్పందించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని నోటీసులో హెచ్చరించారు. దీనిపై మాట్లాడానికి ఏమీ లేదని టాటా సన్స్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారిలో టాటా సన్స్‌ బోర్డు, ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, బోర్డు సభ్యులు ఫరిదా ఖంబటా, వేణు శ్రీనివాసన్‌, అజయ్‌ పిరమాల్‌, రాల్ఫ్‌ స్పెత్‌, భాస్కర్‌ భట్‌, హరీశ్‌ మన్వానీ, సౌరభ్‌ అగర్వాల్‌, కంపెనీ కార్యదర్శి సుప్రకాశ్‌ ముఖోపాధ్యాయ్‌ ఉన్నారు.

* అధిక అద్దె చెల్లించే ప్రయారిటీ పథకం చందాదార్లకు అధికవేగంతో డేటా ఇస్తామన్న హామీని విరమించుకుంటున్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) తెలిపినట్లు సమాచారం. సవరించిన పథకం వివరాలను ట్రాయ్‌కు సమర్పించే యత్నంలో కంపెనీ ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా ‘అధికంగా చెల్లించండి.. ప్రాధాన్యతా సేవలు పొందండి’ అనే నినాదాన్ని తొలగిస్తున్నట్లు పేర్కొన్నాయి. 4జీలో అధికవేగంతో అపరిమిత డేటా అనేది ఈ పథకాల ఉద్దేశమని గతంలో సంస్థ తెలిపింది. ఇందుకు బదులుగా ప్రయారిటీ పథకాల వారికి లభించే వినోద పరమైన సదుపాయాలు (నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌), పర్యాటక ప్రోత్సాహకాలు, రవాణా ప్రయోజనాల వంటి వాటిని చూపుతున్నారు. ఈ పరిణామంపై స్పందించేందుకు వీఐఎల్‌ ప్రతినిధి నిరాకరించారు. కొన్ని వారాలుగా ప్రయారిటీ పథకాల వ్యవహారం ట్రాయ్‌ సమీక్షలో ఉన్న సంగతి విదితమే. వీఐఎల్‌కు షోకాజ్‌ కూడా ట్రాయ్‌ జారీ చేసింది. భారతీ ఎయిర్‌టెల్‌ కూడా ఇలాంటి పథకాన్నే ప్లాటినం ఆఫరింగ్‌గా ప్రకటించినా, ట్రాయ్‌ ఆదేశాల అనంతరం ఉపసంహరించింది.

* దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 125 పాయింట్లు ఎగబాకి 39,105 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 11,564 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.48 వద్ద కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లూ సానుకూలంగా కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ సూచీలు లాభపడుతున్నాయి.

* దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్‌ తన మూడో మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 2020ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించి అంచనాలు పెంచిన కియా మోటార్స్‌ ఇండియా.. తాజాగా లేటెస్ట్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మోడల్‌ కియా సోనెట్‌ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త సోనెట్‌ కారులో.. ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌, ఫైవ్‌ ట్రాన్స్‌ మిషన్‌ స్పీడ్‌ ఫీచర్లులున్నాయని సంస్థ తెలిపింది.

* అమెరికా అన్నంత పనే చేసింది. కరోనా వైరస్‌ మహమ్మారికి కారణమైన చైనా తీరుపై గుర్రుగా ఉన్న అగ్రరాజ్యం డ్రాగన్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్టు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటనలో పేర్కొంది. అమెరికా పౌరుల వ్యక్తిగతమైన సమాచారాన్ని చైనా సేకరిస్తోందని వాణిజ్య విభాగం కార్యదర్శి విల్‌బర్‌ రోస్‌ వెల్లడించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌కు చెందిన టిక్‌టాక్‌ కంపెనీ 100 మిలియన్ల మంది అమెరికా పౌరుల సమాచారాన్ని యాక్సిస్‌ చేస్తున్న నేపథ్యంలో భద్రతారంగం నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మిగతా ఆంక్షలను త్వరలోనే వెల్లడిస్తామని వాణిజ్య విభాగం తెలిపింది.

* కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లుపై వివాదం చెలరేగుతోంది. బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి హర్‌‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో… ప్రతిపక్షాలు దీనిని ఆయుధంగా వాడుకుంటున్నాయి. తాజాగా ఈ బిల్లు సెగ పంజాబ్‌తోపాటు వ్యవసాయ ఆధారిత రాష్ట్రం హరియాణాకు కూడా సోకింది. అక్కడ భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జన్నాయక్‌ జనతా పార్టీ (జేజీపీ)పై ప్రతిపక్ష కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. బిల్లును వ్యతిరేకిస్తూ హర్‌సిమ్రత్‌ కేంద్ర మంత్రి పదవికే రాజీనామా చేసినప్పుడు జేజీపీ అధ్యక్షుడు దుష్యంత్‌ చౌటాలా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయలేరా? అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా ప్రశ్నించారు. ‘‘దుష్యంత్‌ జీ.. హర్‌సిమ్రత్‌ కౌర్‌ను ఆదర్శంగా తీసుకొని మీరు డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలి. రైతుల కంటే కుర్చీకే మీరు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో భాజపాతో కలిసి అడుగులేయాలా? లేదా చిరకాల మిత్రపార్టీ అకాలీదళ్‌కు మద్దతివ్వాలన్నదానిపై జేజేపీ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.

* తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి గుమ్మనూరు జయరాం ఖండించారు. తన కుమారుడికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో అభిమానులున్నారని.. దీనిలో భాగంగా ఆయన చేతులుమీదుగా చాలా మంది బహుమతులు అందుకుంటారని చెప్పారు. అయ్యన్న చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆయన చెప్పిన బెంజ్‌ కారుకు తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. తన కుమారుడి పేరిట కారు రిజిస్ట్రేషన్‌ ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని జయరాం సవాల్‌ విసిరారు.

* అల్లం, తులసి, పసుపుతో రోగనిరోధక శక్తిని పెంచే పాలను హెరిటేజ్‌ ఫుడ్స్‌ మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారుల సౌకర్యార్ధం ఆన్‌లైన్‌లో పాలు, పాల పదార్థాలను కొనుగోలు చేసేందుకు అనువుగా ‘హెరిటేజ్‌ టచ్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ను నారా భువనేశ్వరితో కలిసి హెరిటేజ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ నారా బ్రాహ్మణి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆరోగ్యకర ఉత్పత్తులను రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారుల ఆరోగ్యం, సంతోషమే హెరిటేజ్‌ ప్రధాన ఉద్దేశమని బ్రాహ్మణి చెప్పారు. రోగనిరోధక శక్తి పెంచే పాల ఉత్పత్తుల తయారీలో ఎప్పటికప్పుడు కొత్తదారులు అన్వేషిస్తున్నామన్నారు. హెరిటేజ్‌ టచ్‌ యాప్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.

* పోలవరం ముంపు బాధితులకు ఆరునెలల్లో పునరావాసం, పరిహారం చెల్లించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశించింది. ఏపీలో బాధితులకు పునరావాసం, పరిహారంపై పెంటపాటి పుల్లారావు, తెలంగాణలో ముంపు ప్రభావానికి సంబంధించి పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై శుక్రవారం ఎన్జీటీ విచారణ చేపట్టింది. ముంపు ప్రభావంపై ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ నివేదికను ఎన్జీటీ ఆమోదించింది. కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న కమిటీ ప్రతిపాదనను ఎన్జీటీ తోసిపుచ్చింది. అంతర్రాష్ట్ర జలవివాదాల జోలికి వెళ్లకుండా పర్యావరణంపై ప్రభావం, బాధితులకు పరిహారం అంశాలపై విచారిస్తామని స్పష్టం చేసింది.

* జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు పడకగదుల ఇళ్ల పరిశీలనను కాంగ్రెస్‌ నేతలు నిలిపివేశారు. రెండోరోజు పరిశీలనలో భాగంగా మంత్రి తలసాని, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు (వీహెచ్) వెళ్లారు. ఇవాళ తుక్కుకూడ, రాంపల్లి ప్రాంతాల్లో ఇళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణాల పరిశీలన కార్యక్రమాన్ని అర్ధంతరంగా ఉపసంహరించుకున్నట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇళ్లను చూపిస్తామని తెరాస నేతలు సవాలు చేశారని.. ఇప్పటి వరకు 3,428 ఇళ్లను మాత్రమే చూపించారని భట్టి ఆరోపించారు.

* కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ రంగ బిల్లులు చరిత్రాత్మకమని, రైతులకు రక్షణ కవచంలా ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విపక్షాలు మాత్రం వీటిపై రైతులను తప్పుదోవ పట్టించొద్దని మండిపడ్డారు. ఈ బిల్లులతో రైతులకు సరైన ధర లభించదంటూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారన్నారు. బిహార్‌లో పలు రైల్వే ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్‌‌ మాధ్యమంలో ప్రారంభించిన మోదీ.. లోక్‌సభలో నిన్న ఆమోదం పొందిన వ్యవసాయ సంబంధిత బిల్లులపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్న విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు.

* మానవాళిని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ప్రపంచదేశాలు ఇప్పటికే నిమగ్నమయ్యాయి. అయితే, ప్రస్తుతం ఈ ప్రయోగాలన్నీ వయోజనులపైనే జరుగుతున్నాయి. తాజాగా వీటిని చిన్నారులు, టీనేజీ పిల్లలపై జరిపేందుకు చైనా సంస్థ సినోవాక్‌ సిద్ధమైంది. మూడు నుంచి 17ఏళ్ల వయస్సు కలిగిన వారిలో తొలి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సన్నాహాలు చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌లు ప్రపంచంలో అన్ని వయస్సుల వారిలో వైరస్‌ను సమర్థవంతంగా నిరోధించగలిగినప్పుడు మాత్రమే ఈ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడే పరిస్థితి నెలకొంది.

* అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్టు అమెరికాకు చెందిన ఓ మాజీ మోడల్‌ ఆరోపించారు. ఆయన తనను బలవంతంగా ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించారని ఆమె వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ ఆరోపణలు చోటుచేసుకోవటం గమనార్హం. 1997 యుఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ పోటీలు న్యూయార్క్‌లో జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అమీడోరిస్‌ అనే ఈ మాజీ మోడల్‌ వివరించారు. ఆ సమయంలో తాను ట్రంప్‌ను వారించినా.. అతను పట్టించుకోలేదని తెలిపారు.